మిల్లర్ల మస్కా..!

ABN , First Publish Date - 2021-10-31T05:54:02+05:30 IST

మిల్లర్ల మస్కా..!

మిల్లర్ల మస్కా..!

సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌లో మరో కుంభకోణం

నకిలీ బ్యాంకు గ్యారెంటీలు, రిలీజ్‌ ఆర్డర్ల మాయ

నకిలీ డాక్యుమెంట్లతో మిల్లర్లకు ధాన్యం అప్పగించిన అధికారులు 

భారీగా ముడుపులు అందాయన్న ఆరోపణలు

బియ్యం అప్పగించకుండానే రిలీజ్‌ ఆర్డర్‌

రెండూ కలిపి రూ.10 కోట్ల పైమాటే..

పది రోజుల నుంచి కేసు పెట్టని అధికారులు

మిల్లర్లకు అండగా ఓ మంత్రి


నకిలీ బ్యాంకు గ్యారెంటీలు సృష్టించారు.. బ్యాంకు మేనేజర్లు, ఉన్నతాధికారుల సంతకాలను ఫోర్జరీ చేశారు.. నకిలీ రిలీజ్‌ ఆర్డర్లూ రూపొందించి రూ.కోట్లకు మోసం చేశారు. రూ.10 కోట్ల విలువైన ఈ భారీ కుంభకోణంలో సివిల్‌ సప్లయిస్‌ డీఎం కార్యాలయ ఉన్నతాధికారుల పాత్ర, ముడుపుల వ్యవహారం ఉందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంతా జరిగినా మిల్లర్లపై కేసు పెట్టకపోవడం, విషయం బయటకు పొక్కకుండా దాచి పెట్టడం వెనుక ఓ మంత్రి అండదండలూ ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. 


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ జిల్లా మేనేజర్‌ కార్యాలయం పరిధిలో మరో భారీ కుంభకోణం వెలుగుచూసింది. నకిలీ బ్యాంకు గ్యారెంటీలు, నకిలీ బ్యాంకు గ్యారెంటీ రిలీజ్‌ ఆర్డర్ల వ్యవహారం బయటికొచ్చింది. కైకలూరు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ పరిధిలో వెలుగుచూసిన బియ్యం కుంభకోణం విచారణ ఇంకా పూర్తి కాకుండానే ఈ అతిపెద్ద మోసంతో పౌరసరఫరాల సంస్థ జిల్లా మేనేజర్‌ కార్యాలయం వార్తల్లోకెక్కింది. అయితే, ఈ వ్యవహారం గురించి సిబ్బంది పెదవి విప్పకూడదని, తెరిస్తే అంతే సంగతులన్న మౌఖిక ఆదేశాలు అందాయి. దీంతో అధికారికంగా సిబ్బంది స్పందించట్లేదు. 

అసలు ఏమిటీ మోసం?

రైతుల దగ్గర నుంచి జిల్లా యంత్రాంగం ధాన్యాన్ని కొనుగోలు చేస్తుంది. ప్యాడీ పర్చేజింగ్‌ సెంటర్ల (పీపీసీ) ద్వారా ఈ ప్రక్రియ జరుగుతుంది. ఇలా కొన్న ధాన్యాన్ని బియ్యం ఆడించటానికి మిల్లర్లకు ఇస్తారు. ఇందుకోసం మిల్లర్ల నుంచి బ్యాంకు గ్యారెంటీలను స్వీకరిస్తారు. ఒక మిల్లరుకు రూ.2 కోట్ల విలువ చేసే ధాన్యం ఇస్తే 1:1, 1:5 పద్ధతిలో బ్యాంకు గ్యారెంటీ తీసుకుంటారు. అంటే.. రూ.2 కోట్ల విలువకు రూ.కోటి మేర బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాల్సి ఉంటుంది. సివిల్‌ సప్లయిస్‌ అధికారులు కోరిన నిష్పత్తి ప్రకారం మిల్లర్లు ఈ గ్యారెంటీ ఇవ్వాలి. ఆ తర్వాతే వారికి ధాన్యాన్ని అప్పగిస్తారు. ఈ ధాన్యాన్ని మిల్లుల్లో ఆడించి తిరిగి అప్పగించాకే సివిల్‌ సప్లయిస్‌ కార్పొరేషన్‌ అధికారులు వారి బ్యాంకు గ్యారెంటీలను రిలీజ్‌ చేస్తూ బ్యాంకర్లకు ఆర్డర్లు జారీ చేస్తారు. ఆ తర్వాత ఆ మొత్తాన్ని మిల్లర్లు వెనక్కు తీసుకుంటారు. ఈ వ్యవహారంలోనే భారీ కుంభకోణం వెలుగుచూసింది. 

నకిలీ బ్యాంకు గ్యారెంటీలతో.. 

