బూజు పట్టిన కందిపప్పు పాడైన డాల్డా

ABN , First Publish Date - 2020-11-23T04:46:38+05:30 IST

సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో నిత్యావసర సరుకులు పాడైపోయాయి. కరోనా వేళ.. 36 వేల కిలోల నిల్వలు వృథాగా మారాయి. ఐటీడీఏ ఆధ్వర్యంలో 63 ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలు నిర్వహిస్తున్నారు. వీటిలో సుమారు 9వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటితో పాటు పోస్టుమెట్రిక్‌ వసతిగృహాల్లో మరో 3వేల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వం వీరికి భోజన సౌకర్యార్థం గిరిజన సహకార సంస్థ ద్వారా ప్రతి నెలా ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తోంది.

బూజు పట్టిన కందిపప్పు  పాడైన డాల్డా
ఆశ్రమ పాఠశాలలో బూజు పట్టిన కందిపప్పు, పాడైపోయిన డాల్డా ప్యాకెట్లు

- ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో నిత్యావసర సరుకులు మట్టిపాలు

- కరోనా వేళ.. 36వేల కిలోల నిల్వలు వృథా 

(సీతంపేట)

సీతంపేట ఐటీడీఏ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో నిత్యావసర సరుకులు పాడైపోయాయి. కరోనా వేళ.. 36 వేల కిలోల నిల్వలు వృథాగా మారాయి. ఐటీడీఏ ఆధ్వర్యంలో 63 ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలు నిర్వహిస్తున్నారు. వీటిలో సుమారు 9వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. వీటితో పాటు పోస్టుమెట్రిక్‌ వసతిగృహాల్లో మరో 3వేల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వం వీరికి భోజన సౌకర్యార్థం గిరిజన సహకార సంస్థ ద్వారా ప్రతి నెలా ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేస్తోంది. విద్యార్థుల సంఖ్యను బట్టి బియ్యం, కందిపప్పు, పెసరపప్పు, ఇడ్లీ రవ్వ, గోధుమపిండి, బఠానీలు, శనగపిండి, నూనె, కారంపొడి, పసుపు ఇలా నిత్యావసర వస్తువులన్నీ టన్నుల్లో సరఫరా చేస్తోంది. ఈ క్రమంలో ఈ ఏడాది మార్చిలో వేలాది టన్నుల నిత్యావసర సరుకులను పంపిణీ చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం మార్చి 22 నుంచి లాక్‌డౌన్‌ విధించింది. వసతిగృహాలు, పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. విద్యార్థులంతా ఇళ్లకు వెళ్లిపోయారు. వారంతా మరికొద్ది రోజుల్లో తిరిగి వస్తారనే ఉద్దేశంతో అధికారులు ఈ సరుకులను నిల్వ ఉంచారు. కరోనా సమయంలో పాలు, గుడ్లు మాత్రం క్వారంటైన్‌ సెంటర్లకు అందజేశారు. మిగతా నిత్యవసర సరుకులను ఇప్పటివరకూ వినియోగించకపోవడంతో ఇవన్నీ బూజు పట్టేసి పాడైపోయాయి. ఈ నెల 16 నుంచి ఆశ్రమ పాఠశాలలు పునః ప్రారంభమైనా.. కరోనా వ్యాప్తి భయంతో విద్యార్థులు సక్రమంగా రావడం లేదు. కొంతమంది విద్యార్థులు ఇళ్ల వద్ద నుంచే మధ్యాహ్న భోజనాన్ని బాక్సులో తెచ్చుకుంటున్నారు. ఈ సరుకులను చూసి.. ఆశ్రమ పాఠశాలల్లో భోజనం చేసేందుకు మరింత జంకుతున్నారు. ఇటీవల సీతంపేట, మందస, మెళియాపుట్టి ఏజెన్సీల పరిధికి సంబంధించిన గిరిజన సహాయ సంక్షేమ అధికారులు ఈ సరుకులను పరిశీలించారు. కందిపప్పు బూజు పట్టి ముక్కిపోయినట్టు, డాల్డా ప్యాకెట్లు పాడైపోయినట్టు, గోధుమ పిండి, శనగపిండికి పురుగు పట్టినట్టు గుర్తించారు. ఇలా మొత్తంగా సుమారు 36వేల కిలోల నిల్వలు పాడైపోయినట్టు గుర్తించారు. దాదాపు రూ.25 లక్షల మేర నిత్యావసర సరుకులు బుగ్గిపాలయ్యే పరిస్థితి ఏర్పడింది. దీనిపై ఐటీడీఏ పీవో శ్రీధర్‌కు నివేదిక అందజేశారు. పీవో ద్వారా.. గిరిజన సంక్షేమ శాఖ రాష్ట్ర సంచాలకుల దృష్టికి కూడా విషయాన్ని తీసుకెళ్లారు. ఇదిలా ఉండగా, కరోనా వ్యాప్తి సమయంలో విధించిన లాక్‌డౌన్‌ కారణంగా ఎంతోమంది పేదలు ఆకలితో అలమటించిపోయారు. నిత్యావసర సరుకులు దొరక్క ఇబ్బందులు పడ్డారు. అధికారులు ఈ సరుకులను అప్పట్లో కనీసం పేదలకైనా పంపిణీ చేసి ఉంటే.. ఎంతో మంది ఆకలి తీరేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఇప్పుడు వేలాది కిలోల సరుకులు పాడైపోవడంతో ప్రభుత్వానికి కూడా నష్టమేనని పేర్కొంటున్నారు. ఈ విషయమై జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఉప సంచాలకులు ఎం.కమల వద్ద ‘ఆంధ్రజ్యోతి’ ప్రస్తావించగా.. ‘ఐటీడీఏ పరిధిలోని ఆశ్రమ పాఠశాలలు, వసతిగృహాల్లో ఎంత మేర సరుకులు ఉన్నాయి. ఏయే సరుకులు పాడైపోయాయనే దానిపై నివేదికలు సిద్ధం చేశాం. గిరిజన సంక్షేమ శాఖ డైరెక్టర్‌కు ఈ నివేదిక అందజేసి.. మళ్లీ నిత్యావసర సరుకులు తెప్పించేలా చర్యలు చేపడుతున్నాం’ అని తెలిపారు. 


Updated Date - 2020-11-23T04:46:38+05:30 IST