పులకించిన వనం

ABN , First Publish Date - 2021-02-25T05:38:35+05:30 IST

మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతరకు భక్తులు పోటెత్తారు. బుధవారం లక్షకుపైగా భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. జంపన్నవాగులో సందడి నెలకొంది. పుణ్యస్నానాలు చేసి భక్తులు తరించారు. ఆపై గద్దెల వద్దకు చేరి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. మేడారం పరిసరాలు వాహనాలతో రద్దీగా మారాయి. శివసత్తుల పూనకాలతో హోరెత్తింది. మేడారం పులకించిపోయింది.

పులకించిన వనం
మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులు

మేడారంలో భక్తజన హోరు
వనదేవతల దర్శనానికి తరలివచ్చిన భక్తులు
తల్లులకు నిలువెత్తు మొక్కులు, బంగారం సమర్పణ
సంప్రదాయం ప్రకారం మండమెలిగే కార్యక్రమం
సందడిగా మారిన జంపన్నవాగు, కిక్కిరిసిన గద్దెలు
మొక్కులు చెల్లించుకున్న లక్షకుపైగా భక్తజనం
ప్రత్యేక పూజలు చేసిన మంత్రి సత్యవతిరాథోడ్‌



మేడారం సమ్మక్క-సారలమ్మల మినీ జాతరకు  భక్తులు పోటెత్తారు. బుధవారం లక్షకుపైగా భక్తులు తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు. జంపన్నవాగులో సందడి నెలకొంది. పుణ్యస్నానాలు చేసి భక్తులు తరించారు. ఆపై గద్దెల వద్దకు చేరి మొక్కులు చెల్లించుకున్నారు. దీంతో ఆలయం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. మేడారం పరిసరాలు వాహనాలతో రద్దీగా మారాయి. శివసత్తుల పూనకాలతో హోరెత్తింది. మేడారం పులకించిపోయింది.

మేడారం, ఫిబ్రవరి 24: ఆదివాసీ ఆరాధ్యదైవాలైన సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవడానికి భక్తులు తరలివచ్చారు. వివిధ రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ప్రైవేట్‌ వాహనాల్లో మేడారానికి వచ్చారు. ముందుగా భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలను బ్యాటరీ ఆఫ్‌ టాప్స్‌ కింద చేశారు. యువతుల కేరింతలు, భక్తుల పూనకాలతో జంపన్నవాగు హోరెత్తింది. కల్యాణకట్టలో తలనీలాలు ఇచ్చారు. నిలువెత్తు బెల్లంతో(బంగారం) నెత్తిమీద పెట్టుకుని అమ్మవార్ల సన్నిధికి చేరుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

మేడారంలో మండమెలిగే..
మేడారంలో వనదేవతల మినీ జాతర సందర్భంగా ఆదివాసీ పూజారులు మండమెలిగే కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. సమ్మక్క పూజామందిరంలో సిద్దబోయిన వంశీయులు ఆచార సంప్రదాయాల ప్రకారం తం తు నిర్వహించారు. ఇందులో భాగంగా ఆదివాసీ మహిళలు తల్లుల పూజామందిరాలను శుద్ధి చేసి అలికి ముగ్గులు వేశా రు. మందిరంపై గుట్టగడ్డి కప్పి మండమెలిగే కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామ దిగ్బంధం, గ్రామదేవతలకు పూజలు, సాక ఆరగించడం, దీప ధూప నైవేద్యాలు సమర్పించి  మా మిడితోతోరణాలు కట్టారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తల్లులకు మొక్కులు చెల్లించుకున్నారు. కన్నెపల్లిలోని సారలమ్మ పూజామందిరంలో కాక వంశీయులు మండమెలిగే పండుగను ఘనంగా నిర్వహించారు. పూజామందిరాన్ని శుద్ధిచేసిన మహిళలు.. ముగ్గులు వేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ దిగ్బంధంచేసి గ్రామదేవతలకు ప్రత్యేక పూజలు చేపట్టారు. బుధవారం సాయంత్రం ఆదివాసీ పూజారులైన సిద్దబోయిన వంశీయులు, కాక వంశీయులు మేడారం వనదేవతలకు గద్దెలకు చేరుకుని సాక ఇచ్చిపుచ్చుకున్నారు. రాత్రంతా జాగరణచేసి గురువారం మొక్కులు చెల్లించుకుంటారు.

