ఆలయ కుంభాభిషేకానికి హెలికాఫ్టర్‌లో వచ్చిన మధ్యతరగతి కుటుంబం

ABN , First Publish Date - 2022-06-15T15:16:03+05:30 IST

తమ స్వగ్రామంలో జరుగుతున్న ఆలయ కుంభాభిషేక వేడుకలను తిలకించేందుకు ఓ మధ్య తరగతి కుటుంబీకులు హెలికాఫ్టర్‌లో వెళ్లి సందడి చేశారు.

ఆలయ కుంభాభిషేకానికి హెలికాఫ్టర్‌లో వచ్చిన మధ్యతరగతి కుటుంబం

- సంభ్రమాశ్చర్యాలకు గురైన గ్రామస్తులు 

- తూత్తుకుడి జిల్లాలో ఘటన


చెన్నై, జూన్‌ 14 (ఆంధ్రజ్యోతి): తమ స్వగ్రామంలో జరుగుతున్న ఆలయ కుంభాభిషేక వేడుకలను తిలకించేందుకు ఓ మధ్య తరగతి కుటుంబీకులు హెలికాఫ్టర్‌లో వెళ్లి సందడి చేశారు. ఈ సంఘటన తూత్తుకుడి జిల్లా కోవిల్‌పట్టి సమీపంలోని తీత్తాంపట్టి గ్రామంలో జరిగింది. ఆ గ్రామానికి చెందిన బాలసుబ్రమణ్యం కొన్నేళ్లకు ఉపాధి నిమిత్తం గుమ్మిడిపూండికి వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ఆయనకు నటరాజన్‌, రాజదురై అనే కుమారులు ఉన్నారు. బాలసుబ్రమణ్యం, నటరాజన్‌  ఇనుముల వ్యాపారం చేస్తున్నారు. రాజదురై జౌళి దుకాణం నడుపుతున్నారు. నటరాజన్‌కు హెలికాఫ్టర్‌, విమానంలో ప్రయాణించాలని ఆశగా ఉండేది. ఆయన కుమారుడు మోహిత్‌కు కూడా తండ్రిలాగే హెలిక్యాఫ్టర్‌లో ప్రయాణించాలనుకునేవాడు. ఈ నేపథ్యంలో తమ గ్రామంలోని భద్రకాళియమ్మ ఆలయ కుంభాభిషేక వేడుకలు సోమవారం జరుగనున్నట్లు వారం రోజులకు ముందు బాలసుబ్రమణ్యంకు సమాచారం అందింది. ఆ వేడుకలకు హెలికాఫ్టర్‌లో వెళ్లాలని నటరాజన్‌ నిర్ణయించాడు. ఆ మేరకు బెంగళూరులో ఉన్న ఓ ప్రైవేటు సంస్థకు చెందిన హెలికాఫ్టర్‌ను బుక్‌ చేసుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం బాలసుబ్రమణ్యం, నటరాజన్‌, కోడలు సుందరవల్లి, మనుమడు మోహిత్‌, రెండో కుమారుడు రాజదురై కారులో రాత్రికి బెంగళూరుకు చేరుకున్నారు. సోమవారం ఉదయం బెంగళూరు నుండి ప్రైవేటు సంస్థ హెలికాఫ్టర్‌లో ఐదుగురూ స్వగ్రామానికి వచ్చారు. తమ గ్రామంలో హెలిక్యాఫ్టర్‌ దిగటం చూసిన గ్రామస్తులంతా పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతానికి చేరుకున్నారు. హెలికాఫ్టర్‌ నుంచి దిగిన బాలసుబ్రమణ్యం కుటుంబీకులను గ్రామస్తులు ఘనంగా స్వాగతించారు. అనంతరం ఆలయ కుంభాభిషేకంలో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత గ్రామస్తుల్లో కొందరిని హెలికాఫ్టర్‌లో ఓ రౌండ్‌ కొట్టించారు. ఆ తర్వాత మళ్లీ హెలికాఫ్టర్‌లో బెంగళూరుకు తిరిగివెళ్లారు. 

Updated Date - 2022-06-15T15:16:03+05:30 IST