Minister బొత్స.. ఎమ్మెల్యేలు ఆసక్తికర వ్యాఖ్యలు.. హాట్ టాపిక్‌గా మారిన వైనం

ABN , First Publish Date - 2022-05-08T21:01:26+05:30 IST

ఈ సమావేశానికి పలువురు కీలక నేతలు డుమ్మా కొట్టారు. అయితే సమావేశానికి హాజరైన మంత్రి..

Minister బొత్స.. ఎమ్మెల్యేలు ఆసక్తికర వ్యాఖ్యలు.. హాట్ టాపిక్‌గా మారిన వైనం

విజయనగరం : జిల్లాలో ఆదివారం నాడు వైసీపీ విస్తృత స్ధాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పలువురు కీలక నేతలు డుమ్మా కొట్టారు. అయితే సమావేశానికి హాజరైన మంత్రి బొత్స సత్యనారాయణ, పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ నేతల మాటలు ప్రస్తుతం జిల్లాలోనే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. ఈ సందర్భంగా బొత్స మాట్లాడుతూ.. పదవులు పొందిన భార్యల స్ధానంలో భర్తలు సమావేశానికి హాజరు కావటం సిగ్గుచేటని.. ఇకపై ఇలా జరిగితే ఉపేక్షించేది లేదని ఒకింత హెచ్చరించారు. అంతటితో ఆగని ఆయన.. ఎవరూ ఒంటెద్దు పోకడలకు పోవొద్దని ఆయన సూచించారు. రానున్న రెండేళ్లు కష్టపడితే మరో ఐదేళ్లు వైసీపీవేనని.. మంత్రులకు సచివాలయాలుంటే జిల్లాల్లో ఉన్న సచివాలయాలన్నీ ఎమ్మెల్యేలవేనని బొత్స వ్యాఖ్యానించారు.


నాయకుల్లోనే అసంతృప్తి..

ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు  మాట్లాడుతూ.. ఇటీవల మంత్రి బొత్స పార్టీ నేతలకు, కార్యకర్తలకు అందుబాటులో లేకపోయినా చిన్న శ్రీను అందరికీ అందుటులో ఉంటూ కావాల్సిన అన్ని కార్యాలు చేస్తున్నారని చెప్పుకొచ్చారు. మరో ఎమ్మెల్యే అప్పల నరసయ్య (Appala Narsaiah) మాట్లాడుతూ.. వేదికపై నాయకులు మాట్లాడుతుంటే ముందున్న వారిలో ఉత్సాహం కనిపించటం లేదన్నారు. అసంతృప్తి ఎక్కడైనా ఉందా అంటే.. అది నాయకుల్లోనే మాత్రమే ఉంది కానీ.. ప్రజల్లో ఏ మాత్రం లేదని ఆయన చెప్పుకొచ్చారు.


ఎమ్మెల్సీకు ఎమ్మెల్యే చురకలు..!

ఎమ్మెల్సీ రఘురాజు (MLC Raghu Raju) చేసిన కామెంట్స్‌పై ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి స్పందిస్తూ చురకలంటించారు. అందరి మాదిరిగానే తాము కూడా మీట నొక్కడమే చూస్తున్నామని.. ఎమ్మెల్యేలకు అంటూ ప్రత్యేకమైన సౌఖర్యాలేమీ లేవన్నారు. మూడున్నరేళ్ల తరువాత పార్టీ సమావేశం జరగటం సంతోషంగా ఉందని రాజాం ఎమ్మెల్యే జోగులు అన్నారు. తాను టీడీపీలో (Telugudesam) ఉన్నప్పుడు కూడా మంత్రి బొత్సతో ఉన్న మంచి వ్యక్తిగత పరిచయాలతో నియోజకవర్గానికి చాలా మేలు చేశారని శోభాహైమావతి చెప్పుకొచ్చారు. మొత్తానికి చూస్తే అటు మంత్రి (Minister) వ్యాఖ్యలు.. ఇటు నేతల వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారాయి.

Read more