పూజలు నిర్వహించిన మంత్రి సత్యవతిరాథోడ్‌

మినీ జాతర సందర్భంగా బుధవారం రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతిరాథోడ్‌ సమ్మక్క-సారలమ్మలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పోలీసుల భారీ బందోబస్తు నడుమ వనదేవతల గద్దెలకు చేరుకున్న మంత్రి.. తల్లులకు పసుపు, కుంకుమ, బెల్లం(బంగారం), చీర, సారె, పూలు, పండ్లు, కొబ్బరికాయలు సమర్పించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. అదేవిధంగా గోవిందరాజు, పగిడిద్దరాజులను దర్శించుకున్నారు. దేవాదాయశాఖ అధికారులు పూజారులతో ప్రసాదం ఇప్పించారు. ఈ సందర్భంగా ఆమె గద్దెల ప్రాంగణంలో విలేకరులతో మాట్లాడారు. మినీ జాతరలో భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని, భక్తులు తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకోవాలన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అన్నారు. జాతరలో ఏర్పాట్లపై సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు.

బందోబస్తు
లక్షకుపైగా భక్తులు తరలిరావడంతో పోలీ్‌సశాఖ ఆధ్వర్యంలో గట్టి బందోబస్తు చర్యలు చేపట్టారు. జంపన్నవాగు, శివరాంసాగర్‌చెరువు, గద్దెల పరిసరాల్లో అధికంగా భక్తుల రద్దీ ఉండడంతో ప్రత్యేక  గస్తీ నిర్వహించారు. 650మంది పోలీసులు విధులు నిర్వర్తించగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బందోబస్తు చేపట్టారు. భద్రత దృష్ట్యా సీసీ కెమెరాల్లో పరిసరాలను పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులు సిబ్బందికి సూచనలు చేస్తున్నారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూలైన్లలో భక్తులకు దేవాదాయశాఖ అధికారులు మంచినీటి సౌకర్యం కల్పించారు. మాస్క్‌ తప్పనిసరి అని కరోనా నిబంధనలు సూచించారు. భక్తులు అధికం కావడంతో గద్దెలకు ఇరువైపులా గేట్లను మూసివేసి దర్శనాన్ని కొనసాగించారు.

నిండిన వసతి షెడ్లు
మహాజాతరలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటుచేసిన ఐదు వసతిషెడ్లు మినీ జాతర సందర్భంగా పూర్తిగా భక్తులతో నిండిపోయాయి. గద్దెలకు సమీపంలో ఉన్న ఐదు వసతిషెడ్లలో అధికారులు సౌకర్యాలు ఏర్పాటుచేసి భక్తుల సంఖ్యను నమోదు చేసుకుంటున్నారు. తాగునీరు, మరుగుదొడ్లు అందుబాటులో ఉండడంతో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఏర్పడలేదు.

బయ్యక్కపేటలో జాతర
తాడ్వాయి మండలంలోని బయ్యక్కపేట సమ్మక్క పుట్టింట మాఘశుద్ధ పౌర్ణమిరోజున చందవంశీయుల ఆధ్వర్యలో జాతర నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. చంద వంశీయులు తమ ఇంటి ఇలవేల్పు అయిన సమ్మక్కకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వడ్డెలు అయిన సిద్దబోయిన వంశస్తులు దేవునిగుట్ట నుంచి సమ్మక్క దేవతను గ్రామశివారులోని గద్దెకు తీసుకువస్తారు.













Updated Date - 2021-02-25T05:38:35+05:30 IST