ఎయిర్‌పోర్టు వద్ద మినీ ఫ్లై ఓవర్‌!

ABN , First Publish Date - 2021-11-26T06:30:37+05:30 IST

విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఎదురుగా మినీ ఫ్లై ఓవర్‌ నిర్మాణం చేపట్టేందుకు జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌) రూ.27.5 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచింది.

ఎయిర్‌పోర్టు వద్ద మినీ ఫ్లై ఓవర్‌!
ఫ్లై ఓవర్‌ నిర్మాణం ఈ ప్రాంతంలోనే

రెండో ప్రధాన ద్వారం మీదుగా కేసర పల్లి వరకు 

రూ.27.5 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచిన ఎన్‌హెచ్‌ 

ఎయిర్‌పోర్టు వద్ద ట్రాఫిక్‌ సమస్యకు పరిష్కారం


(ఆంధ్రజ్యోతి, విజయవాడ) : విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం ఎదురుగా మినీ ఫ్లై ఓవర్‌ నిర్మాణం చేపట్టేందుకు జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌) రూ.27.5 కోట్ల వ్యయంతో టెండర్లు పిలిచింది. ఎన్‌హెచ్‌-16పై వీఐపీ కారిడార్‌ ప్రాంతంలో ఎయిర్‌పోర్టు ట్రాఫిక్‌ను దృష్టిలో ఉంచుకుని ఈ మినీ ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తున్నారు. ఈ ఫ్లై ఓవర్‌ను ఏలూరు - విజయవాడ మార్గంలో హైవేపై ఒక వరసలోనే నిర్మిస్తున్నారు. ఇది విజయవాడ బెంజ్‌సర్కిల్‌ - 1 ఫ్లై ఓవర్‌ను పోలి ఉంటుంది. దీనిని 1.8 కిలోమీటర్ల పొడవున నిర్మించనున్నారు. 


ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ పనులకు సమాంతరంగా.. 

విజయవాడ ఎయిర్‌పోర్టులో ప్రస్తుతం డొమెస్టిక్‌ - ఇంటర్నేషనల్‌ ప్రయాణికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూ.611 కోట్ల వ్యయంతో భారీ ఇంటిగ్రేటెడ్‌ టెర్మినల్‌ బిల్డింగ్‌ పనులు చేపడుతున్న సంగతి తెలిసిందే. దీనికి సమాంతరంగా ప్రస్తుత ఎన్‌హెచ్‌ - 16కు నూతనంగా ప్రధాన మార్గాన్ని అభివృద్ధి చేయనున్నారు. ప్రస్తుత ప్రధాన గేటు ఏలూరు వైపు నుంచి వచ్చే వారు నేరుగా ఉపయోగించుకుంటారు. ఈ గేటు దాటిన తర్వాత నుంచి మినీ ఫ్లై ఓవర్‌ ప్రారంభమవుతుంది. రెండో ప్రధాన గేటు ఈ ఫ్లై ఓవర్‌ దిగువకు వస్తుంది. విజయవాడ నుంచి ఎయిర్‌పోర్టుకు వచ్చే వాహనాలు ఈ మినీ ఫ్లై ఓవర్‌ దిగువ నుంచి రెండో ప్రధాన ద్వారం మీదుగా లోపలికి వెళతాయి. ఈ ఫ్లై ఓవర్‌ కారణంగా ఎయిర్‌పోర్టు నుంచి వచ్చే వాహనాలకు, జాతీయ రహదారి పై రాకపోకలు సాగించే వాహనాలతో నేరుగా ఇంటర్‌ లింక్‌ ఏర్పడదు. ఎయిర్‌పోర్టులోకి రాకపోకలు సాగించే వాహనాల సంఖ్య ఇటీవల కాలంలో చాలా పెరిగింది. వీఐపీల కాన్వాయ్‌లకు తోడు, ప్రైవేటు వాహనాల్లో వచ్చే ప్రయాణికులతో ట్రాఫిక్‌ సమస్యలు తలెత్తుతున్నాయి. విమానాశ్రయంలోకి వెళ్లే వాహనాల కోసం జాతీయ రహదారి (ఎన్‌హెచ్‌ - 16)పై వాహనాలను నిలిపివేయాల్సి వస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకుని జిల్లా రోడ్డు భద్రతా కమిటీ సిఫార్సుల మేరకు ఎన్‌హెచ్‌ ఈ మినీ ఫ్లై ఓవర్‌కు ప్రతిపాదించింది. ఈ ఓవర్‌ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం త్వరితగతిన పచ్చజెండా ఊపింది. దీంతో ఎన్‌హెచ్‌ విజయవాడ రీజనల్‌ కార్యాలయం పరిధిలో దీనికి సంబంధించి సమగ్ర సర్వే నిర్వహించారు. 


భూ సేకరణ కోసం పరిశీలన

ఈ మినీ ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి స్వల్పంగా భూమిని సేకరించాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఇంతకు ముందే భూ పరిశీలన కూడా చేసింది. ప్రస్తుతం టెండర్లు పిలిచారు. భూ సేకరణ పూర్తి కాగానే పనులు ప్రారంభమవుతాయని, ఎన్‌హెచ్‌ ఆర్‌వో సాహు ‘ఆంధ్రజ్యోతి’కి చెప్పారు. 

Updated Date - 2021-11-26T06:30:37+05:30 IST