చింతలగట్టుకు పోటెత్తిన భక్తులు

ABN , First Publish Date - 2021-02-25T06:29:53+05:30 IST

చింతలగట్టుకు పోటెత్తిన భక్తులు

చింతలగట్టుకు పోటెత్తిన భక్తులు
మొక్కులు చెల్లిస్తున్న ఎమ్మెల్యేలు బానోత్‌ శంకర్‌నాయక్‌, ధనసరి సీతక్క

  జయ.. జయ ధ్వానాలతో హోరెత్తిన జాతర

 

మొక్కులు చెల్లించుకున్న ఎమ్మెల్యేలు


గూడూరు రూరల్‌, ఫిబ్రవరి 24 : గూడూరు మండలంలోని చింతలగట్టు, వట్టేవాగు సమ్మక్క-సారలమ్మ జాతరకు భక్తులు పొటెత్తారు. అభయారణ్యం భక్తుల సందడితో జనారణ్యంగా మారింది. బుధవారం ఒక్కరోజే సుమారు 20 వేల మంది  వనదేవతలను దర్శించుకున్నట్లు జాతర కమిటీ సభ్యులు తెలిపారు. నాలుగు రోజుల పాటు జరిగే జాతరలో తొలిరోజే పెద్ద సంఖ్యలో భక్తులు రావడం గమనార్హం. జిల్లాలోని పలువురు ప్రముఖులు అమ్మవార్లను దర్శించుకుని మొక్కులు చెల్లించారు. గూడూరు మండలంలోని ప్రజాప్రతినిధులంతా జాతరలో భాగస్వాములయ్యారు. తమ కొర్కెలు తీర్చాలని వందల మంది తల్లుల గద్దెల ప్రాంగణంలో వరం పట్టారు. 


పసుపు కుంకుమల సమర్పణ...

చింతలగట్టు, వట్టేవాగు సమ్మక్క-సారలమ్మ జాతరలో జగన్నాయకులగూడెం నుంచి పెనక వంశీయులు వనదేవతలకు పసుపు, కుంకుమలను సమర్పించారు. సుమారు రెండు గంటల పాటు గోప్యంగా పూజలు నిర్వహించారు. మంగళహారతులు ఇచ్చి, కొబ్బరికాయలతో పూజలు చేసి సమ్మక్క-సారలమ్మలకు పసుపు కుంకుమలు అప్పగించిన తంతు ఆసక్తికరంగా సాగింది. వనదేవతలకు పూజలు చేస్తున్న సమయంలో వట్టేవాగులో పుణ్యస్నానాలు చేస్తున్న భక్తులు రెండు చేతులు పైకెత్తి అమ్మవార్లకు స్వాగతం పలికారు. దేవత రూపంలో పూజారులు సాష్టంగా నమస్కారాలు చేయగా వారిపై నుంచి పూజారులు నడిచి వెళ్లారు.  




తల్లుల సేవలో ఎమ్మెల్యేలు..

చింతలగట్టు జాతరకు మానుకోట ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌, ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్కలతో పాటు జడ్పీ కోఆప్షన్‌ సభ్యులు ఖాసీం, ఎంపీపీ బానోత్‌ సుజాతమోతీలాల్‌, సోసైటీ చైర్మన్‌ చల్లా లింగారెడ్డి, వన్యప్రాణి సంరక్షణ మండలి సభ్యుడు బానోత్‌ రవికుమార్‌, మార్క్‌ఫెడ్‌ డైరెక్టర్‌ మర్రి రంగారావు, ఎంపీడీవో స్వరూప, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు వెంకటకృష్ణారెడ్డి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ వేముల వెంకన్న, సర్పంచ్‌లు ముక్క లక్ష్మణ్‌రావు, పెనక రాంమూర్తి, సుధాకర్‌రావు, సంపత్‌రావు, కాంగ్రెస్‌ మండల అధ్యక్షులు కత్తి స్వామి, మైనార్టీ సెల్‌ రాష్ట్ర కార్యదర్శి యాకూబ్‌పాషా, ఎంపీటీసీ మాదవపెద్ది గీతాఅమరేందర్‌రెడ్డి, సర్పంచ్‌ యాకయ్య, ఉపసర్పంచ్‌ సంపత్‌, శివలు అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. 


భక్తుల సేవలో ఆంధ్రజ్యోతి...

చింతలగట్టు, వట్టేవాగు సమ్మక్క-సారలమ్మ జాతరలో భక్తులకు ‘ఆంధ్రజ్యోతి’ తనవంతు సేవలందిస్తుంది. నాలుగు రోజుల పాటు భక్తులకు తాగునీరు అందించేందుకు ‘ఆంధ్రజ్యోతి’ ఆధ్వర్యంలో ఉచిత మినరల్‌ వాటర్‌, ఆరోగ్య శిబిరం కార్యక్రమాన్ని చేపట్టింది. జాతర తొలిరోజు బుధవారం మినరల్‌ వాటర్‌ పంపిణీని మహబూబాబాద్‌ ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌, ములుగు ఎమ్మెల్యే ధనసరి సీతక్క ప్రారంభించారు. ఆంధ్రజ్యోతి సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలో   ఆంధ్రజ్యోతి గూడూరు రూరల్‌ రిపోర్టర్‌ గుర్రపు యాకాంబ్రం, జాతర కమిటీ పూజారుల కమిటీ బాధ్యులు దారం సిద్దు,  పెనక నాగయ్య, కారం లక్ష్మయ్య, ఈసం సహాదేవులు, సనుప వీరస్వామి, వాసం భద్రయ్య, సోలం సాగర్‌లు పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-25T06:29:53+05:30 IST