వెల్లువ డల్లుగా..

ABN , First Publish Date - 2022-05-26T06:32:55+05:30 IST

ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన జగనన్న పాల వెల్లువ వెలవెలబోతోంది.

వెల్లువ డల్లుగా..
కె. కోటపాడు అమూల్‌ పాల సేకరణ కేంద్రంలో కానరాని పాడి రైతులు

వెలవెలబోతున్న అమూల్‌ పాల సేకరణ కేంద్రాలు

పాడి రైతుల నుంచి స్పందన కరువు

ఒకపూట పాల సేకరణ లక్ష్యం 15,280 లీటర్లు

 ఉదయం పూట సేకరించిన పాలు 4 వేల లీటర్ల లోపే..  

సహకార సంఘాల సభ్యులు 1900 మంది

పాలుపోసేది కొందరే..

పలుచోట్ల కేంద్రాల మూసివేత

ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన జగనన్న పాల వెల్లువ వెలవెలబోతోంది. దశాబ్దాల కాలంగా స్థానికంగా విశాఖ డెయిరీ అందుబాటులో ఉంటూ సేవలందిస్తుండగా గుజరాత్‌కు చెందిన అమూల్‌ కంపెనీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. జిల్లాలో తొలి దశ కింద 9 మండలాలను ఎంపిక చేసి, 191 అమూల్‌ ఆటోమేటిక్‌ మిల్క్‌ కలెక్షన్‌ సెంటర్లు (ఏఎంసీ) ద్వారా పాల సేకరణకు శ్రీకారం చుట్టింది. అయితే ఆశించిన ఫలితం రావడం లేదు. పాడి రైతుల నుంచి స్పందన కనిపించడం లేదు.


(అనకాపల్లి-న్యూస్‌ నెట్‌వర్క్‌)

జిల్లాలో సేకరించిన పాలను అచ్యుతాపురంలోని అమూల్‌ మిల్క్‌ కూలింగ్‌ పాయింట్‌కు తరలిస్తున్నారు. సహకార డెయిరీలతో పాటు కొన్ని ప్రైవేటు డెయిరీలు ఇప్పటికే జిల్లా పాడి రైతులకు సేవలందిస్తుండగా, అమూల్‌కు పాలను సేకరించే బాధ్యతను ప్రభుత్వం తన భుజాలకెత్తుకున్నా ప్రయోజనం లేకుండాపోతోంది. రైతులు అమూల్‌కు పాలను పోసేందుకు ఆసక్తి చూపడం లేదు. పశు సంవర్థక శాఖతో పాటు రైతు భరోసా కేంద్రాల సిబ్బంది రైతుల నుంచి ఏఎంసీలకు పాల సేకరణ కోసం నానా యాతన పడుతున్నా ఫలితాలు కానరావడం లేదు. జిల్లాలో తొలిదశ కింద 9 మండలాల్లో 191 ఏఎంసీలకు గాను 191 సహకార సంఘాలను ఏర్పాటు చేశారు. ఇందులో సుమారు 1900 మంది రైతులు సభ్యులుగా ఉన్నారు. రోజూ ఉదయం, సాయంత్రం రెండు పూటలా కనీసం రోజుకు ఒక పాల సేకరణ కేంద్రం నుంచి 160 లీటర్ల పాల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ లెక్కన 191 ఏఎంసీల ద్వారా ప్రతి రోజూ 30,560 లీటర్ల పాలను సేకరించాల్సి ఉంది. ఒక్కపూట 191 కేంద్రాల ద్వారా 15,280 లీటర్ల పాలు సేకరించాల్సి ఉంది. బుధవారం ఉదయం పరిశీలిస్తే ఎక్కడా ఆ మేరకు పాల సేకరణ జరగలేదు. అన్ని సెంటర్లలో రోజుకు కేవలం 3 వేల లీటర్ల నుంచి 4 వేల లీటర్ల పాలను మాత్రమే ఏఎంసీల ద్వారా సేకరిస్తున్నారు. కొన్ని సెంటర్లకు పూటకు కనీసం పది లీటర్లు కూడా పాలు రావడం లేదు. మరికొన్ని చోట్ల సగం పాల సేకరణ లక్ష్యాన్ని చేరుకోవడం గగనంగా మారుతోంది. బుధవారం ఉదయం 6 గంటల నుంచి 8.30 గంటల వరకు అమూల్‌ పాల సేకరణ కేంద్రాల వద్ద పరిస్థితిని ‘ఆంధ్రజ్యోతి’ విలేఖరుల బృందం పరిశీలించింది. పాల సేకరణ కేంద్రాల వద్ద పాడి రైతుల సందడి లేకపోవడాన్ని గుర్తించింది. సహకార సంఘాల్లో 1900 మంది రైతులు ఉండగా, అందులో కొద్దిమంది మాత్రమే పాలు పోస్తున్నట్టు గమనించింది. జిల్లాలో విశాఖ డెయిరీ రోజుకు సుమారు 8,70,000 లీటర్ల పాలను సేకరిస్తుండగా, అమూల్‌కు అంతంత మాత్రంగానే పాల సేకరణ జరుగుతుండడం గమనార్హం. మొత్తంగా జిల్లాలో తొలిదశ ఎంపిక చేసిన ఏఎంసీలు పాల సేకరణలో వెనుకబాటు, రైతుల లేమితో వెలవెలబోతున్నాయి.

