80 నియోజకవర్గాల్లో మైనింగ్‌ మాఫియా లూటీ!

Aug 3 2021 @ 03:40AM

  • 7న రాష్ట్రవ్యాప్తంగా ‘పెట్రో’ నిరసనలు
  • టీడీపీ వ్యూహ కమిటీ భేటీలోచంద్రబాబు


అమరావతి, ఆగస్టు 2 (ఆంధ్రజ్యోతి): వైసీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 80 నియోజకవర్గాల్లో మైనింగ్‌ మాఫియా అడ్డగోలు తవ్వకాలతో లూటీ చేస్తోందని టీడీపీ తేల్చింది. దీనిపై అన్ని చోట్లా బలంగా పోరాడాలని నిర్ణయించింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన వ్యూహ కమిటీ సమావేశం సోమవారం జరిగింది. ఇందులో అక్రమ మైనింగ్‌  వ్యవహారాలపై విపులంగా చర్చించారు. విశాఖ మన్యంలో బాక్సైట్‌, కొండపల్లి అటవీ ప్రాంతంలో గ్రావెల్‌ మాదిరిగా రాష్ట్రంలో పలుచోట్ల వైసీపీ నేతలు మైనింగ్‌ సంపదను అడ్డగోలుగా తవ్వేసి జేబులు నింపుకొంటున్నారని టీడీపీ నేతలు పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాలో సిలికా గనులు మొత్తం శేఖర్‌రెడ్డికి, రాష్ట్రంలో ఇసుక క్వారీలు మొత్తం తమకు కావలసిన వారి కంపెనీకి కట్టబెట్టడం ద్వారా ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి కూడా తన వాటా కింద వేల కోట్ల రూపాయలు దండుకుంటున్నారని, దీనిని ప్రశ్నించేవారిని భయపెట్టడానికే దేవినేని ఉమపై అక్రమ కేసులు నమోదు చేసి అరెస్టు చేశారని ఆరోపించారు. 


పెట్రోలు, డీజిల్‌ ధరల విపరీత పెరుగుదలపై ఈ నెల ఏడో తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సమావేశం నిశ్చయించింది. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి అధ్వానంగా మారడంపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రోడ్డు సెస్‌  కింద ప్రజల నుంచి వసూలుచేసిన రూ.1,200 కోట్లను దారి మళ్లించి రోడ్లను గాలికి వదిలేసిందని ఆరోపించింది. ‘వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఆయన కుమార్తె ఇచ్చిన అనుమానితుల జాబితాలో ఇంటివారిని ఇంతవరకూ సీబీఐ ఎందుకు విచారించలేదు? వివేకా కేసునుకూడా ఇదే మాదిరిగా నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందన్న అనుమానాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. అసలు నేరగాళ్లు ఎవరో బహిరంగ రహస్యం. అయినా వారిని ఎందుకు విచారించలేదో తెలియాలి’ అని వ్యాఖ్యానించింది. టీడీపీ హయాంలో పనిచేసిన అధికారులను వైసీపీ ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తోందని ఆరోపించింది. ఐపీఎస్‌ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును అక్రమ కేసులతో వేధించడంతోపాటు డిస్మిస్‌ చేయాలని సిఫారసు చేయడం దుర్మ్గార్గమని పేర్కొంది. ప్రభుత్వ పథకాల్లో లబ్ధిదారుల సంఖ్యను రకరకాల పేర్లతో కుదించడాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని సమావేశం నిశ్చయించింది. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.