మినరల్‌.. మాయ

Published: Sun, 27 Mar 2022 23:44:09 ISTfb-iconwhatsapp-icontwitter-icon
మినరల్‌.. మాయ

ప్రమాణాల్లేని శుద్ధ జలం

విచ్చలవిడిగా నీటి వ్యాపారం

పుట్టగొడుగుల్లా ఆర్‌వో ప్లాంట్లు

అనుమతులు లేకుండానే నిర్వహణ

బోరు నీటినే మినరల్‌ వాటర్‌గా విక్రయం


ఒకప్పుడు చేతిపంపులు, కుళాయిలు, బావుల నీటినే తాగేవాళ్లం. గ్రామాల్లో అయితే చెరువులు, కాల్వల్లో నీటిని తాగునీటికి వినియోగించేవారు. విజ్ఞానంతో పాటు నీటి కాలుష్యం పెరిగి పోవడంతో ఆరోగ్యం కోసమని కొందరు.. స్టైల్‌ కోసమని మరికొందరు.. గొప్ప కోసమని అందరూ మినరల్‌ మాయలో పడి క్యాన్‌ వాటర్‌ను మాత్రమే తాగుతున్నారు. ప్రభుత్వం నాణ్యమైన తాజా తాగునీటిని అందించడంలో విఫలమైంది. దీంతో గతంలో నగరాలు, పట్టణాలకే పరిమితమైన ఆర్వో వాటర్‌ ప్లాంట్లు ప్రస్తుతం గ్రామగ్రామాన వెలుస్తున్నాయి. బోర్లలోని నీటిని శుద్ధి చేసి ఇస్తున్నారు. శుద్ధజలం పేరుతో క్యాన్లు, బాటిళ్లలో నింపి సరఫరా చేస్తున్న గరళాన్ని నగదు చెల్లించి మరీ వినియోగదారులు కొనుగోలు చేస్తున్నారు. అనుమతులు లేకుండా విచ్చలవిడిగా వీధికొకటి చొప్పున వెలుస్తున్న ఆర్వో ప్లాంట్లలో కనీస ప్రమాణాలు లేకున్నా ప్రభుత్వ అధికారులు వాటివైపు కన్నెత్తి చూడటంలేదనే విమర్శలు ఉన్నాయి. వేసవిలో అధికారులు నీటిని పూర్తిస్థాయిలో అందించలేని పరిస్థితి ఉన్నది. ఇదే అవకాశంగా నీటి వ్యాపారంతో ఆర్వో ప్లాంట్ల నిర్వాహకులు ప్రజలను అడ్డంగా దోచుకుంటున్నా పట్టించుకునే వారే లేరు. పేరుకే ఆర్‌వో ప్లాంట్లు.. అమ్మే ప్రతి చుక్క నీరు కలుషితమేనన్న విమర్శలున్నాయి.శుద్ధ.. గరళం

నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా విక్రయిస్తున్న మినరల్‌ వాటర్‌ కంటే కుళాయి నీరే ఉత్తమం. అయితే శుద్ధ జలం తాగాలనే జనం బలహీనతను ఆసరాగా ఎక్కడికక్కడ ఆర్వో ప్లాంట్ల నిర్వాహకులు ప్రజల జేబులకు చిల్లుపెడుతున్నారు. డబ్బు పోయి శుద్ధ జలం లభించకపోగా రోగాలను కొనుక్కుంటున్నారన్న హెచ్చరికలనూ ప్రజలు ఆలకించడంలేదు. బోరు నీరు తియ్యగా ఉండటం కోసం కెమికల్స్‌ను కలుపుతున్నారు. దీంతో ఈ నీరు తాగటానికి రుచిగా ఉంటున్నాయి. ఈ నీరు తాగే వారికే ఎముకలు బలహీన పడటం, మోకాళ్ల నెప్పులు, జీర్ణకోశ సమస్యలు, ఆహారం అరుగుదల తగ్గడంతో పాటు చిన్న పిల్లల్లో ఎదుగుదల లోపం  వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మోతాదు మించి వాడే రసాయనాలతో నీటిలో ఉండాల్సిన క్లోరైడ్స్‌ లోపించి అనారోగ్య సమస్యలు వస్తాయని ఆరోగ్య అధికారులు చెప్తున్నారు. ప్రతి ఆరు నెలలకొకసారి నీటి శుద్ధి పరీక్షలు చేయకపోవడంతో నీటిలో బ్యాక్టీరియా పెరిగిపోతుందంటున్నారు. నీటిలో స్వచ్ఛతను కొలిచేందుకు టీడీఎస్‌ (టోటల్‌ డిజాల్వ్‌డ్‌ సాలిడ్స్‌)ను ప్రామాణికంగా తీసుకుంటారు. నీటిలో కాల్షియం, మెగ్నీషియం, పోటాషియం, సోడియం, బైకార్బోనేట్స్‌, క్లోరైడ్స్‌, సల్ఫేట్స్‌ కరిగి ఉంటాయి. టీడీఎస్‌ పీపీఎం (పెలాటబిలిటీ కోషెండ్‌ మిలియన్‌)స్థాయి 1000 దాటితే ఆ నీరు విషతుల్యం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. అయినా నీటి శుద్ధి కేంద్రాలు సరఫరా చేసే నీటి నాణ్యతను పరిశీలించే నాథుడే లేడు.   


