నేత్ర పర్వంగా అమ్మవారి తెపోత్సవం

ABN , First Publish Date - 2020-10-27T11:25:04+05:30 IST

వరంగల్‌ భద్రకాళి చెరువులో దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నేత్రపర్వంగా భక్తిశ్రద్ధతో తెప్పొత్సవం నిర్వహించారు

నేత్ర పర్వంగా అమ్మవారి తెపోత్సవం

పాల్గొన్న మంత్రి దయాకర్‌రావు

ముగిసిన శరన్నవరాత్రులు


వరంగల్‌ కల్చరల్‌, అక్టోబరు 26: వరంగల్‌ భద్రకాళి చెరువులో దేవీశరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం నేత్రపర్వంగా భక్తిశ్రద్ధతో తెప్పొత్సవం నిర్వహించారు. పంచాయతీ రాజ్‌, గ్రామీణాభివృద్ధి, శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తెప్పొత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఓరుగల్లుకు విశిష్టమైన చారిత్రక నేపథ్యం ఉందని, అత్యద్భుతమైన వారసత్వ సంపదకు నిలయమని అన్నారు. భక్తులకు కొంగుబంగారంగా వర్ధిల్లుతున్న భద్రకాళి అమ్మవారు తెలంగాణకే మణిహారమని తెలిపారు. వరంగల్‌కు పూర్వవైభవం తేవడమే సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ లక్ష్యమన్నారు. వరంగల్‌ అభివృద్ధికి మాస్టర్‌ ప్లాన్‌ని సిద్ధం చేసి సీఎం కేసీఆర్‌ చేతుల మీదుగా  ఆవిష్కరించున్నట్టు వెల్లడించారు. హైదరాబాద్‌ తర్వాత వరంగల్‌ అన్ని రంగాల్లో అగ్రగామిగా అభివృద్ధి చెందనున్నట్లు తెలిపారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. కరోనా పీడ తొలగిపోవాలని కోరారు. 


కాగా ఈసారి తెప్పోత్సవ వాహనంలో పూజారులు తప్ప ఇతరులెవరూ కూర్చొవద్దని నిర్ణయించారు. దీంతో మంత్రి దయాకర్‌రావుతో పాటు ఇతర ప్రముఖులు తెప్పోత్సవ వాహనం ఎక్కలేదు. ఈ కార్యక్రమంలో వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌, మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, మాజీ ఎంపీ గుండు సుధారాణి,, ‘కుడా’ చైర్మన్‌ మర్రి యాదవరెడ్డి, వద్దిరాజు రవిచంద్ర, కార్పొరేటర్లు భక్తులు పాల్గొన్నారు.


ముగిసిన శరన్నవరాత్రులు:

భద్రకాళీ దేవాలయంలో దేవీ శరన్నవరాత్రోత్సవాలు సోమవారం ముగిశాయి. అమ్మవారికి పట్టాభిషేకంలో భాగంగా శోడషోపచార పూజ జరిపారు. బ్రహ్మశ్రీ దెందుకూరి వెంకటేశ్వర ఘనపాఠి ఆధ్వర్యంలో వేదపండితులు, అర్చకులు, ఆగమ శాస్త్ర పండితులు ఈ క్రతువును నిర్వహించారు. ప్రధాన అర్చకుడు భద్రకాళి శేషు క్రతువు జరుగుతున్న తీరును తన వ్యాఖ్యానం ద్వారా భక్తులకు వినిపించారు. భద్రకాళి శరణం మమ అనే నామస్మరణతో ఆలయ ప్రాంగణమంతా మార్మోగింది. శరభ వాహనసేవ, చూర్ణోత్సవం అనంతరం భద్రకాళి తటాకంలో చక్రస్నానం నిర్వహించారు. ఆ తర్వాత ధ్వజావరోహనం చేశారు.

Updated Date - 2020-10-27T11:25:04+05:30 IST