‘మధ్యాహ్న భోజన’ బిల్లులు రాక అప్పుల బారిన నిర్వాహకులు

ABN , First Publish Date - 2022-01-20T05:06:34+05:30 IST

మండలంలోని పాఠశాలల మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లులు రాక నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు

‘మధ్యాహ్న భోజన’ బిల్లులు రాక  అప్పుల బారిన నిర్వాహకులు
మధ్యాహ్న పథకంలో భోజనం పంపిణీ చేస్తున్న నిర్వాహకులు

ఇబ్బంది పడుతున్న కార్మికులు


పొదలకూరు రూరల్‌, జనవరి 19 : మండలంలోని పాఠశాలల మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన బిల్లులు రాక నిర్వాహకులు ఇబ్బంది పడుతున్నారు. పేద పిల్లలకు కడుపు నిండా అన్నం పెడుతున్న కార్మికులపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని వాపోతున్నారు.  గడిచిన నాలుగు నెలలుగా బిల్లులు చెల్లించకపోవడంతో నిర్వాహకులు అప్పుల బారినపడుతున్నారు. బిల్లులు చెల్లింపుల్లో అధికారులు ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. పొదలకూరు మండలంలో మొత్తం 87 ప్రాథమిక, 11 ప్రాఽథమికోన్నత, 11 ఉన్నత పాఠశాలలు కలిపి మొత్తం 104 పాఠశాలలున్నాయి. అన్ని పాఠశాలల్లో  కమిటీలకు  బిల్లులు రావాల్సి ఉంది. 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆగస్టులో పాఠశాలలు ప్రారంభమయ్యాయి. సెప్టెంబరు నెల నుంచి నిర్వాహకులకు బిల్లులు రావాల్సి ఉంది. 2002లో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇందులో భాగంగా 1వ తరగతి నుంచి 6వ తరగతి విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.4.7పై, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు రూ.6.78పైసల చొప్పున ప్రభుత్వం చెల్లిస్తుంది. అది కూడా నెలనెలా సక్రమంగా చెల్లించరు. 4 నెలలుగా చెల్లించకపోవడంతో భోజన పథకం నిర్వాహకులు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి భోజన కార్మికులకు బకాయిలు చెల్లించాలని నిర్వాహకులు కోరుతున్నారు. 

Updated Date - 2022-01-20T05:06:34+05:30 IST