పట్టించుకోని అధికారులు

వాస్తవంగా వాటర్‌ప్లాంట్‌ ఏర్పాటు చేయాలంటే విద్యుత్‌కనెక్షన్‌ ఇచ్చేటప్పుడు ఫుడ్‌లైసెన్స్‌, రెవెన్యూ ఇతర శాఖల అనుమతులు  ఉన్నాయో లేదో చూడాలి. కాని విద్యుత్‌శాఖాధికారులు వాటిని పట్టించుకోకుండా విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చేస్తున్నారు. ఇక ఆర్‌డబ్ల్యూఎస్‌, పంచాయతీ, మున్సిపాలిటీ, ఆహార నియంత్రణ శాఖ అనుమతులతో పాటు బీఐఎస్‌ (బ్యూరో ఆఫ్‌ ఇండియన్‌ స్టాండెడ్స్‌) అనుమతులతోనే ఆర్వో ప్లాంట్లు ఏర్పాటు చేయాలి.   కాని ఇలాంటివి ఎక్కడా లేవు. కొందరు అధికారులు ఎక్కడైనా ఆయా ప్లాంట్లపై దాడులకు వెళ్తే ప్రజాప్రతినిధుల ఆదేశాలతో వెనుతిరగాల్సి వస్తుంది.  వాటర్‌ప్లాంట్‌లలో ప్రతి 10వేల లీటర్లకొకసారి ఫిల్టర్లు మార్చాల్సి ఉంటుంది. అయితే ఖర్చుతో కూడుకున్న పనికావటంతో  నిర్వాహకులు ఫిల్టర్లు మార్చకుండానే నీటిని సరఫరా చేస్తున్నారు. ఫిల్టర్లు ఎక్కువకాలం మార్చకపోతే బ్యాక్టీరియా పెరగటం, నీటిలో మలినాలు చేరటం వల్ల ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. వాటర్‌ప్లాంట్లను తనిఖీ చేయాల్సిన ఫుడ్‌సేఫ్టీ అధికారులు అటువైపు చూస్తున్న దాఖలాలు లేవు. వాస్తవంగా మినరల్‌ వాటర్‌ప్లాంట్‌ నిర్మించాలంటే రూ.20 లక్షల వరకు పెట్టుబడి పెట్టాలి. అయితే నిర్వాహకులు ఏమాత్రం నాణ్యతాప్రమాణాలు పాటించకుండా రూ.2 లక్షలు నుంచి 3 లక్షలతో ప్లాంట్లను ఏర్పాటు చేసి నీటిని విక్రయిస్తున్నారు. 


ఎముకలకు ప్రమాదం

ప్రమాణాలు లేని మినరల్‌ వాటర్‌ తాగడం వల్ల ఎముకల్లో పటుత్వం తగ్గిపోతుంది. చిన్నపాటి దెబ్బతగిలినా ఎముకలకు విరిగే స్వభావం ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా 45 ఏళ్లు దాటిన వారిలో ఉండే ఎముకల సాంద్రత శుద్ధి చేయని జలం తాగడం వల్ల 20 ఏళ్లకే వస్తుంది. ఫిల్టర్‌ చేయని నీటిని తాగటం వల్ల మోకాళ్ల నొప్పులు, దెబ్బలు తొందరగా తగ్గకపోవటం, కాళ్లు చేతులు వంకర్లు పోయే అవకాశం ఉంది.