ఇప్పటికే కొన్ని మూత

మునగపాక: మండలంలో 31 ఏఎంసీలను ప్రారంభించినప్పటికీ 24 సెంటర్ల నుంచి మాత్రమే పాల సేకరణ జరుగుతోంది. మిగిలిన ఏడు కేంద్రాల నుంచి పాల సేకరణ ప్రారంభం కాలేదు. అరబుపాలెం, తాటిపల్లి పాల కేంద్రాల్లో అధికారులు సమావేశాలు ఏర్పాటు చేసినప్పటికీ రైతుల నుంచి స్పందన రాలేదు. పాల కేంద్రాలు తెరచుకోలేదు. మునగపాక ఏఎంసీ సెంటర్‌లో 20 లీటర్లు పాలను సేకరించారు. నాణ్యత లేని పాలను తీసుకోమని ఏఎంసీ నిర్వాహకులు చెబుతున్నారు. సచివాలయ సిబ్బంది ఏదో విధంగా పాలను తీసుకోవాలని సూచిస్తుండడం కనిపించింది.

కానరాని పాడి రైతులు

చోడవరం: మండలంలో 27 ఏఎంసీ కేంద్రాలు ఉండగా ఉదయం పూట 1,080 లీటర్ల 

పాల సేకరణ జరగాల్సి ఉంది. కానీ బుధవారం ఉదయం అన్ని సెంటర్లు కలిపి కేవలం 300 లీటర్లు మాత్రమే పాల సేకరణ జరిగింది. రాయపురాజుపేట కేంద్రానికి ఇద్దరు రైతులు మాత్రమే హాజరయ్యారు. కేవలం 3.58 లీటర్లు మాత్రమే పాలను సేకరించారు. మండలంలో పలు ఏఎంసీ కేంద్రాలలో పాల సేకరణ అరకొరగానే జరిగింది.

9 మంది రైతులు, 14 లీటర్లు..

తుమ్మపాల: మేజరు పంచాయతీ తుమ్మపాలలో ఏఎంసీ సెంటర్‌లో ఉదయం నుంచి పాల సేకరణ కోసం సిబ్బంది వేచి ఉన్నా,  కేవలం 9 మంది పాడి రైతులు మాత్రమే వచ్చారు. వీరి నుంచి 14 లీటర్ల పాలను సేకరించారు. తుమ్మపాలలో రెండు విశాఖ డెయిరీ కలెక్షన్‌ సెంటర్లతో పాటు ఐదు ప్రైవేటు డెయిరీ సెంటర్లు ఉన్నాయి. పాడి రైతులు ఆయా కేంద్రాలకు వెళ్లేందుకే ఇష్టపడుతున్నారు. ఈ ప్రభుత్వం ఉన్నంత వరకే అమూల్‌ ఉంటుందని, పాత డెయిరీని మాత్రమే నమ్ముకున్నామని రైతులు చెబుతున్నారు. 

13 కేంద్రాల్లో 200 లీటర్లు

ఎలమంచిలి: ఎలమంచిలి మండలంలో అమూల్‌ పాల సేకరణ మందకొడిగా సాగుతున్నది. బుధవారం ఉదయం మండలంలోని ఏటికొప్పాక పాల సేకరణ కేంద్రానికి నలుగురు రైతులు 8 లీటర్ల పాలను తీసుకు వచ్చారు. 13 కేంద్రాల్లో బుధవారం 54 మంది రైతులు సుమారు 200 లీటర్ల పాలను కేంద్రాలకు తీసుకువచ్చినట్టు అధికారుల ద్వారా తెలిసింది. 

కె.కోటపాడులో..

కె.కోటపాడు: మండలంలోని కె.కోటపాడు, ఆర్లి, గుల్లేపల్లి, గొల్లలపాలెం, గరుగుబిల్లి, గొరుపోటువానిపాలెం, గొండుపాలెం, పైడంపేట గ్రామాల్లోని కేంద్రాల్లో ఉదయం 80 లీటర్లు, సాయంత్రం 80 లీటర్లు కలిపి మొత్తం 160 లీటర్ల పాల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే ఒక్క గుల్లేపల్లి గ్రామంలో మినహా మరే గ్రామంలోనూ 10 లీటర్లకు మించి పాల సేకరణ జరగని పరిస్థితి నెలకొంది.  మండల కేంద్రం కె.కోటపాడులో పగలు 3 లీటర్ల గేదె పాలు, రాత్రి వేళలో 8 లీటర్ల ఆవుపాలు సేకరిస్తున్నారు.  


Updated Date - 2022-05-26T06:32:55+05:30 IST