మళ్ళీ సైనికపాలన

ABN , First Publish Date - 2021-02-04T09:33:28+05:30 IST

ఆరేళ్ళు గడవకముందే మయన్మార్‌లో ప్రజాస్వామ్యానికి నూరేళ్ళూ నిండిపోయాయి. నవంబరునాటి ఎన్నికల్లో మంచి మెజారిటీతో...

మళ్ళీ సైనికపాలన

ఆరేళ్ళు గడవకముందే మయన్మార్‌లో ప్రజాస్వామ్యానికి నూరేళ్ళూ నిండిపోయాయి. నవంబరునాటి ఎన్నికల్లో మంచి మెజారిటీతో మళ్ళీ గెలిచిన ఆంగ్‌సాన్‌ సూకీని మరికొంతకాలం అధికారంలో కొనసాగనిస్తే ప్రమాదమని సైనికపెద్దలు భయపడ్డారు. ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడ్డారన్న అడ్డగోలు వాదనతో ఆమెను గద్దె దించేశారు. ప్రజాస్వామ్యాన్ని నామమాత్రంగా కూడా మిగలనివ్వకుండా ఖూనీ చేశారు. సూకీని ఇక జైలుకు పరిమితం చేయడానికి వీలుగా మిలటరీ ఏవేవో అర్థంలేని కేసులు పెడుతోంది. ఆమె దేశద్రోహానికి పాల్పడ్డారని నిర్థారించడం పోలీసుల అంతిమలక్ష్యంలాగా ఉంది. పొరుగుదేశం పరిణామాలపై భారత్‌ ఆందోళన వెలిబుచ్చింది. ప్రజాస్వామ్యాన్ని కాలరాయవద్దని కుట్రదారులకు విజ్ఞప్తి చేసింది. చైనా వైఖరి ఇందుకు భిన్నం. అధికారాన్ని ఇలా సైనికకుట్రతో హస్తగతం చేసుకోవడం దానికి బాధ కలిగించలేదు. ఖండనమండనలూ లేవు, విజ్ఞప్తులూ లేవు. దీనికితోడు, భద్రతామండలి హడావుడిగా సమావేశమై ఈ సైనికకుట్రను ఖండించబోతే, వీటో అధికారం ఉన్న చైనా ఈ ప్రకటనని సాధ్యం కానివ్వకుండా మోకాలడ్డింది. 


సైనికకుట్ర విషయంలో భారత్‌, చైనాల స్పందనను బట్టి బర్మాలో ఎవరి ప్రయోజనాలకు బలం చేకూరిందో అర్థమవుతున్నదని కొందరి విశ్లేషణ. రొహింగ్యాల ఊచకోత విషయంలో మిగతా ప్రపంచం బర్మాను తీవ్రంగా తప్పుబడుతుంటే, చైనా బలంగా వెనకేసుకొచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు బర్మాలో జరిగినదానిని చైనా అధికారిక మీడియా సైనికకుట్ర అనడం లేదు. సూకీని గద్దెదించేయడం, నిర్బంధించడం, అధికారాన్ని మిలటరీ లాక్కోవడం వంటివన్నీ కేబినెట్‌ విస్తరణలాగానూ, అధికార పంపకాల్లో స్వల్ప మార్పుచేర్పుల్లాగానూ అభివర్ణిస్తున్నది. సూకీకి విస్తృతాధికారాలేమీ లేవు కానీ, చైనా పెట్టుబడులనుంచి బర్మాను కాపాడుకొనేందుకు ప్రయత్నించడంతో ఆమె పట్ల చైనా పాలకులకు ఆగ్రహం కలిగిందని అంటారు. మొత్తం విదేశీ పెట్టుబడుల్లోనూ, వాణిజ్యంలో మూడోవంతు చైనాదే కావడంతో, ఆమె తన దేశం రుణ ఉచ్చులో పడకుండా కొన్ని ప్రాజెక్టులను అడ్డంగించారని అంటారు. బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ (బిఆర్‌ఐ)లో అంతర్భాగంగా ఉన్న చైనా–మయన్మార్‌ ఎకనామిక్‌ కారిడార్‌ (సిఎంఈసీ)లో అనేక భారీ ప్రాజెక్టులు చైనా చేపట్టింది. బర్మా మొత్తం రుణభారంలో దాదాపు సగం ఇవే కావడంతో సూకీ కొన్నింటికి కత్తెరవేశారు. మరికొన్నింటిని నత్తనడకన సాగించి, మూడువంతుల ప్రాజెక్టులను కదలనీయకుండా మొత్తానికి చైనా పాలకులకు మహా చిరాకు కలిగించారట. మరోపక్క భారత్‌తో కలసి హైవే, పోర్టు, ప్రత్యేక ఆర్థికమండలి ఇత్యాదివి సంకల్పించడం కూడా చైనాకు కంటగింపు అయ్యాయి. మయాన్మార్‌ సైనికాధినేత చైనాలో పర్యటించిరాగానే ఈ సైనిక కుట్ర జరగడం కూడా పలు అనుమానాలకు తావిస్తున్నది. సూకీని దించడంలో చైనా ప్రత్యక్షప్రమేయం ఉన్నా లేకున్నా సైన్యంతో దానికి దశాబ్దాలుగా ఉన్న సత్సంబంధాలను బట్టి చూస్తే జరిగినదంతా దానికి మేలు చేసేదే. భారత్‌కు కూడా బర్మా సైనికపెద్దలతో సత్సంబంధాలున్నాయి కానీ, చైనాతో పోటీపడగల సాన్నిహిత్యమైతే సాధ్యం కాలేదు. 


రోహింగ్యాల ఊచకోత విషయంలో సూకీ వ్యవహరించిన తీరు అంతవరకూ ఆమెపట్ల మిగతా ప్రపంచానికి ఉన్న విశ్వాసాన్ని వమ్ముచేసింది. నోబెల్‌ విజేతగా ఆమెనుంచి ఆశించిన విలువలకు అనుగుణంగా వ్యవహరించక, అధికారం కోసం మిలటరీ దాష్టీకాలకు వంతపాడారన్న అప్రదిష్ట మూటగట్టుకున్నారు. అంతమాత్రాన ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే సైనిక తిరుగుబాట్లను ఎవరూ సమర్థించరు. ఏడాది మాత్రమే పాలిస్తామనీ, పరిస్థితులు చక్కబడ్డాక ప్రజాపాలకులకే తిరిగి అధికారం అప్పగిస్తామన్న మిలటరీ మాట పచ్చిబూటకం. దాదాపు 90శాతం ప్రజల మనోభిప్రాయాన్ని వమ్ముచేసి అధికారంలోకి వచ్చిన ఈ సైనిక ప్రభుత్వాన్ని సాధ్యమైనంత వేగంగా గద్దెదించి, సూకీని ప్రతిష్టించేందుకు ప్రపంచ దేశాలన్నీ సమష్టిగా కృషిచేయాల్సిందే.

Updated Date - 2021-02-04T09:33:28+05:30 IST