గతేడాది తమ కుటుంబాలకు 605 బిలియన్ డాలర్లు పంపించిన వలసకార్మికులు.. యూఎన్ అధ్యయనంలో వెల్లడి!

ABN , First Publish Date - 2022-06-18T00:42:17+05:30 IST

గ్లోబలైజేషన్ పుణ్యమా అనేక మంది కార్మికులు విదేశాలకు వలసపోయి పొట్టనింపుకుంటున్నారు. స్వదేశంలోని తమ వారి అవసరాలు కూడా తీర్చగలుగుతున్నారు. అయితే.. గతేడాది వివిధ దేశాల్లోని వలసకార్మికులు తమ సొంతదేశాలకు ఏకంగా 605 బిలియన్ డాలర్లకుపైగా నిధులు పంపించారు.

గతేడాది తమ కుటుంబాలకు 605 బిలియన్ డాలర్లు పంపించిన వలసకార్మికులు.. యూఎన్ అధ్యయనంలో వెల్లడి!

ఎన్నారై డెస్క: గ్లోబలైజేషన్ పుణ్యమా అనేక మంది కార్మికులు విదేశాలకు వలసపోయి పొట్టనింపుకుంటున్నారు. స్వదేశంలోని తమ వారి అవసరాలు కూడా తీర్చగలుగుతున్నారు. అయితే.. గతేడాది వివిధ దేశాల్లోని వలసకార్మికులు తమ సొంతదేశాలకు ఏకంగా 605 బిలియన్ డాలర్లకుపైగా నిధులు పంపించారు. ఐక్యరాజ్యసమితి(యూఎన్ఓ) ఇటీవల జరిపిన అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. స్వదేశానికి నిధుల తరలింపులో మొబైల్ చెల్లింపుల వ్యవస్థ వారికి ఎంతో ఉపయోగకరంగా మారిందని ఐక్యరాజ్యసమితి తేల్చింది. యూఎన్ఓ‌ అనుబంధన సంస్థ ఇంటర్నేషనల్ ఫండ్ ఫర్ అగ్రికల్చరల్ డవలప్‌మెంట్(ఐఎఫ్ఏడీ) ఈ అధ్యయనాన్ని నిర్వహించింది. 


ఈ నివేదిక ప్రకారం.. 2020తో పోలిస్తే 2021లో వలసకార్మికులు తమ సొంతదేశాలకు 8.6 శాతం ఎక్కువ నిధులు పంపించారు. ఇక 2023లో ఈ మొత్తం 630 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని ఐఎఫ్ఏడీ అంచనా వేసింది. అనేక అల్ప,మధ్యాదాయ దేశాలకు వలసకార్మికులు పంపే నిధులే ప్రధానఆదాయమని పేర్కొంది. ఈ నిధుల ద్వారా ఏకంగా 800 మిలియన్ల మందికి లబ్ధి చేకూరిందని తేల్చింది. ‘‘వలసకార్మికులు తమ దేశాలకు పంపించే నిధులు బీదరిక నిర్మూలనకు, అనేక మంది కడుపులు నింపేందుకు  ఉపయోగపడుతున్నాయి.’’ అని ఐఎఫ్ఏడీ అధ్యక్షుడు పేర్కొన్నారు.


అయితే.. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ఈమారు విదేశీ నిధుల రాకడ తగ్గుతుందని ఆయన హెచ్చరించారు. మధ్యఆసియా దేశాల్లోని అనేక మంది రష్యాలో ఉపాధి పొందుతున్నారని, వారు స్వదేశానికి పంపించే నిధుల(నగదు) వాటా ఆయా దేశాల జీడీపీలో 30 శాతం దాకా ఉంటుందని ఐఎఫ్ఏడీ తేల్చింది. ఇటీవలి కరోనా సంక్షోభం కారణంగా అనేక మంది మొబైల్ చెల్లింపుల వ్యవస్థ ద్వారానే స్వదేశానికి నిధులు  పంపించారని, 2021లో ఈ లావాదేవీల సంఖ్య ఏకంగా 48 శాతం పెరిగిందని ఈ అధ్యయనంలో తేలింది.  



Updated Date - 2022-06-18T00:42:17+05:30 IST