ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యా భోదన

ABN , First Publish Date - 2022-03-20T21:05:34+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ, మండల పరిషత్తు, జిల్లా ప్రజా పరిషత్తు పాఠశాలలో నాణ్యమైన విద్య, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని పంచాయితీరాజ్, గ్రామీణ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు

ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్యా భోదన

హనుమకొండ: రాష్ట్ర ప్రభుత్వ, మండల పరిషత్తు, జిల్లా ప్రజా పరిషత్తు పాఠశాలలో నాణ్యమైన విద్య, అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం  తగిన చర్యలు తీసుకుంటుందని పంచాయితీరాజ్, గ్రామీణ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. మన ఊరు - మన బడి కార్యక్రమం ఉమ్మడి వరంగల్ లోని ఆరు జిల్లాల్లో ని 11 వందల 65 ప్రభుత్వ, మండల పరిషత్తు, జిల్లా ప్రజా పరిషత్తు పాఠశాలల్లో ఈ సంవత్సరం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసిందని మంత్రి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.


మన ఊరు - మన బడి కార్యక్రమాన్ని ఈ సంవత్సరం అమలుకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఆరు జిల్లాల్లో విద్యార్థులు ఎక్కువ ఎన్రోల్మెంట్ ఉన్న 1165 పాఠశాలలో ఎంపిక చేశామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు. అందులో భాగంగా జనగామ జిల్లాలో 176 పాఠశాలలను, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 149 పాఠశాలలను, ములుగు జిల్లాలో 125 పాఠశాలలను, వరంగల్ జిల్లాలో 223 పాఠశాలలను, హనుమకొండ జిల్లాలో 176 పాఠశాలలను, మహబూబాబాద్ జిల్లాలో 316 పాఠశాలలను ఎంపిక చేశామని ఆయన తెలిపారు.


విద్యార్థులకు నాణ్యమైన డిజిటల్ విద్యాబోధన ఈ కార్యక్రమంలో భాగంగా ఉంటుందన్నారు. అందుకు అనుగుణంగా అన్ని సదుపాయాలతో డిజిటల్ తరగతి గదుల ఏర్పాటు, అదనపు తరగతుల నిర్మాణం, ప్రస్తుతం శిథిలావస్థలో ఉన్న తరగతి గదుల మరమ్మతులు, అవసరమైన ఫర్నిచర్, నీటి సదుపాయాలతో కూడిన మరుగుదొడ్లు నిర్మాణం, మౌలిక సదుపాయాలు అయిన టాయిలెట్లు, విద్యుత్ సరఫరా, స్వచ్ఛమైన త్రాగు నీటి సరఫరా, కిచెన్ షెడ్స్, ప్రహరీగోడల నిర్మాణం, ఉన్నత పాఠశాలల్లో డైనింగ్ హాల్స్ నిర్మాణం మున్నగు సదుపాయాలు మన ఊరు - మన బడి కార్యక్రమంలో భాగంగా చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.


ఈ కార్యక్రమం అమలులో పారదర్శకత ఉండటానికి ఈ పనులను స్థానిక ప్రజలను భాగస్వాములను చేయడానికి పనుల నిర్మాణ బాధ్యతలను పాఠశాల మేనేజ్మెంట్ కమిటీలకు అప్పగించనున్నట్లు ఆయన చెప్పారు.మన ఊరు – మన బడి కార్యక్రమం పై అందరికి అవగాహాన కల్పించడం, భాగస్వాములు చేయడానికి ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్నీ జిల్లా కేంద్రాలలో అన్నీ అసెంబ్లీ నియోజకవర్గాలలో, మండలాలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని ఆయన తెలిపారు.


 పేద తల్లీదండ్రులు కష్టపడి సంపాందించి తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలలకుపంపిస్తున్నారని మంత్రి అన్నారు. అందరి ఆకాంక్ష మేరకు వచ్చే విద్యా సంవత్సరం నుండి 1 నుండి 8 వ తరగతి వరకు ఇంగ్లీష్ మీడియాన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశ పెడుతామని మంత్రి తెలిపారు. 2023-24 విద్యా సంవత్సరంలో 9 వ తరగతి నుండి, 2024-25 విద్యా సంవత్సరంలో 10 వ తరగతి నుండి అన్నీ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రవేశ పెట్టనున్నట్లు ఆయన తెలిపారు. అందునిమిత్తం తెలుగు, ఇంగ్లీష్ ద్వి భాషాలలో పాఠ్యపుస్తకాలు సిద్దం చేస్తున్నామని ఆయన తెలిపారు. దీనికి తోడుగా ఇంగ్లీష్ మీడియం బోధన పై ఉపాధ్యాయులకు శిక్షణ ప్రారంభించామని మంత్రి చెప్పారు.


ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి దాతలు ముందుకు రావాలని మంత్రి దయాకర్ రావు కోరారు. 10 లక్షల రూపాయలు విరాళామిస్తే తరగతి గదికి, 25 లక్షల రూపాయల విరాళామిస్తే ప్రాథమిక పాఠశాలకు, 50 లక్షల విరాళామిస్తే ప్రాధమికోన్నత పాఠశాలకు, 1 కోటి రూపాయలిస్తే ఉన్నత పాఠశాలలకు దాతలు లేదా వారు సూచించిన పేర్లు పెడదమన్నారు. ముఖ్యమంత్రి కే.సి.ఆర్ నాయకత్వంలో మొదలైన మన ఊరు – మన బడి విద్య యజ్ఞంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై పాఠశాలల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.


 

Updated Date - 2022-03-20T21:05:34+05:30 IST