అర్ధరాత్రి.. అంతర్‌‘జాలం’!!

ABN , First Publish Date - 2022-04-09T07:13:48+05:30 IST

హైదరాబాదీలకు నిద్ర కంటే సోషల్‌ మీడియానే ఎక్కువైంది.

అర్ధరాత్రి.. అంతర్‌‘జాలం’!!

  •  దేశంలోనే అత్యధిక లేట్‌నైట్‌ నెటిజన్లు హైదరాబాద్‌లోనే
  •  ఆలస్యంగా పడుకున్నా.. ముందుగా నిద్రలేచేదీ హైదరాబాదీలే 
  •  ‘వేక్‌ఫిట్‌’ అధ్యయన నివేదిక 


హైదరాబాద్‌ సిటీ, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): హైదరాబాదీలకు నిద్ర కంటే సోషల్‌ మీడియానే ఎక్కువైంది. నెటిజన్లలో అత్యధికంగా 41 శాతం మంది అర్ధరాత్రి తర్వాత కూడా స్మార్ట్‌ఫోన్లు చూస్తూ.. ఫేస్‌బుక్‌, ట్విటర్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌, యూట్యూబ్‌ వంటి యాప్‌లలో మునిగి తేలుతున్నారు. లేట్‌ నైట్‌ సోషల్‌ మీడియా వినియోగంలో దేశంలోనే మొదటిస్థానంలో హైదరాబాద్‌ ఉందని ‘వేక్‌ఫిట్‌’ సంస్థ వెల్లడించింది.


ఏడాది పాటు దేశవ్యాప్తంగా పలు మెట్రో నగరాలలో 30వేల మంది నెటిజన్లపై అధ్యయనం చేసి రూపొందించిన ‘గ్రేట్‌ ఇండియన్‌ స్లీప్‌ స్కోర్‌ కార్డ్‌ -2022’ వార్షిక నివేదికలో ఈ వివరాలను ప్రస్తావించింది. లేట్‌నైట్‌ బ్రౌజింగ్‌లో అగ్రస్థానంలో ఉన్నా.. హైదరాబాదీ నెటిజన్లలో 15 శాతం మంది ఉదయాన్నే నిద్ర లేస్తున్నారట! వారిలో 49 శాతం మంది ఆఫీసులో నిద్ర ముంచుకొస్తోందని బదులిచ్చారు. వీరిలో 53 శాతం మంది ఐటీ ఉద్యోగులే..! ఆఫీసు వేళల్లో నిద్రమత్తుతో గడుపుతున్న వారి సంఖ్య గతఏడాది 20 శాతం ఉండగా, ప్రస్తుతమది 49 శాతానికి చేరిందని ‘వేక్‌ఫిట్‌’ పేర్కొంది.


నిద్రపోయే దాకా అంటిపెట్టుకొని.. 

నిద్రకు ఉపక్రమించే వరకూ ఫోన్‌నే అంటిపెట్టుకొని ఉంటున్నామని సర్వేలో పాల్గొన్న 87 శాతం మంది వెల్లడించారు. నిద్రలేమితో బాధపడుతున్న వారి సంఖ్య హైదరాబాద్‌లో 32 శాతం పెరిగినట్లు సర్వేలో తేలింది. వీరిలో 28 శాతం మంది.. కరోనా తర్వాత తమ భవిష్యత్‌ ఎలా ఉంటుందోననే భయంతో రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోవడం లేదు. మగవారితో పోలిస్తే ఆడవారిలోనే అధికంగా నిద్రలేమి భయాలు ఉన్నట్లు గుర్తించారు. అర్థరాత్రిళ్లు కూడా .. వాట్సాప్‌లో నోటిఫికేషన్‌ రాగానే తెరిచి చూస్తున్న హైదరాబాదీలలో 67 శాతం మంది ఉదయం త్వరగా నిద్ర లేస్తున్నారు. 



బానిసలుగా మారామని గుర్తించి..

సోషల్‌ మీడియా వ్యసనంతో సెల్‌ఫోన్‌కు బానిసలుగా మారామని గుర్తించిన దాదాపు 39 శాతం మంది.. నిద్రకు ముందు దానికి దూరంగా ఉంటున్నామని సర్వేలో వెల్లడించారు. ఇలాంటివాళ్లు ‘త్వరగా నిద్రపోవాలి.. త్వరగా మేల్కొనాలి’ అనే సూత్రాన్ని ఆచరించడానికి ప్రయత్నిస్తున్నారు. మరీ ముఖ్యంగా రాత్రి 10 గంటల్లోగా నిద్రపోవడానికి ప్రయత్నిస్తున్నామని 45 శాతం మంది చెప్పారు. దేశంలోని ఇతర మెట్రో నగరాలతో పోలిస్తే నిద్ర పరంగా మంచి అలవాట్లను పాటించే విషయంలో హైదరాబాదీలు ముందంజలో ఉన్నారు.


Updated Date - 2022-04-09T07:13:48+05:30 IST