Minister: ఆరోపణలు అవాస్తవం: మంత్రి

ABN , First Publish Date - 2022-09-13T14:18:21+05:30 IST

రాష్ట్రంలో ‘నీట్‌’ రాసిన 12 వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్తుల్లో 4 వేల మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ తదితర

Minister: ఆరోపణలు అవాస్తవం: మంత్రి

పెరంబూర్‌(చెన్నై), సెప్టెంబరు 12: రాష్ట్రంలో ‘నీట్‌’ రాసిన 12 వేల మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్తుల్లో 4 వేల మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ తదితర యూజీ కోర్సుల వైద్య కోర్సులకు నిర్వహించిన ‘నీట్‌’ ఫలితాలు ఈ నెల 7వ తేది విడుదలైన విషయం తెలిసిందే. ఈ పరీక్షలకు సుమారు లక్ష మందికి పైగా రాష్ట్ర విద్యార్థులు హాజరుకాగా, 51.3 శాతం (67,787 మంది) మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాది ఉత్తీర్ణతా శాతం 54.40 శాతంగా ఉంది. అదే సమయంలో అధిక మార్కులు సరాసరి పరిశీలించగా, గత ఏడాది కన్నా రాష్ట్రం వెనుకంజలో ఉండగా, జాతీయస్థాయిలో మొదటి 50 స్థానాల్లో ఇద్దరు రాష్ట్ర విద్యార్థులు మాత్రమే ఉండడం గమనార్హం.


ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు...

ఈ నేపథ్యంలో, నీట్‌ రాసిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల వివరాలను ప్రభుత్వం వెల్లడించింది. ఆ ప్రకారం, రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 17,972 మంది విద్యార్థులు పరీక్షకు దరఖాస్తు చేసుకోగా, 12,840 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 4,447 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. అధిక జిల్లాల్లో విద్యార్థుల ఉత్తీర్ణత శాతం 20 నుంచి 25 లోపే ఉంది. ముఖ్యంగా, తిరుపత్తూర్‌ జిల్లాలో 7 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. చెన్నైలో నీట్‌ రాసిన 172 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో 104 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే, గత ఏడాది నీట్‌కు 8,061 మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు హాజరుకాగా, 1,957 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారని ప్రభుత్వం వివరించింది. కాగా, ఉచిత శిక్షణా కేంద్రాలను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, ఆ కేంద్రాల్లో నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వ పూర్తిగా విఫలమైందని ప్రతిపక్షపార్టీలు ఆరోపిస్తున్నాయి.


ఆరోపణలు అవాస్తవం: మంత్రి అన్బిల్‌ మహేష్‌

‘నీట్‌’  శిక్షణా కేంద్రాల్లో బోధన లోపించిందనే ఆరోపణల్లో వాస్తవం లేదని పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహేష్‌(School Education Minister Anbil Mahesh) పేర్కొన్నారు. నగరంలో సోమవారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ... ‘నీట్‌’  నుంచి రాష్ట్రానికి మినహాయింపు ఇవ్వాలనే విషయంపై చట్టపరంగా పోరాడుతున్నామని, ఇందులో తప్పకుండా విజయం సాధిస్తామన్నారు. గత ప్రభుత్వ పాలనలో జరిగిన లోపాలు సరిదిద్దే చర్యలు చేపట్టామన్నారు. గత రెండేళ్లుగా పాఠశాలలు ప్రారంభమవుతాయా? పోటీ పరీక్షలు జరుగుతాయా? అనే సందిగ్ధత విద్యార్థులు, తల్లిదండ్రుల్లో నెలకొందన్నారు. విద్యార్థులను జాతీయ స్థాయి పరీక్షలకు సిద్ధం చేసేలా మోడల్‌ స్కూల్క్‌ ప్రారంభించామన్నారు. ఐఐటీ, ఐఏఎం తదితర ఉన్నత విద్యా కోర్సుల్లో రాష్ట్ర విద్యార్థులు అధికంగా సీట్లు పొందాలనే లక్ష్యంతో ప్రభుత్వం వివిధ చర్యలు చేపట్టిందని మంత్రి వివరించారు.

Updated Date - 2022-09-13T14:18:21+05:30 IST