కార్మికులు కావలెను

ABN , First Publish Date - 2020-07-14T10:45:56+05:30 IST

కరోనా దెబ్బకు సంగారెడ్డి జిల్లాలోని చిన్న, సూక్ష్మ పరిశ్రమలు మూగబోయాయి. జిల్లాలోని

కార్మికులు కావలెను

పరిశ్రమల ఎదుట వేలాడుతున్న బోర్డులు

స్వరాష్ట్రాలకు తరలిన వలస కార్మికులు

ఎక్కువ జీతం ఇస్తామన్నా ముందుకు రాని స్థానిక యువత

ఇప్పటికే కరోనా కాటుకు నష్టాల ఊబిలో పరిశ్రమలు

30 శాతం ఉత్పత్తితో నెట్టుకొస్తున్న యాజమాన్యాలు

లాక్‌డౌన్‌లో మూడు నెలల ఫిక్స్‌డ్‌ కరెంటు బిల్లులతో మరింత నష్టం


చిన్న పరిశ్రమలు ప్రస్తుతం పెద్ద ఆపదలో చిక్కుకున్నాయి. అసలే కరోనా కాటుతో కొట్టుమిట్టాడుతుండగా కార్మికుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. లాక్‌డౌన్‌ సడలింపుల అనంతరం ఉన్న ఆర్డర్లతోనైనా నెట్టుకువద్దామనుకుంటే కార్మికులు సొంత రాష్ట్రాలకు తరలి వెళ్లడంతో ఉత్పత్తికి తీవ్ర అవరోధంగా మారింది. పారిశ్రామికవాడల్లో ఎక్కడ చూసినా పరిశ్రమల ఎదుట గేట్లకు కార్మికులు కావలెను అనే బోర్డులే దర్శనమిస్తున్నాయి. సాధారణ వేతనాల కంటే ఎక్కువగా ఇస్తామని చెబుతున్నా ఈ పనులను చేసేందుకు స్థానిక యువత ముందుకు రాని విచిత్ర పరిస్థితి నెలకొన్నది. యజమాన్యాలు ఇతర రాష్ట్రాల కార్మికులను రప్పించేందుకు ఎస్పీకి విన్నవించుకునే పరిస్థితి ఏర్పడింది. మరోవైపు మూడు నెలల కరెంటు బిల్లుల భారానికి తోడు ప్రభుత్వ ప్రోత్సాహం కరువవడంతో చిన్న పరిశ్రమలు మరింత నష్టాల ఊబిలో కూరుకుపోతున్నాయి.



ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సంగారెడ్డి, జూలై 13 : కరోనా దెబ్బకు సంగారెడ్డి జిల్లాలోని చిన్న, సూక్ష్మ పరిశ్రమలు మూగబోయాయి. జిల్లాలోని పటాన్‌చెరు, పాశమైలారం, ఐడీఏ బొల్లారం, అశోక్‌నగర్‌ తదితర పారిశ్రామిక వాడల్లోని పరిశ్రమల్లో నిశ్శబ్దం రాజ్యమేలుతోంది. జిల్లాలోని ప్రధాన పారిశ్రామికవాడల్లో పెద్ద పరిశ్రమలకు అనుబంధంగా నడుస్తున్న చిన్న పరిశ్రమల్లో సైతం ఉత్పత్తి పూర్తిగా తగ్గిపోయింది. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత చేతిలో ఉన్న ఆర్డర్లతోనైనా నెట్టుకువద్దామనుకుంటే కార్మికులు లేకపోవడంతో చిన్న పరిశ్రమలపై పెద్ద దెబ్బ పడింది. సుమారు 2 వేల చిన్నతరహా పరిశ్రమలు కేవలం 30 శాతం కార్మికులతో ఉత్పత్తి కొనసాగిస్తున్నాయి. పలు పరిశ్రమల్లోని స్కిల్డ్‌, అన్‌స్కిల్డ్‌ కార్మికులంతా బిహార్‌, ఛత్తీస్‌ఘడ్‌, ఉత్తరప్రదేశ్‌, బెంగాల్‌ రాష్ట్రాలకు చెందినవారే. వారంతా కరోనా ఎఫెక్ట్‌తో స్వరాష్ట్రాలకు తరలిపోవడంతో ఆయా పరిశ్రమలు బోసిపోతున్నాయి.  


