స్పందన అంతంతే!

ABN , First Publish Date - 2022-06-27T06:50:01+05:30 IST

జగనన్న ప్రభుత్వం కొత్తగా చేపట్టిన రియల్‌ వ్యాపారానికి జిల్లాలో పెద్దగా స్పందన కనిపించడం లేదు.

స్పందన అంతంతే!

ఎంఐజీ ప్లాట్లకు కానరాని డిమాండ్‌ 

రెండు నెలలైనా అదే తీరు

మొత్తం ప్లాట్లు 2,310

అందిన దరఖాస్తులు 306

దరఖాస్తుతో డబ్బు కట్టింది కేవలం 70 మందే

నేటితో ముగియనున్న గడువు  

ప్రైవేటు భాగస్వామ్యంతో ముందుకు వెళతామంటున్న అధికారులు 


(విశాఖపట్నం, ఆంధ్రజ్యోతి)

జగనన్న ప్రభుత్వం కొత్తగా చేపట్టిన రియల్‌ వ్యాపారానికి జిల్లాలో పెద్దగా స్పందన కనిపించడం లేదు. మధ్య తరగతి ప్రజలకు మార్కెట్‌ ధరల కంటే తక్కువ రేటుకే ఇళ్ల స్థలాలు ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం వాటికి ‘ఎంఐజీ’ లేఅవుట్లుగా నామకరణం చేసింంది.  ఈ ప్రక్రియకు నాలుగు నెలల క్రితం వీఎంఆర్‌డీఏ శ్రీకారం చుట్టింది. ఇందుకోసం ప్రభుత్వ భూములను కాకుండా రైతుల నుంచి 302 ఎకరాల అసైన్డ్‌ భూములను ల్యాండ్‌పూలింగ్‌లో భాగంగా తీసుకుంది. అయితే లేఅవుట్‌ అభివృద్ధి చేయకుండా, కనీసం తుప్పలు కూడా కొట్టకుండానే 150, 200, 240 గజాల చొప్పున ప్లాట్లు అమ్మకానికి పెట్టింది. రేట్లు కూడా స్థానిక ధరల కంటే ఎక్కువగా నిర్ణయించి, ఏప్రిల్‌ నెలాఖరులో ప్రకటన ఇచ్చింది. ప్లాట్టు కావాలనుకునే వారంతా నెల రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని కోరింది. 

ఆనందపురం మండలంలోని పాలవలస, రామవరం, గంగసాని అగ్రహారాల పరిధిలో నాలుగు లేఅవుట్లును గుర్తించి ఏకంగా 2,310 ప్లాట్లను అమ్మకానికి పెట్టింది. పాలవలసలో గజం రూ.18వేలుగా ధర నిర్ణయించింది. అయితే అక్కడ ప్రైవేటు రియల్‌ ఎస్టేట్‌ సంస్థలు గజం రూ.12వేలకే అందిస్తున్నాయి. రామవరం, గంగసానిఅగ్రహారం లేఅవుట్లలో ప్రభుత్వం గజం రూ.14వేలు ధర నిర్ణయించగా అక్కడ రిజిస్ట్రేషన్‌ ధర రూ.4వేలు మాత్రమే ఉంది. బహిరంగ మార్కెట్లో రూ.10వేలు పలుకుతోంది. 


ఇవీ నిబంధనలు 

ఏడాదికి రూ.18 లక్షల లోపు ఆదాయం ఉన్న ఎవరైనా ప్లాట్ల కొనుగోలుకు దరఖాస్తు చేసుకోవచ్చునని అధికారులు ప్రకటించారు. దరఖాస్తుతో పాటు ప్లాటు ధరలో 10 శాతం అడ్వాన్సుగా చెల్లించాలని, నెల రోజుల్లో మరో 30 శాతం, 6 నెలల్లోపు ఇంకో 30శాతం, ఏడాదిలోగా మిగిలిన 30శాతం చెల్లించాలని నిబంధన పెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్లాట్లలో రిజర్వేషన్‌, ధరలో రాయితీ ప్రకటించారు. మే 28నాటికి దరఖాస్తులు అందాలని పేర్కొన్నారు. అయితే పెద్దగా స్పందన లేకపోవడంతో మరో నెల రోజులు గడువు పెంచారు. జూన్‌ 27 లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. 

