వలకట్ల సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలి

Sep 28 2021 @ 00:12AM
మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి ఒకే వేదికపై మంత్రి పేర్ని, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

  మంత్రి పేర్ని నాని, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

మచిలీపట్నం టౌన్‌, సెప్టెంబరు 27 : బందరు మండలంలో గిలకలదిండి, పోలాటితిప్ప గ్రామాల మధ్య తలెత్తిన వల కట్ల సమస్యను సామరస్యంగా  పరిష్కరించుకోవాలని మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) అన్నారు.  బందరు రైసుమిల్లర్స్‌ అసోసియేషన్‌ హాలులో మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో కలసి మత్స్యకారా గ్రామాల  సమస్యలపై నిర్వహించిన సమావేశంలో మంత్రి పేర్ని నాని మాట్లాడారు. మంత్రి పేర్ని నాని, ప్రతిపక్ష నాయకుడు, మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర ఒకే వేదికపై మత్స్యకారుల సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు రావడం చర్చనీయాంశమయింది. పోలాటితిప్ప, గిలకలదిండి గ్రామాల మత్స్యకారులు సామరస్యంతో సమస్యలను పరిష్కరించుకోవాలని మంత్రి పేర్ని నాని హితవు పలికారు. గిలకలదిండి మత్స్యకారులు తమ సమస్యను మంత్రి పేర్ని నాని, కొల్లు రవీంద్రకు వివరించారు. సముద్ర పాయ నుంచి వచ్చిన ఉప్పునీటిని పోలాటితిప్ప గ్రామస్థులు రొయ్యల చెరువుల సాగు కోసం కాల్వ తవ్వి తీసుకువెళుతున్నారని, సముద్రపు ఆటుపోట్ల వల్ల  కోతకు గురయి పెద్ద కాల్వగా మారిందన్నారు. ఇదే కాలువపై పోలాటితిప్ప ప్రజలు అక్రమంగా వలకట్లు కట్టుకోవడం వల్ల దిగువ ఉన్న తమ వలల్లో చేపలు పడటం లేదన్నారు. వలకట్లు కట్టకుండా నిరోధించాలని గిలకలదిండి గ్రామ స్థులు కోరారు.   ఆ కాల్వ  తమ గ్రామ సరిహద్దులో ఉం దని,  దానిపై తమకే హక్కులు తమకే ఉన్నాయని, చేపలు పట్టుకోవడం మానలేమని పోలాటితిప్ప గ్రామస్తులు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని, కొల్లు రవీంద్ర విడివిడిగా ఇరువర్గాల పెద్దలను పిలిచి సమస్య  పరిష్కరించే దిశగా ప్రయత్నం చేశారు. క్షేత్రస్థాయిలో సందర్శించి ఇరు గ్రామాల ప్రజలకు సమన్యాయం చేస్తామని మంత్రి పేర్ని నాని అన్నారు. ఇందుకు ఇరువర్గాలు అంగీకరించడంతో సమావేశంలో శాంతియుత వాతావరణం ఏర్పడింది. మత్స్యశాఖ జేడీ షేక్‌ లాల్‌ మహ మ్మద్‌, సహాయ సంచాలకులు వెంకటేశ్వరరెడ్డి, బందరు డీఎస్పీ మసుంబాషా, మాజీ జడ్పీటీసీ సభ్యుడు లంకే వెంకటేశ్వరరావు, లంకే నారాయణ ప్రసాద్‌  పాల్గొన్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.