ఉద్యోగాలకు ముందుకు రాని స్థానిక యువత

పరిశ్రమలు ఎక్కువగా ఉన్న పటాన్‌చెరు నియోజవకర్గం పరిధిలోని పారిశ్రామికవాడల నుంచి లాక్‌డౌన్‌ సమయంలో సుమారు 35 వేల మంది కార్మికులు స్వరాష్ట్రాలకు వెళ్లిపోయారు. కరోనా ఉధృతి రోజురోజుకూ పెరిగిపోవడంతో కార్మికులు తిరిగి వచ్చే పరిస్థితి ఇప్పుడిప్పుడే కనిపించడం లేదు. దీంతో టీఎ్‌సఐఐసీ సర్వీస్‌ సొసైటీలు రంగంలోకి దిగాయి. ఏకంగా వాట్సాప్‌ నెంబర్లు ఇచ్చి ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తున్నా స్థానిక యువత నుంచి స్పందన కనిపించడం లేదు. పారిశ్రామికవాడల్లో ప్రస్తుతం 15 వేల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని పేర్కొంటున్నారు. సాధారణ వేతనాల కంటే ఎక్కువగా ఇస్తామని చెబుతున్నా యువత ముందుకు రాని దుస్థితి ఏర్పడింది.  


కార్మికులను రప్పించేందుకు ఎస్పీకి వినతి

పారిశ్రామికవాడలోని ఓ చెప్పుల పరిశ్రమలో కార్మికులు లేక ఉత్పత్తి నిలిచిపోవడంతో ఆ పరిశ్రమ యాజమాన్యం జిల్లా ఎస్పీకి దరఖాస్తు చేసుకున్నది. ఎస్పీ అనుమతితో ఇతర రాష్ట్రాల నుంచి వందమంది కార్మికులను ప్రత్యేకంగా రప్పించుకున్నారని తెలిసింది. స్వరాష్ట్రాలకు వెళ్లిన కార్మికులను ప్రభుత్వం చొరవ తీసుకుని తిరిగి  రప్పించేందుకు ఏర్పాట్లు చేస్తేనే పరిశ్రమల్లో ఉత్పత్తి పునరుద్ధరణ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.


చిన్న పరిశ్రమలపై కనికరించని ప్రభుత్వం

ఉపాధి రంగంలో 60శాతం ఉద్యోగాలను ఇస్తున్న చిన్న పరిశ్రమలు  ప్రస్తుతం నష్టాల సుడిగుండంలో చిక్కుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏ రకంగానూ ఆదుకోవడం లేదని పారిశ్రామికవేత్తలు వాపోతున్నారు. లాక్‌డౌన్‌ సమయానికి మూడు నెలల విద్యుత్‌ ఫిక్స్‌డ్‌ కరెంటు బిల్లులను మాఫీ చేయాలని కోరుతున్నా కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమల్లో మూడు నెలల పాటు పనులు జరగకున్నా ఫిక్స్‌డ్‌ బిల్లుల పేరుతో లక్షలాది రూపాయలను ముక్కుపిండి వసూలు చేయడం ఎంతవరకు న్యాయమని వారు ప్రశ్నిస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో చిన్న పరిశ్రమల ఫిక్స్‌డ్‌ కరెంటు బిల్లులను పూర్తిగా మాఫీ చేశారు. మన ప్రభుత్వం మాత్రం వసూలు చేస్తున్నదని పారిశ్రామికవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 


ప్రభుత్వం ఆదుకుంటేనే గట్టెక్కే పరిస్థితి: కలా రమేష్‌, పటాన్‌చెరు ఐలా చైర్మన్‌ 

కరోనా ప్రభావంతో చిన్న పరిశ్రమలు దారుణంగా నష్టపోయాయి. ఈ సంవత్సరం పన్నుల్లో భారీ రాయితీ ప్రకటిస్తే గాని కోలుకునే పరిస్థితి లేదు. లాక్‌డౌన్‌ సమయంలో విద్యుత్‌ ఛార్జీలను పూర్తిగా రద్దు చేయాలి. పెద్ద ఎత్తున స్థానిక యువతకు ఉద్యోగాలను కల్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. నైపుణ్యం ఉన్న ఇతర రాష్ట్రాల కార్మికులను తిరిగి రప్పించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి.


కార్మికులను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి: నర్సింహారెడ్డి, ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు 

లాక్‌డౌన్‌లో మూతపడ్డ రోజులకు కార్మికులందరికీ వేతనాలు చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కరోనాతో పారిశ్రామికవాడల్లో సుమారు 50 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారు. కనీసం అద్దెలు చెల్లించలేని పరిస్థితుల్లో కుటుంబాలతో సహా తమ సొంతూళ్లకు తిరిగి వెళ్లిపోయారు. యువతకు ఉపాధిని అందించడంలో కీలకపాత్ర పోషిస్తున్న చిన్న పరిశ్రమను ఆదుకునేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలి. చిన్న పారిశ్రామికవేత్తలతో తక్షణం ముఖ్యమంత్రి సమావేశమై వారి సమస్యలపై చర్చించాలి.

Updated Date - 2020-07-14T10:45:56+05:30 IST