అభివృద్ధంటే.. క్లబ్‌లు, కేసినోలా?

ABN , First Publish Date - 2022-05-21T06:34:12+05:30 IST

అభివృద్ధంటే.. క్లబ్‌లు, కేసినోలా?

అభివృద్ధంటే.. క్లబ్‌లు, కేసినోలా?
మాట్లాడుతున్న మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు. వేదికపై రావి వెంకటేశ్వరరావు తదితరులు

గుడివాడలో అభివృద్ధి ఏదీ?

తల్లిపాలు తాగి రొమ్ము గుద్దుతావా?

మాజీమంత్రి కొడాలి నానీపై టీడీపీ నేతల ఫైర్‌

గుడివాడలో అంగరంగ వైభవంగా మినీ మహానాడు

తరలివచ్చిన అతిరథ మహారథులు


గుడివాడ/గుడివాడ రూరల్‌, మే 20 : ‘జగన్‌ ఓ పెద్ద దొంగ.. ఎన్టీఆర్‌ కుటుంబం మోచేతి నీళ్లు తాగి బతుకుతున్న కొడాలి నానీ.. నువ్వు చంద్రబాబును విమర్శిస్తావా. మూడేళ్లు మంత్రిగా ఉండి గుడివాడలో ఏం అభివృద్ధి చేశావ్‌. పేకాట క్లబ్‌లు, కేసినోలు నిర్వహించి డబ్బు వసూలు చేస్తున్న లు..గాడు కొడాలి నాని’ అంటూ మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గుడివాడలోని బంటుమిల్లి రోడ్డులో ఉన్న ధనలక్ష్మి వేర్‌హౌసింగ్‌ గోడౌన్‌లో శుక్రవారం టీడీపీ మినీ మహానాడు జరిగింది. పార్టీ గుడివాడ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ మూడేళ్లుగా రాష్ట్రాన్ని గాలికి వదిలేసిన వారు ఇప్పుడు గడప గడపకూ వస్తున్నారని విమర్శించారు. ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా రాష్ట్రంలో విద్యుత్‌ కోతలు వచ్చాయని మంత్రులు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడికి వెళ్లినా చంద్రబాబుకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారనడానికి ఇదే నిదర్శనమన్నారు. వచ్చే ఎన్నికల్లో గుడివాడలో టీడీపీని గెలిపించి ఎన్టీఆర్‌ రుణం తీర్చుకోవాలని కోరారు. అవసరమైతే టీడీపీ కోసం చస్తానని భావోద్వేగంతో మాట్లాడారు. గురజాల మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ రాష్ట్రంలో సైకో పాలన అంతం కావాలంటే వచ్చే ఎన్నికల్లో సైకిల్‌ గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. ఎన్టీఆర్‌ పుట్టిన గుడివాడ గడ్డను అక్రమాల అడ్డాగా మార్చిన కొడాలి నానీకి బుద్ధి చెప్పాలన్నారు. కొడాలి నాని, వల్లభనేని వంశీ తల్లిపాలు తాగి రొమ్ము గుద్దినట్టు వ్యవహరించారన్నారు.  మాజీ మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ సీఎం జగన్‌ నవరత్నాలు పేరిట రాష్ట్రానికి నవరంధ్రాలు పొడిచారని ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతి, జీవనాడి పోలవరాలను అటకెక్కించి అభివృద్ధి ఎలా చేస్తారని ప్రశ్నించారు. టీడీపీ అధికార ప్రతినిధి దివ్యవాణి మాట్లాడుతూ గుడివాడ గడ్డను టీడీపీ అడ్డాగా మారుస్తామన్నారు. రాజకీయాలు, పదవుల కోసం బూతులు మాట్లాడితే పంచెలు ఊడదీసి కొడతారని హెచ్చరించారు. టీడీపీ ఇన్‌చార్జి రావి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గుడివాడను మట్టి మాఫియాకు కేంద్రంగా మార్చిన వైసీపీ నాయకులకు బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. మాజీ ఎమ్మెల్యే జయమంగళ వెంకటరమణ మాట్లాడుతూ గుడివాడ టీడీపీ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే రావి వెంకటేశ్వరరావు విజయం తథ్యమనిపిస్తోందని వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్సీ కమ్మిలి విఠల్‌రావు మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకుంటున్నారన్నారు. టీడీపీ ఇన్‌చార్జులు కాగిత కృష్ణప్రసాద్‌, వర్ల కుమార్‌రాజా, పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు వల్లభనేని బాబూరావు, పట్టణ అధ్యక్షుడు దింట్యాల రాంబాబు, రూరల్‌ మండల అధ్యక్షుడు వాసే మురళీ, నందివాడ మండల అధ్యక్షుడు దానేటి సన్యాసిరావు, జడ్పీ మాజీ వైస్‌ చైర్‌పర్సన్‌ శాయన పుష్పవతి, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ పార్లమెంట్‌ అధ్యక్షుడు నిమ్మగడ్డ సత్యసాయి, తెలుగు యువత గుడివాడ అధ్యక్షుడు గోవాడ శివ, ఐటీడీపీ అధ్యక్షుడు మహేశ్‌, టీడీపీ మచిలీపట్నం పార్లమెంటరీ ఉపాధ్యక్షుడు యలమంచిలి సతీశ్‌, అధికార ప్రతినిధి శొంఠి రామకృష్ణ, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి సుబ్రహ్మణ్యేశ్వరరావు, మచిలీపట్నం అనుబంధ సంఘాల సభ్యులు పాల్గొన్నారు. 

అంతా పసుపుమయం

మినీమహానాడును పురస్కరించుకుని గుడివాడ అంతా పసుపుమయమైంది. నందివాడ, గుడివాడ రూరల్‌, గుడ్లవల్లేరు, గుడివాడ పట్టణాల నుంచి వేలాదిగా పార్టీ నాయకులు, కార్యకర్తలు హాజరుకావడంతో మహానాడు ప్రాంగణం నిండుదనాన్ని సంతరించుకుంది. తెలుగు యువత, టీఎన్‌ఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన బైక్‌ ర్యాలీ ఆకట్టుకుంది. 



Updated Date - 2022-05-21T06:34:12+05:30 IST