ఈనేపథ్యంలో వీఎంఆర్‌డీఏ అధికారులను సంప్రతిస్తే దిమ్మతిరిగే వాస్తవాలు వెలుగుచూశాయి. నాలుగు లేఅవుట్లలో 2,310 ప్లాట్లు అమ్మకానికి పెట్టి, రెండు నెలలు గడువు ఇస్తే కేవలం 306 మాత్రమే దరఖాస్తులు వచ్చాయి. సాధారణంగా ఇలాంటి వ్యవహారాల్లో ప్లాట్ల సంఖ్యకు రెండు మూడు రెట్లు, ఒక్కోసారి ఐదారు రెట్లు దరఖాస్తులు వస్తాయి. దీంతో ఈ ప్లాట్లపై ప్రజలకు మోజు లేదని చెప్పడానికి నిదర్శనం అన్నట్టు కేవలం 13శాతమే దరఖాస్తులు అందాయి. అంతేకాకుండా దరఖాస్తు చేసిన వారంతా ప్లాటు విలువలో పది శాతం ముందుగా చెల్లించాలి. ఉదాహరణకు పాలవలసలో 100 గజాల ప్లాటు కావాలనుకుంటే గజం రూ.18వేలు చొప్పున రూ.18 లక్షలు అవుతుంది. దరఖాస్తుతో 10శాతం అంటే రూ.1.8 లక్షలు చెల్లించాలి. అయితే మొత్తం ప్లాట్లకు దరఖాస్తు చేసుకున్న 306 మందిలో కేవలం 70 మంది మాత్రమే దరఖాస్తుతో సహా డబ్బు చెల్లించారు. ఇది మూడో వంతు మాత్రమే. ఇలా చూసుకుంటే మూడు శాతం మంది మాత్రమే ఆసక్తితో ముందుకు వచ్చినట్టు. అసలు అక్కడ ఏ పనులు చేపట్టకుండానే ప్లాట్లు అమ్మకానికి పెట్టారని తెలిస్తే.. వారు కూడా డబ్బులు వెనక్కి తీసుకునే ప్రమాదం ఉంది. ఈ వాస్తవాలు గ్రహించి అధికారులు వెనక్కి తగ్గుతారా? లేదంటే.. మరో నెల రోజులు గడువు పెంచుతారా? అనేది వేచి చూడాలి.


ప్రైవేటు భాగస్వామ్యమని మరో నిర్ణయం

జగనన్న ఎంఐజీ ప్లాట్లకు ప్రభుత్వ భూములు అందుబాటులో లేనిచోట ప్రైవేటు సంస్థలను భాగస్వాములుగా చేర్చుకొని ప్లాట్లు వేసి తక్కువధరకు విక్రయిస్తామని రాష్ట్ర మంత్రి వర్గంలో గురువారం నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ ప్రభుత్వం అసలు నిజం గుర్తించడం లేదు. ప్రభుత్వం నిర్ణయిస్తున్న ధరలు... ప్రైవేటు కంటే ఎక్కువ. అందుకే ఎవరూ ముందుకు రావడం లేదు. ఇంకా వారితో కలిసి ధరల నిర్ణయం అంటే.. దోపిడీ కోసమేనని అర్థమవుతోంది. విశాఖపట్నం పరిసరాల్లోనే స్పందన లేదంటే... మరో అడుగు ముందుకేసి నియోజకవర్గ కేంద్రాల్లో ఎంఐజీ లేఅవుట్లు వేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదంతా చూస్తుంటే... పేదల దగ్గరున్న అసైన్డ్‌ భూములను ఏదో వంకతో తీసుకోవడానికే ఇలా చేస్తున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 


ఇదీ లేఅవుట్లకు లభించిన స్పందన

----------------------------------------------------------------------------------------------------

గ్రామం                  ప్లాట్ల సంఖ్య       వచ్చిన దరఖాస్తులు   డబ్బు కట్టినవారు

-----------------------------------------------------------------------------------------------------

పాలవలస                446                  170               51

రామవరం               869                    32                 6

గంగసానిఅగ్రహారం-1     697                    86                10

గంగసానిఅగ్రహారం-2     298                    18                 3

------------------------------------------------------------------------------------------------------

 మొత్తం              2,310                    306                70

-----------------------------------------------------------------------------------------------------

Updated Date - 2022-06-27T06:50:01+05:30 IST