జిల్లాలో కొందరు మిల్లర్లు నకిలీ బ్యాంకు గ్యారెంటీ పత్రాలను చూపి తమ మిల్లులకు ధాన్యాన్ని తరలించుకుపోయారు. బ్యాంకు మేనేజర్లు ఇచ్చినట్టుగా నకిలీ బ్యాంకు గ్యారెంటీలను రూపొందించి వీటిని డీఎం సివిల్‌ సప్లయిస్‌ కార్యాలయానికి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. మైలవరంలో రెండు మిల్లులు, హనుమాన్‌ జంక్షన్‌లో ఒక మిల్లు నకిలీ బ్యాంకు గ్యారెంటీలను చూపినట్టుగా తెలుస్తోంది. దాదాపు రూ.10 కోట్ల మేర నకిలీ బ్యాంకు గ్యారెంటీలను తయారు చేసి, వాటిని డీఎం సివిల్‌ సప్లయిస్‌ కార్యాలయానికి అందించినట్టుగా తెలుస్తోంది. జిల్లావ్యాప్తంగా దాదాపు 233 మంది మిల్లర్ల ద్వారా రూ.400 కోట్ల మేర బ్యాంకు గ్యారెంటీలు వచ్చాయి. తాజాగా వెలుగులోకి వచ్చిన అక్రమ గ్యారెంటీల విలువ రూ.10 కోట్లు ఉంది. ఇలాంటి కేసులు ఇంకా ఎన్ని ఉన్నాయో బయటకు రావాల్సి ఉంది. బ్యాంకు గ్యారెంటీలను మిల్లర్లు, డీఎం సివిల్‌ సప్లయిస్‌ కార్యాలయంలో అందజేస్తారు. వీటిని స్వీకరించాక పరిశీలించాలి. ఆ తర్వాతే ఆ బ్యాంకు గ్యారెంటీ విలువకు అనుగుణంగా ధాన్యాన్ని ఆయా మిల్లులకు రవాణా చేయటానికి అనుమతులు ఇవ్వాలి. అయితే, ఈ నకిలీ బ్యాంకు గ్యారెంటీలను ఎందుకు గుర్తించలేకపోయారన్నది ప్రశ్న. మిల్లర్లతో ఉన్న లాలూచీతో ఉద్దేశపూర్వకంగానే ఉన్నతాధికారులు వ్యవ హరించారా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. గ్యారెంటీ లేకుండా ధాన్యాన్ని తీసుకెళ్లి ఆ ధాన్యాన్ని అమ్మేసుకుంటే పరిస్థితి ఏమిటన్న ఆలోచనను కూడా డీఎం సివిల్‌ సప్లయిస్‌ కార్యాలయం చేయకపోవటం గమనార్హం.

నకిలీ బ్యాంకు గ్యారెంటీ రిలీజ్‌ ఆర్డర్లు కూడా..

నకిలీ బ్యాంకు గ్యారెంటీ రిలీజ్‌ ఆర్డర్ల వ్యవహారం కూడా బయటకొచ్చింది. కొండపల్లికి చెందిన ఓ మిల్లర్‌ నకిలీ బ్యాంకు గ్యారెంటీ రిలీజ్‌ ఆర్డర్‌తో ఎన్‌క్యాష్‌ చేసుకునే ప్రయత్నం చేసినట్టు తెలిసింది. దీని విలువ రూ.2 కోట్లు ఉంటుందని అంచనా. తీసుకున్న ధాన్యానికి, ఇవ్వాల్సిన బియ్యం ఇవ్వకుండానే డీఎం సివిల్‌ సప్లయిస్‌ కార్యాలయం రిలీజ్‌ ఆర్డర్‌ ఇచ్చినట్టుగా ఓ మిల్లర్‌ ఎన్‌క్యాష్‌ చేసుకునే ప్రయత్నం చేశాడు. ఇది ఫోర్జరీ చేసిందా? నిజంగానే డీఎం సివిల్‌ సప్లయిస్‌ కార్యాలయం నుంచి వచ్చిందా అన్నది తేలాలి. మిల్లర్‌ ఇంకా ధాన్యాన్ని ఆడించి అందజేయాల్సి ఉన్నప్పటికీ అతని బ్యాంకు గ్యారెంటీని రిలీజ్‌ చేయమని బ్యాంకర్‌కు నిర్దేశిస్తూ నకిలీ బ్యాంకు గ్యారెంటీ రిలీజ్‌ రావటం కలకలం రేపుతోంది. 

మిల్లర్లకు మంత్రి అండదండలు

డీఎం సివిల్‌ సప్లయిస్‌ కార్యాలయం పరిధిలో నకిలీ బ్యాంకు గ్యారెంటీలు, నకిలీ బ్యాంకు గ్యారెంటీ రిలీజ్‌ ఆర్డర్ల వ్యవహారం పది రోజుల కిందట వెలుగుచూసింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు డీఎం సివిల్‌ సప్లయిస్‌ కార్యాలయం ఎందుకు కేసు పెట్టలేదన్నది సందేహంగా ఉంది. సహజంగా తప్పు జరిగితే ఆ రోజు కాకపోయినా మరుసటి రోజైనా కేసు పెడతారు. మిల్లర్ల తప్పిదం ఉంటే కచ్చితంగా అధికారులు కేసులు పెట్టాలి. మరి కేసులు పెట్టలేదంటే.. ఏదైనా లోపాయికారి ఒప్పందం జరిగిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కొందరు మిల్లర్లు జిల్లాకు చెందిన మంత్రిని ఆశ్రయించినట్టు తెలుస్తోంది. మంత్రి ఒత్తిళ్ల కారణంగానే కేసు పెట్టేందుకు వెనకడుగు వేస్తున్నట్టు సమాచారం.

Updated Date - 2021-10-31T05:54:02+05:30 IST