- డాక్టర్‌ చింతలపూడి అశోక్‌కుమార్‌, పిడుగురాళ్ల(ఆంధ్రజ్యోతి - న్యూస్‌ నెట్‌వర్క్‌)

నీరు ప్రాణాధారం. అందుకే శుద్ధ జలాల కోసం ప్రజలు ఎంతైనా ఖర్చు చేస్తున్నారు. కుళాయి నీటిపై ఉన్న అనుమానాల కారణంగా ప్రజలు ఆర్‌వో ప్లాంట్లను ఆశ్రయిస్తున్నారు. స్వచ్ఛమైన నీటిని తాగితే రోగాలు దరిచేరవని భావించి, సంపాదనలో కొంత మొత్తాన్ని తాగునీటికి ఖర్చు చేస్తున్నారు. పేద గొప్ప తారతమ్యం లేకుండా ప్రజలందరూ క్యాన్‌వాటర్‌కు అలవాటుపడ్డారు. గ్రామాల్లో సైతం బావి, బోరు, కుళాయినీరు తాగటానికి విముకత చూపుతున్నారు. పెళ్లిళ్లు, ఇతర శుభకార్యాలయాల్లో మినరల్‌ వాటర్‌కే ప్రజలు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే అదునుగా నీటి వ్యాపారం కొన్నేళ్లుగా జోరందుకుంది. అధికారులు పట్టించుకోకపోవటంతో జిల్లా కేంద్రాల నుంచి మారుమూల పల్లెల వరకు ఆర్‌వో ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. అయితే వీటిలో నాణ్యత పాటించే ప్లాంట్లను వేళ్లపై లెక్కించవచ్చు అంటే అతిశయోక్తి కాదు. పర్యవేక్షించాల్సిన అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తుండటంతో విచ్చలవిడిగా ఆర్‌వో ప్లాంట్లు పుట్టుకొస్తున్నాయి. గతంలో కొన్ని మాత్రమే ఆర్‌వో ప్లాంట్లు ఉండేవి.. కొంత మేర నాణ్యత పాటించే వారు. నీటి వ్యాపారంలో పోటీ పెరగడంతో ప్రమాణాలు పాటించేవారే కరువయ్యారు. ఆర్వో ప్లాంట్‌ల్లో సరైన పరిమాణాలు పాటించకపోవడం, సమపాళ్లల్లో కెమికల్స్‌ కలపకపోవడం, ఫిల్టర్‌ చేసే పరికరాలను ఎప్పటికప్పుడు శుద్ధి చేయకపోవడం వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. నీటిని విక్రయించడానికి మాత్రమే అనుమతులు తీసుకుని ఆర్వో ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నారు. కనీసం ట్రేడ్‌ లైసెన్స్‌ కూడా లేకుండా వ్యాపారాలు చేస్తున్నారు. ప్రతి ప్లాంట్‌లో ఆర్‌వో రూమ్‌, ఫిల్లింగ్‌రూమ్‌, క్లీనింగ్‌, ల్యాబ్‌ వంటివి ఖచ్చితంగా ఉండాల్సి ఉన్నా.. అలాంటవి లేకుండానే చిన్న గదిలోనే, కొందరైతే ఇళ్లల్లోనే ప్లాంట్‌లు పెడుతున్నారు. అనుమతులు లేని, నిబంధనలు, ప్రమాణాలు పాటించని వాటర్‌ ప్లాంట్లను నియంత్రించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. మామూళ్లు తీసుకుంటూ వాటివైపు కన్నెత్తి చూడటం లేదనే ఆరోపణలున్నాయి. ఎక్కడికక్కడ బోర్లు వేసి భూగర్భ జలాలను లాగేస్తూ క్యాన్లలో నింపి విక్రయిస్తున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తున్నారా లేదా అన్న పర్యవేక్షణ లేకుండా పోయింది. వర్షా కాలంలో అంతంత మాత్రంగా సాగే వ్యాపారం వేసవిలో జోరందుకుంటుంది. వేసవిలో తాగునీటి ఎద్దడి నెలకొంటుంది. దీంతో వేసవి వస్తుందంటే నీటి వ్యాపారులకు పంటపండినట్లే. ఆటోల ద్వారా వ్యాపార సంస్థలకు, అపార్ట్‌మెంట్లకు, ఇళ్లకు మినరల్‌ వాటర్‌ సరఫరా చేస్తున్నారు. ఇక డిమాండ్‌ను బట్టి ధర నిర్ణయించి విక్రయిస్తుంటారు. 

