మాతృత్వం గొప్ప వరం

ABN , First Publish Date - 2022-06-24T05:55:12+05:30 IST

మాతృత్వం గొప్ప వరం

మాతృత్వం గొప్ప వరం
గర్భిణులకు చీర, సారె అందజేస్తున్న మంత్రి దయాకర్‌రావు దంపతులు

రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

150 మంది గర్భిణులకు సామూహిక సీమాంతం

తొర్రూరు, జూన్‌ 23: మాతృత్వం గొప్ప వరమని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. గురువారం తొర్రూరు పట్టణ కేంద్రంలోని వందేమాతరం ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో ఎర్రబెల్లి ట్రస్టు సహకారంతో నిర్వహించిన సామూహిక సీమంతోత్సవంలో 150 మంది గర్భిణులను చీర, సారెతో సత్కరించి పౌష్టికాహారం అందజేశారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సుఖ ప్రసవాలకు ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు. వెనకట మంత్రసానులు ప్రసవాలు చేసేవారని, మారుతున్న ఆధునిక యుగంలో ఆపరేషన్లు వచ్చాయని తెలిపారు. గర్భిణులు పౌష్టికాహరం తీసుకుంటే ఆరోగ్యవంతంగా ఉంటారన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహారం లభిస్తుందన్నారు. గర్భం దాల్చిన దగ్గరి నుంచి, బిడ్డ పుట్టి ఇంటికి వెళ్లేంత వరకు రాష్ట్ర ప్రభుత్వం వైద్య, ఆరోగ్య శాఖ ద్వారా అన్ని సౌకర్యాలు కల్పిస్తుందన్నారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని తెలిపారు. పేద ప్రజల సంక్షేమానికి మరిన్ని పథకాలు ప్రవేశపెడతారని తెలిపారు. దేశంలోని అన్ని రాష్ర్టాల ప్రజలు, అధికారులు మన రాష్ట్రం వైపు చూస్తున్నారని, ఈవిధంగా అభివృద్ధి చేస్తున్నా ప్రతిపక్షాలు అవాక్కులు చవాక్కులు మాట్లాడటం సరికాదన్నారు. పది రోజుల్లో రైతుల ఖాతాల్లో రైతుబంధు జమ అవుతుందన్నారు. 

సాధారణ ప్రసవాలను చేపట్టాలి : కలెక్టర్‌ శశాంక

 జిల్లాలో సాధారణ ప్రసవాలకే సిబ్బంది అవగాహన కల్పించాలని కలెక్టర్‌ శశాంక అన్నారు. జిల్లాలో 75శాతం ఆపరేషన్లు తగ్గించి సాధారణ ప్రసవాలే చేపడుతున్నారని తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పూర్తి పర్యవేక్షణతో ఉండి మంచి నడవడికతో బిడ్డలను ఆత్మీయంగా పెంచుకోవాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలు, సబ్‌ సెంటర్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సిబ్బంది సమన్వయంతో పని చేస్తే వారు అందించే డేటా ఒకే విధంగా ఉంటుందని తెలిపారు. ఆరోగ్య లక్ష్మి ద్వారా గర్భిణులు పేరు నమోదు చేయించుకోవాలని సూచించారు. అనంతరం ఫౌండేషన్‌ ఆవరణలో మామిడి మొక్కలు నాటారు. జిజ్ఞాస క్విజ్‌ వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు. కార్యక్రమంలో సీడబ్య్లూసీ చైర్‌పర్సన్‌ నాగవాణి, ఫౌండేషన్‌ నిర్వాహకుడు రవీంద్ర, ఆర్డీవో రమేష్‌, తహసీల్దార్‌ రాఘవరెడ్డి, ట్రస్టు చైర్‌పర్సన్‌ ఉషాదయాకర్‌ రావు, టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు,  తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-06-24T05:55:12+05:30 IST