North Korea: కిమ్ జాంగ్ ఉన్ అంతలా ఏం చెప్పాడు..? ఈ డాక్టర్లంతా ఎందుకు వెక్కి వెక్కి మరీ ఏడుస్తున్నారంటే..

ABN , First Publish Date - 2022-08-20T23:13:42+05:30 IST

కిమ్ జాంగ్ ఉన్ అంతలా ఏం చెప్పాడు..? ఈ డాక్టర్లంతా ఎందుకు వెక్కి వెక్కి మరీ ఏడుస్తున్నారంటే..

North Korea: కిమ్ జాంగ్ ఉన్ అంతలా ఏం చెప్పాడు..? ఈ డాక్టర్లంతా ఎందుకు వెక్కి వెక్కి మరీ ఏడుస్తున్నారంటే..

ఇంటర్నెట్ డెస్క్: కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టుముట్టి రెండేళ్లు దాటిపోయినా ఉత్తరకొరియాలో(North korea) ఎంతమంది కరోనా బారినపడ్డారో ఇప్పటికీ స్పష్టత లేదు. అక్కడి ప్రభుత్వం కరోనా కేసుల లెక్కలు ఏవీ బయటపెట్టలేదు. ప్రతిరోజూ అనారోగ్యం బారినపడ్డ వారి సంఖ్యను మాత్రమే వెల్లడించేది. వారు కరోనా బాధితులా కాదా అనే విషయంపై మౌనం దాల్చేది. అయితే భారీ స్థాయిలో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించే సామర్థ్యం ఉత్తరకొరియా ప్రభుత్వానికి లేదనేది పరిశీలకుల మాట. ఇదిలాఉంటే..  జూలై 29 తరువాత ఉత్తరకొరియా ఈ వివరాలనూ ప్రకటించడం మానుకుంది. ఆ తరువాత కొద్ది రోజులకే ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్(Kim jong Un) సంచలన ప్రకటన చేశారు. కరోనాను జయించామంటూ భారీ స్టేట్‌మెంట్ ఇచ్చారు. అంతేకాకుండా.. కరోనా ఆంక్షలన్నీ ఎత్తేస్తున్నట్టు చెప్పుకొచ్చారు. తాజాగా కిమ్.. మిలిటరీ వైద్యులను సన్మానించేందుకు రాజధాని ప్యాంగ్యాంగ్‌లో(Pyongyong) ఓ భారీ సభను ఏర్పాటు చేశారు. అయితే.. ఈ సభకు హాజరైన మిలిటరీ వైద్యులు, పారామెడికల్ సిబ్బంది కన్నీళ్లు పెట్టుకుంటున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.


అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం.. కరోనాతో పోరాడేందుకు కిమ్ ప్రభుత్వం భారీ స్థాయిలో ఆర్మీలోని వైద్యులను రంగంలోకి దింపిందట. ‘కరోనా పోరాట ఫ్రంట్’ పేరిట వారిని ప్రజల సహాయార్థం దేశంలోని వివిధ ప్రాంతాలకు పంపించింది. ఇక.. కరోనా ఆంక్షలన్నీ ఎత్తేసిన ప్రభుత్వం మిలిటరీ అధికారులకూ ఈ బాధ్యతల నుంచి విముక్తి కలిగించింది. ఈ క్రమంలో మిలిటరీ వైద్యులు చేసిన సేవలకు కృతజ్ఞతలు తెలిపేందుకు గురువారం ఓ భారీ సభ ఏర్పాటు చేసింది. ఇందులో కిమ్ కూడా పాల్గొని ప్రసంగించారు. ఈ సభలో కిమ్‌తో సహా అనేక మంది కీలక అధికారులు.. మిలిటరీ వైద్యులు, ఇతర మెడికల్ సిబ్బంది  ధైర్యసాహసాలను వేనోళ్ల పొగిడారు. 


ఇక సభలో కిమ్ తమ కష్టాన్ని గుర్తించి ప్రశంసించడంతో అనేక మంది భాగోద్వేగానికి లోనయ్యారు. అప్పట్లో తాము ఎదుర్కొన్న సవాళ్లను గుర్తు చేసుకుంటూ మరికిందరు కన్నీటి పర్యంతమయ్యారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి. ఇక కరోనాపై ఉత్తరకొరియా విజయాన్ని కిమ్..ఓ అద్భుతమని ఈ సభలో వ్యాఖ్యానించారు. అంతర్జాతీయ మీడియా కథనాల ప్రకారం..  కరోనాపై పోరాటంలో ఉత్తరకొరియా ప్రభుత్వం గతంలో ఏకంగా కోటి మంది సిబ్బందిని రంగంలోకి దింపింది. ఒకానొక సమయంలో దేశాధినేత కిమ్ కూడా తీవ్ర అనారోగ్యం పాలయ్యారు.  కిమ్‌కు తీవ్రస్థాయిలో జ్వరం వచ్చినట్టు ఆయన సోదరి కిమ్ యో జాంగ్ ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ప్రకటించారు. అనారోగ్యంతో బాధపడుతున్నా కూడా కిమ్ విశ్రాంతి తీసుకోలేదని, ప్రజల్ని ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు  అహోరాత్రాలు కష్టపడినట్టు ఆమె చెప్పారు. అంతేకాకుండా.. ఉత్తరకొరియాలో కరోనా సంక్షోభానికి పొరుగున ఉన్న తమ ప్రత్యర్థి దక్షిణ కొరియానే కారణమని ఆమె ఆరోపించారు. అయితే.. దక్షిణకొరియా ప్రభుత్వం మాత్రం ఈ ఆరోపణలను అప్పుడే ఖండించింది. 



Updated Date - 2022-08-20T23:13:42+05:30 IST