లాభాల పాలు

ABN , First Publish Date - 2021-10-14T05:16:20+05:30 IST

వ్యవసాయ అనుబంధ పాడి పరిశ్రమ రైతులకు లాభ సాటిగా మారింది. పాల ఉత్పత్తి సేకరణలో నాగర్‌కర్నూల్‌ జిల్లా రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది.

లాభాల పాలు
కేంద్రంలో పాలు పోస్తున్న రైతు

పాల సేకరణలో రాష్ట్రంలోనే నాగర్‌కర్నూల్‌ ద్వితీయ స్థానం

జిల్లాలో 207 పాల సేకరణ, 9 పాలశీతలీకరణ కేంద్రాలు 

రోజూ 40 వేల లీటర్ల పాల సేకరణ


కల్వకుర్తి, ఆక్టోబరు 13: వ్యవసాయ అనుబంధ పాడి పరిశ్రమ రైతులకు లాభ సాటిగా మారింది. పాల ఉత్పత్తి సేకరణలో నాగర్‌కర్నూల్‌ జిల్లా రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో నిలిచింది. జిల్లా పరిధిలో చాలా మంది రైతులు డెయిరీ ఫామ్‌లను ఏర్పాటు చేసి, గేదెలను, సంకర జాతి ఆవులను పోషిస్తున్నారు. విజయ డెయిరీకి జిల్లా పరిధిలో 6,500 మంది రైతులు రోజూ 42 వేల లీటర్ల పాలను పోస్తున్నారు. 207 పాల సేకరణ కేంద్రాల్లో వాటిని విక్రయిస్తున్నారు.


15 రోజులకోసారి బిల్లులు

నాగర్‌కర్నూల్‌ జిల్లా పరిధిలో 9 పాలశీతలీకరణ కేంద్రాలు ఉన్నాయి. కల్వకుర్తి, అచ్చంపేట, కొండారెడ్డిపల్లి, వెల్దండ, మాధారం, గుండూరు, ఊర్కొండ, నాగర్‌కర్నూల్‌, ఉప్పగండ్లలో వాటిని ఏర్పాటు చేశారు. రైతుల నుంచి సేకరించిన పాలను ఈ కేంద్రాల్లో శీతలీకరించి, ప్రత్యేక వాహనాల్లో హైదరా బాద్‌లోని విజయ డెయిరీకి తరలిస్తున్నారు. జిల్లాలో రోజూ 42 వేల లీటర్ల పాలను సేకరిస్తుండగా, జిల్లా రాష్ట్రంలో రెండో స్థానంలో నిలిచింది. 15 రోజులకు ఒకసారి రైతుల ఖాతాల్లో బిల్లులు జమ చేస్తున్నారు. 


రైతులకు ప్రత్యేక రాయితీలు 

విజయ డెయిరీ(టీఎస్‌ డీడీసఎఫ్‌ఎల్‌) పాడి రైతులకు ప్రత్యేక రాయితీలను కల్పిస్తోంది. ఆ డెయిరీకి పాలను విక్ర యించే రైతులకు ప్రత్యేక పథకాలను అమలు చేస్తోంది. రైతు లు పశువులు కొనుగోలు చేస్తే రూ.10 వేల సబ్సిడీని ఇస్తోంది. రైతులకు రూ.1,000 ఇన్సూరెన్స్‌ను చెల్లిస్తోంది. విజయ వివాహ కానుక పథకం కింద పాడి రైతుల ఇంట్లో వివాహం జరిగితే రూ.5 వేలను ఇస్తున్నారు. రైతు చనిపోతే దహన సంస్కా రాలకు రూ.5 వేలు అందిస్తున్నారు. విద్యా కానుక పథకం కింద పాడి రైతుల పిల్లలకు ఆర్థిక సహాయం అందిస్తున్నారు. సివిల్‌ సర్వీస్‌ సాధిస్తే రూ.10 వేలు ఇస్తున్నారు. 


విజయ డెయిరీకే పాలను విక్రయించాలి

పాడి రైతులకు ప్రభుత్వం, విజయ డెయిరీ రాయితీలను కల్పిస్తోంది. విజయ డెయిరీలో పాలు విక్రయించి, లబ్ధి పొం దాలి. పాల సేకరణలో జిల్లా రాష్ట్రంలోనే ద్వితీయ స్థానంలో ఉంది. 

- సత్యనారాయణ యాదవ్‌, జిల్లా ఉప సంచాలకులు 


పాల రేట్లను పెంచాలి

విజయ డెయిరీలో పాలకు రేట్లు పెంచాలి. పెండింగ్‌లో ఉన్న ప్రోత్సాహకాలను వెంటనే విడుదల చేయాలి. పాడి గేదెలను కొనేందుకు రైతులకు 80 శాతం సబ్సీడీ ఇవ్వాలి.

- హన్‌మాన్‌ సింగ్‌, రైతు


ఇన్సూరెన్స్‌ సదుపాయం కల్పించాలి

పాడి ఆవులు, గేదెలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్‌ సదుపాయం కల్పించాలి. పాడి పశువుల రేట్లు అధికమయ్యాయి. విజయ డెయిరీ రైతులకు ఇచ్చే ప్రోత్సాహకాలను పెంచాలి.

- వినయ్‌ రెడ్డి, కల్వకుర్తి

Updated Date - 2021-10-14T05:16:20+05:30 IST