ఆందోళన వద్దు.. కరోనాను సమష్టిగా ఎదుర్కొందాం...

ABN , First Publish Date - 2021-05-09T05:55:26+05:30 IST

ఆందోళన వద్దు.. కరోనాను సమష్టిగా ఎదుర్కొందాం...

ఆందోళన వద్దు.. కరోనాను సమష్టిగా ఎదుర్కొందాం...
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు

కొవిడ్‌ బాధితులకు ఫోన్‌లో ధైర్యం చెప్పిన మంత్రి ఎర్రబెల్లి


హన్మకొండ టౌన్‌, మే 8 : ఆందోళన వద్దు, కరోనాను సమష్టిగా ఎదుర్కొందామని కొవిడ్‌ బాధితులకు రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ధైర్యం చెప్పారు. శనివారం జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని కరోనా బాధితులు, ప్రజాప్రతినిధులు, అధికారులతో మంత్రి ఎర్రబెల్లి టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, కేంద్ర ప్రభుత్వం ఆశించిన స్థాయిలో సహకారం అందించడం లేదన్నారు. కరోనా సోకిన వారు ఆత్మస్థైర్యాన్ని కోల్పోకూడదని  సూచించారు. కరోనా సోకిన వారి కుటుంబ సభ్యులు ఆందోళన చెందకుండా బాధితులకు సహకారం అందించాలన్నారు. కరోనా నియంత్రణలో భాగంగా ప్రతీ ఒక్కరు మాస్కులు ధరించాలని, సామాజిక దూరం పాటించాలన్నారు. అత్యవసరమైతే తప్ప ఇంటినుంచి బయటికి రాకూడదన్నారు. బాధితులకు సహాయం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్నానన్నారు. అత్యవసరమైతే తనకు కాని, తన సిబ్బందికి ఫోన్‌ చేయాలన్నారు. కరోనా బాధితులకు అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు కాల్‌ చేసి భరోసా ఇవ్వాలని, అవసరమైన మందులు, సరుకులు సమకూర్చాలని ఆదేశించారు. కరోనా రోగుల చికిత్స కోసం పాలకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో ఆక్సీజన్‌ బెడ్లు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. త్వరలో కొడకండ్లలో ఆస్పత్రిలో ఈ సౌకర్యాన్ని కల్పించనున్నట్లు ఎర్రబెల్లి వెల్లడించారు.  


Updated Date - 2021-05-09T05:55:26+05:30 IST