మినీ వేదిక.. ఖరారు

ABN , First Publish Date - 2022-10-03T06:01:04+05:30 IST

మినీ మహానాడును అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పల్నాడు నేతలు సమాయత్తమవుతున్నారు.

మినీ వేదిక.. ఖరారు
స్థల పరిశీలిస్తున్న మాజీ ఎమ్మెల్యేలు జీవీ, ప్రత్తిపాటి, అరవిందబాబు తదితరులు

12న మహా పండుగకు సమాయత్తం

నాగార్జున రియల్‌ ఎస్టేట్‌ ప్రాంగణం ఎంపిక

విజయవంతానికి ప్రణాళికల రూపకల్పనలో నేతలు


నరసరావుపేట, అక్టోబరు 2: మినీ మహానాడును అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు పల్నాడు నేతలు సమాయత్తమవుతున్నారు. శనివారం పల్నాడు జిల్లాకు సంబంధించి మినీ మహానాడు ఈ నెల 12వ తేదీన నిర్వహించాలని అధిష్ఠానం నిర్ణయించింది. అధిష్ఠానం నుంచి ఆదేశాలు అందిందే తడువుగా నేతలు రంగంలోకి దిగారు. వేదికకు ఆదివారం స్థలాన్ని కూడా నాయకులు ఎంపిక చేశారు.  నరసరావుపేట పట్టణ సమీపంలోని సత్తెనపల్లిరోడ్డు నుంచి బైపాస్‌రోడ్డు వరకు మూడు స్థలాలను ఆయా నేతలు పరిశీలించారు. వీటిలో ఈ రెండు ప్రాంతాలకు సమీపంలో అందరికీ అనువుగా ఉండేలా నాగార్జున రియల్‌ ఎస్టేట్‌ ప్రాంగణాన్ని మినీ మహానాడు వేదికకు ఖరారు చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు మినీ మహానాడుకు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమ నిర్వహణను పల్నాడు నేతలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటున్నారు. జిల్లా నలుమూలల నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు హాజరయ్యేలా ఏర్పాట్లలో నేతలు నిమగ్నమయ్యారు. ప్రధానంగా నరసరావుపేట, చిలకలూరిపేట, సత్తెనపల్లి నియోజకవర్గాల నుంచి అత్యధికంగా కార్యకర్తలు హాజరయ్యేలా ప్రణాళికను రూపొందించుకుంటున్నారు. ఇది మంచి అవకాశం.. సద్వినియోగం చేసుకుని మహానాడును విజయవంతం చేసి  నిరూపించుకోవాలని మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు నరసరావుపేట నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్‌ అరవిందబాబుకు సూచించారు. మినీ మహానాడు తర్వాత లోకేశ్‌ పాదయాత్ర కూడా ఉంటుందని చెప్పారు. మినీ మహానాడుకు 50 శాతం మంది నరసరావుపేట నియోజకవర్గం నుంచే హాజరుకావాలన్నారు. నియోజకవర్గం నుంచి ఎక్కువ సంఖ్యలో సమీకరిస్తామని అరవిందబాబు పుల్లారావుకు తెలిపారు.  


విజయవంతం చేయాలి 

మినీ మహానాడుని విజయవంతం చేయాలని పార్టీ శ్రేణులకు పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయలు, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పిలుపు ఇచ్చారు. గతంలో అర్ధరాత్రి దొంగలు వచ్చేవారని, ప్రస్తుతం అర్ధరాత్రులు సీఐడీ అధికారులు వస్తున్నారని ప్రత్తిపాటి విమర్శించారు. జగన్‌రెడ్డి పాలనలో సీఐడీ అధికారులు దొంగలుగా మారారని ఆరోపించారు. జగన్‌ రెడ్డి దొంగల ముఠాను రాష్ట్రం నుంచి తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మహానాడుకు ప్రజలు స్వచ్ఛందంగా తరలిరానున్నారని డాక్టర్‌ చదలవాడ అరవిందబాబు చెప్పారు. స్థల పరిశీలిన కార్యక్రమంలో నాయకులు నాగోతు శౌరయ్య, వేములపల్లి వెంకట నరసయ్య, కొట్లా కిరణ్‌, కుమ్మెత కోటిరెడ్డి, పూదోట సునీల్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

Updated Date - 2022-10-03T06:01:04+05:30 IST