టచ్‌లో ఉన్నది నిజమేనా..?

ABN , First Publish Date - 2022-02-01T18:01:27+05:30 IST

బీజేపీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని ఇటీవలే సంచనల ప్రకటన చేసిన కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను కర్ణాటక రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆనంద్‌సింగ్‌ సోమవారం

టచ్‌లో ఉన్నది నిజమేనా..?

- కుతూహలం రేకెత్తిస్తున్న డీకే, ఆనంద్‌సింగ్‌ భేటీ 

- మంత్రి పదవికి రాజీనామా చేస్తారని ప్రచారం 

- అదేబాటలో మరికొందరు ఎమ్మెల్యేలు..?


బెంగళూరు: బీజేపీకి చెందిన పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు తనతో టచ్‌లో ఉన్నారని ఇటీవలే సంచనల ప్రకటన చేసిన కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ను కర్ణాటక రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ఆనంద్‌సింగ్‌ సోమవారం భేటీ కావడం తీవ్ర కుతూహలం రేకెత్తిస్తోంది. బెంగళూరు సదాశివనగర్‌లోని డీకే శివకుమార్‌ నివాసానికి విచ్చేసిన మంత్రి ఆనంద్‌సింగ్‌ దాదాపు గంటకు పైగా ఉన్నారు. పైగా మంత్రి ప్రైవేటు కారులో డీకే శివకుమార్‌ నివాసానికి రావడం మరింత కుతూహలం కలిగిస్తోంది. ముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మైపై తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్న మంత్రి ఆనంద్‌సింగ్‌ ఏకంగా కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడితో భేటీ కావడాన్ని తేలిగ్గా తీసిపారేయలేమని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. తాను కోరుకున్న కీలక శాఖ కాకుండా పర్యాటక శాఖను కేటాయించడంతో కొద్దికాలంగా మంత్రి ఆనంద్‌సింగ్‌ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. అధిష్ఠానం పెద్దలతో పాటు పార్టీ సీనియర్‌ నేతలు బుజ్జగించడంతో ఆయన మెత్తబడక తప్పలేదు. విజయనగర జిల్లా ఏర్పాటులో తన మాటను నెగ్గించుకోగలిగినప్పటికీ కీలక మంత్రిత్వ శాఖను పొందడంలో విఫలమయ్యానన్న ఆవేదన ఆయనను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా విజయనగర జిల్లా ఇన్‌చార్జి పదవిని కూడా తప్పించి కొప్పళ జిల్లా ఇన్‌చార్జి పదవి కేటాయించడంతో ఆనంద్‌సింగ్‌ తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. మంత్రి పదవితో పాటు బీజేపీకి ఆనంద్‌సింగ్‌ రాజీనామా చేయబోతున్నారన్న వదంతులు వినిపిస్తున్నాయి. ఆనంద్‌సింగ్‌తో పాటు మరికొందరు ఎమ్మెల్యేలు బీజేపీకి రాజీనామా చేసే అవకాశం ఉందని అంటున్నారు. తమ భేటీకి రాజకీయ ప్రాధాన్యత లేదని కేవలం అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చర్చించేందుకే ఆయనను కలిశానని డీకే చెప్పడం విశేషం.

Updated Date - 2022-02-01T18:01:27+05:30 IST