 - పిడుగురాళ్లలో సుమారు 30 వరకు ఉన్న అనధికార వాటర్‌ప్లాంట్లు ఉన్నాయి. అన్ని అనుమతులున్న వాటర్‌ప్లాంటు ఒక్కటి కూడా పట్టణంలో లేదు. శుద్ధి చేయని జలాన్నే వాటర్‌క్యాన్లలో నింపేసి విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. మాచవరం మండలంలో  తనిఖీలు ఏమీ లేకుండానే క్యాన్ల విక్రయాలు జరుగుతున్నాయి. దాచేపల్లి మండలంలో 9 వాటర్‌ప్లాంట్లకు అనుమతులుండగా 15 వరకు అనధికార ప్లాంట్లు ఉన్నాయి. గురజాల మండలంలో సుమారు 25 వరకు ఉండగా నాలుగైదు ప్లాంట్లకే అనుమతులున్నాయి. 

- పెదకూరపాడు మండలంలో 35, అమరావతి మండలంలో 40, క్రోసూరు మండలంలో 50 ప్లాంట్లు ఉండగా ఒక్క ప్లాంట్‌ కూడా అనుమతి లేదు. బెల్లంకొండ మండలంలో 15 వాటర్‌ ప్లాంట్లు ఉండగా  ఎలాంటి అనుమతులు లేవు. అచ్చంపేట మండలంలో 30కి పైగా ఉండగా ఒక ప్లాంట్‌కు మాత్రమే ప్రభుత్వ అనుమతులు ఉన్నాయి.  

- తాడేపల్లి పట్టణ పరిధిలోని 24 వరకు ఆర్‌వో ప్లాంట్లు ఉండగా వాటిలో సగానికి మాత్రమే మునిసిపల్‌ అధికారులు జారీ చేసిన ట్రేడ్‌ లైసెన్సులు ఉన్నాయి. రూరల్‌ ప్రాంతంలో కొన్నింటికి ట్రేడ్‌ లైసెన్సులు కూడా లేవు. పట్టణంలో పలుచోట్ల గత ప్రభుత్వ హయాంలో దాతల సహకారంతో ఏర్పాటు చేసిన ఆర్‌వో ప్లాంట్లను కొన్ని చోట్ల మూసివేయగా, కొన్ని చోట్ల నిర్వహణ లేక శిథిలావస్తకు చేరాయి.  

- బాపట్లలో సుమారు 40 ప్లాంట్లు ఉండగా 5,6 ప్లాంట్లకు మాత్రమే ట్రేడ్‌ లైసెన్స్‌ ఉంది. ఐఎస్‌ఐ అనుమతి లేకుండానే ప్యాకెట్లు, బాటిల్స్‌లో నీరు నింపి విక్రయిస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు.   బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం మండలాల్లో కూడా ఆర్‌వో ప్లాంట్లను విచ్చలవిడిగా ఏర్పాటు చేశారు.  

- యడ్లపాడు మండలంలో సుమారు 20కి పైగా ఆర్వో వాటర్‌ ప్లాంట్లు ఉన్నాయి. వీటిలో మర్రిపాలెం, చెంఘీజ్‌ఖాన్‌పేట, బోయపాలెంలో ఒక్కోటి, ఉన్నవలో రెండు ప్లాంట్లను పంచాయతీలు నిర్వహిస్తున్నాయి. మిగిలిన గ్రామాల్లో ప్రైవేటు వ్యక్తులు అనుమతులు తీసుకోకుండానే నిర్వహిస్తున్నారు. 

-  సత్తెనపల్లి పట్టణ, మండలంలో 48 , ముప్పాళ్లమండలంలో 25, నకరికల్లు మండలంలో 30, రాజుపాలెం మండలంలో 42 ఆర్వో ప్లాంట్లు ఉన్నాయి.  వీటిల్లో 80శాతానికిపైగా వాటర్‌ప్లాంట్‌ నిర్వాహకులు ప్రమాణాలు పాటించటంలేదు. 

- తెనాలిలోనే అనుమతులు లేని ఆర్వో ప్లాంట్లు పదుల సంఖ్యలో ఉన్నాయి. ఇంటికో ఫ్లాంట్‌ అన్నట్లుగా కొన్ని చోట్ల వీధిలో నాలుగైదు వెలిశాయి. ప్రమాణాలు లేకుండా ప్లాంట్‌లు నడపుతున్నా అధికారుల నుంచి ఎటువంటి చర్యలు లేవు. నియోజకవర్గంలో 150కుపైగా ఆర్వో ప్లాంట్లు ఉన్నాయి.  

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.