చెట్టును ఢీకొన్న మినీ ట్రక్కు

ABN , First Publish Date - 2021-12-03T06:26:04+05:30 IST

ప్రమాదానికి గురై ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న డ్రైవర్‌ను పోలీసులు, 108 వాహన సిబ్బంది కలిసి కాపాడారు. ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి దాటాక పర్చూరు ప్రాంతంలో చోటుచేసుకుంది.

చెట్టును ఢీకొన్న మినీ ట్రక్కు
క్షతగాత్రున్ని వెలికితీసి వైద్యశాలకు తరలిస్తున్న ఎస్సై రమణయ్య, సిబ్బంది

నుజ్జునుజ్జు అయిన క్యాబిన్‌

3 గంటలు శ్రమించి  డ్రైవర్‌ను బయటకు తీసి ఆస్పత్రికి తరలింపు


పర్చూరు, డిసెంబరు 2 : ప్రమాదానికి గురై ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న డ్రైవర్‌ను పోలీసులు, 108 వాహన సిబ్బంది కలిసి కాపాడారు. ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి దాటాక పర్చూరు ప్రాంతంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లా పిడుగురాళ్ల నుంచి చీరాల వెళుతున్న మినీ ట్రక్కు స్థానిక జీవీఎం పాలిటెక్నిక్‌ కళాశాల సమీపంలోకి చేరుకోగానే అదుపు తప్పి చింతచెట్టును ఢీకొంది. ట్రక్కు క్యాబిన్‌ నుజ్జునుజ్జు అయ్యింది. డ్రైవర్‌ గాలి మధునాయుడికి తీవ్రగాయాలై క్యాబిన్‌లోనే ఇరుక్కుపోయి ప్రాణాపాయ స్థితిలో రోదిస్తున్నాడు. ఇతడిది చిత్తూరు జిల్లా, తొట్టంమేడ మండలం, వామనపల్లి. సమాచారం అందుకున్న పోలీసులు, 108 సిబ్బంది హుటాహుటినా ప్రమాదస్థలానికి చేరుకుని పరిస్థితి తీవ్రతను గమనించారు. వాహనం పూర్తిగా దెబ్బతిని చెట్టుకు అతుక్కొని పోవటంతో వెల్డింగ్‌, కట్టర్‌ సహాయంతో మూడు గంటల సమయం వెచ్చించి మరీ క్షతగాత్రున్ని బయటకు తీశారు. డ్రైవర్‌ కాలు విరగడంతో హుటాహుటిన 108 వాహనం ద్వారా చీరాల ఏరియా వైద్యశాలకు తరలించారు.  కాగా అర్ధరాత్రి దాటాక వాహనం ప్రమాదానికి గురైందన్న సమాచారం తెలుసుకున్న ఎస్సై వై.వి.రమణయ్య హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకున్నారు. యుద్ధప్రాతిపదికన సిబ్బందిని అప్రమత్తం చేసి డ్ర్తెవర్‌ ప్రాణాలను కాపాడటంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


Updated Date - 2021-12-03T06:26:04+05:30 IST