అర్ధరాత్రి బదిలీలు

ABN , First Publish Date - 2022-07-01T07:21:48+05:30 IST

అర్ధరాత్రి వరకు ఉద్యోగుల బదిలీలు కొనసాగాయి. తెల్లారేసరికి బాధ్యతలు తీసుకోనున్నారు. బదిలీల ప్రక్రియ ప్రారంభించి నేటికి నెలరోజులు పూర్తయినా గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాతే అన్ని శాఖల కార్యాలయాల నుంచి ఉద్యోగులకు బదిలీల ఉత్తర్వులు మెయిల్స్‌ ద్వారా పంపించారు.

అర్ధరాత్రి బదిలీలు

  • తెల్లారే సరికి బాధ్యతలు
  • బదిలీలకు నెలరోజులు సమయం ఇచ్చినా అర్ధరాత్రి దాటిన తరువాతే నియామకాలు
  • అంతా మెయిల్‌ ద్వారా నియామక పత్రాలు
  • ఎక్కడికక్కడ సిఫార్సు లెటర్ల ప్రాముఖ్యత

భానుగుడి(కాకినాడ), జూన్‌ 30: అర్ధరాత్రి వరకు ఉద్యోగుల బదిలీలు కొనసాగాయి. తెల్లారేసరికి బాధ్యతలు తీసుకోనున్నారు. బదిలీల ప్రక్రియ ప్రారంభించి నేటికి నెలరోజులు పూర్తయినా గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాతే అన్ని శాఖల కార్యాలయాల నుంచి ఉద్యోగులకు బదిలీల ఉత్తర్వులు మెయిల్స్‌ ద్వారా పంపించారు. తెల్లారేసరికి ఉద్యోగులు బదిలీ ఉత్తర్వులు తీసుకుని తమ పోస్టింగ్‌లో చేరేలా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

ఉమ్మడి జిల్లాలో 42కుపైగా ప్రభుత్వ శాఖలు వివిధ సెక్షన్‌లో అధికారులు, సిబ్బంది బదిదీల నియామకాలు గురువారం అర్ధరాత్రి వరకు కొనసాగాయి. అర్ధరాత్రి తర్వాత ఉత్తర్వులు జారీ చేయడం వెనుక ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల సిఫార్సు లెటర్ల ప్రాముఖ్యత ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ఉద్యోగి ఐదేళ్లు పూర్తయిన తర్వాత బదిలీ ఆప్షన్‌ పెట్టుకోవడంతోపాటు కుటుంబసభ్యుల్లో ఎవరికైనా ఆరోగ్య సమస్యలు ఉంటే వారికి మినహాయింపు ఉంది. ఇక్కడ నచ్చిన చోట ఉద్యోగులు పనిచేసేందుకు ఆసక్తి చూపడంతో నెలరోజులుగా రాజకీయ నాయకులు చుట్టూప్రదక్షణలు చేసి సిఫార్సు లెటర్లను ఉన్నతాధికారులకు అందజేశారు. శుక్రవారం బాధ్యతలు తీసుకున్నాక ఉద్యోగాల్లో సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు రెండు రోజులు కూడా సెలవులు రావడంతో ఎటువంటి ఇబ్బందులు లేకుండా బదిలీల ప్రక్రియ అర్ధరాత్రి వరకు జరిగేలా చూశారు. 

అన్నవరం దేవస్థానంలో 30మంది బదిలీలు

అన్నవరం, జూన్‌ 30: ప్రభుత్వం ఐదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్న ఉద్యో గులను బదిలీ చేయాలన్న ఆదేశాలతో దేవదాయశాఖలో భారీగా బదిలీ లు జరిగాయి. మునుపెన్నడూలేని విధంగా అన్నవరం దేవస్థానంనుంచి వివిధ కేడర్లలో 76మంది జాబితాతో ఫైలు సిద్ధం చేసి దేవదాయ కమిషనర్‌కు నివేదించారు. వీరిలో రికార్డు అసిసెంట్లను మినహాయించి బదిలీ చేస్తూ దేవదాయ కమిషనర్‌ హరిజవహర్‌లాల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. వీరిలో అన్నవరం దేవస్థానం నుంచి ప్రస్తుతం అందిన జాబితా ప్రకారం ఒక ఎగ్జిక్యూటీవ్‌ ఇంజనీర్‌, 9మంది సీనియర్‌ అసిస్టెంట్లు, 11 జూనియర్‌ అసిస్టెంట్లు, ముగ్గురు సూపరిటెండెంట్లు, ఒక ఈఈ, ఒక డీఈ, ఇద్దరు ఏఈలను వివిధ దేవస్థానాలకు బదిలీ చేస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మున్సిపల్‌ పాఠశాలలు..

విద్యాశాఖకు బదిలీ

కాకినాడ డీఈవో కార్యాలయానికి అందజేత

కాకినాడ రూరల్‌, జూన్‌ 30: మున్సిపల్‌ పాఠశాలల పర్యవేక్షణ, పరిపాలనా బాధ్యతలను విద్యాశాఖకు బదిలీ చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో ఇప్పటినుంచి వాటి పర్యవేక్షణ, అజమాయిషీ, పాలనా వ్యవహారాలను విద్యాశాఖ చూడనుంది. జడ్పీ, మండల పరిషత్‌ పాఠశాలలకు అనుసరిస్తున్న విధాన ప్రక్రియనే వీటికి అమలు చేయనున్నారు. కాకినాడ జిల్లాలోని కాకినాడ కార్పొరేషన్‌లో 67 పాఠశాలలు, పిఠాపురం 25, సామర్లకోట 17, పెద్దాపురం 26, తుని మున్సిపాలిటీలో 19 పాఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయుల, విద్యార్థుల వివరాలను కాకినాడ డీఈవో కార్యాలయానికి అందజేశారు. ఈ పాఠశాలలన్నీ విద్యాశాఖ అధీనంలోకి వెళ్లడంతో ఇప్పటినుంచి పురపాలక సంఘాల అజమాయిషీ ఉండదు. నాడు నేడు కార్యక్రమంలో భాగంగా పాఠశాల అభివృద్ధి, ఆంగ్ల మాధ్యమం అమలు మొదలైన అంశాల్లో మెరుగుకోసమే విద్యాశాఖలో విలీనం చేసినట్లు ప్రభుత్వం చెబుతోంది. పురపాలక సంఘాల పాఠశాలల విలీనాన్ని కొన్ని ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. గతంలో పదో తరగతి పరీక్షల సన్నద్ధతకు పురపాలక అధికారులు ఒక ప్రణాళికను, విద్యాశాఖ మరొక ప్రణాళికను ఇచ్చేవి. ఈ విధంగా అన్ని అంశాల్లో పాఠశాలలు నిర్వహించే కార్యక్రమాలపై ప్రణాళిక వేరువేరుగా ఉండేది. ఉపాధ్యాయులకు శిక్షణ తదితర అంశాలకు సంబంధించి కూడా వేర్వేరు కార్యక్రమాలు నిర్వహించేవారు.

Updated Date - 2022-07-01T07:21:48+05:30 IST