హైదరాబాద్‌తో మిల్కాసింగ్‌కు ఎంతో అనుబంధం..

ABN , First Publish Date - 2021-06-20T16:17:33+05:30 IST

మువ్వన్నల జెండాను విశ్వ క్రీడా వేదికల్లో ఎగుర వేసిన ప్రపంచ అథ్లెట్‌ మిల్కా సింగ్‌కు..

హైదరాబాద్‌తో మిల్కాసింగ్‌కు ఎంతో అనుబంధం..

హైదరాబాద్/సికింద్రాబాద్‌ : మువ్వన్నల జెండాను విశ్వ క్రీడా వేదికల్లో ఎగుర వేసిన ప్రపంచ అథ్లెట్‌ మిల్కా సింగ్‌కు సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌తో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. లక్ష్య సాధనకు పట్టు వదలని విక్రమార్కునిలా యత్నించే మిల్కాసింగ్‌.. ప్రపంచ స్థాయి అథ్లెట్‌గా ఎదగడంలో సికింద్రాబాద్‌ కంటోన్మెంట్‌ సైతం కీలక భూమిక పోషించడం విశేషం. 1952వ సంవత్సరంలో ఎలక్ట్రికల్‌ అండ్‌ మెకానికల్‌ ఇంజినీర్స్‌ (ఈఎంఈ)లో ఉద్యోగంలో చేరిన అనంతరం అథ్లెట్‌గా మరింత మెరుగైన శిక్షణ పొందడానికి దోహదపడింది. 1952 నుంచి 1960వ సంవత్సరం వరకు మిల్కాసింగ్‌ సికింద్రాబాద్‌లో నివసించారు. కంటోన్మెంట్‌లోని మైదానాల్లో శిక్షణ తీసుకున్నారు.


రాళ్లతో నింపిన బ్యాగ్‌ను మోస్తూ, ఈఎంఈ సెంటర్‌ సమీపంలోని అమ్ముగూడ పహాడ్‌పైకి రన్నింగ్‌ ప్రాక్టీస్‌ చేశారంటే... ఆయన కఠోర సాధన ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. బొల్లారం-అమ్ముగూడ మధ్య రైలుతో పోటీపడుతూ మిల్కాసింగ్‌ రన్నింగ్‌ ప్రాక్టీస్‌ చేసేవారు. మిల్కాసింగ్‌ పట్టుదలను చూసి లోకో పైలెట్‌లు సైతం ఆయనను ప్రోత్సహించేవారు. స్థానికంగా ఉన్న గ్రౌండ్‌లలో ప్రాక్టీస్‌ చేస్తూ 1960లో రోమ్‌ ఒలింపిక్స్‌కు సన్నద్ధమయ్యారు. రోమ్‌ ఒలింపిక్స్‌లో జరిగిన 400 మీటర్ల పరుగు పందెంలో కొద్ది సెక్షన్ల వ్యవధిలో కాంస్య పతకం మిల్కాసింగ్‌ చేజారిపోయింది. 


కాలనీకి మిల్కాసింగ్‌ పేరు

అంతర్జాతీయ పతకాలు సాధించి, భారతదేశానికి పేరు, ప్రతిష్ఠలు తీసుకువచ్చిన మిల్కాసింగ్‌ను గౌరవిస్తూ సికింద్రాబాద్‌ తిరుమలగిరి నాగదేవత ఆలయం ఎదురుగా ఉన్న కాలనీకి ఏడాది క్రితం ‘మిల్కాసింగ్‌ కాలనీ’గా పేరు పెట్టుకున్నారు. కాలనీకి ’మిల్కాసింగ్‌ కాలనీ’గా నామకరణం చేయడం ద్వారా ఈ స్ర్పింటర్‌కు అత్యున్నత గౌరవం ఇవ్వడం విశేషం.


ఈఎంఈ సెంటర్‌కు కూడా..

మిల్కాసింగ్‌ 1952-53లో శిక్షణ పొందిన ఈఎంఈ సెంటర్‌కు కూడా మిల్కాసింగ్‌ స్టేడియంగా పేరు పెట్టారు. కొన్ని సంవత్సరాల క్రితం మిల్కాసింగ్‌ చేతుల మీదగానే స్టేడియాన్ని ప్రారంభించారు. 28 నవంబర్‌, 2015లో ఈఎంఈని మిల్కాసింగ్‌ సందర్శించినప్పుడు ఆయను ఎంసీఈఎంఈ కమాడెంట్‌ గుర్ముఖ్‌సింగ్‌ సన్మానించారు.



Updated Date - 2021-06-20T16:17:33+05:30 IST