ఆసక్తి రేపుతున్న మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలు.. మళ్లీ తెరపైకి..

ABN , First Publish Date - 2021-06-16T17:16:13+05:30 IST

రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ..

ఆసక్తి రేపుతున్న మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలు.. మళ్లీ తెరపైకి..

హన్మకొండ: రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి వ్యాఖ్యలతో మరోసారి హన్మకొండ, వరంగల్ జిల్లాల ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. మంగళవారం హన్మకొండలో మంత్రి విలేకర్లతో మాట్లాడుతూ జిల్లాల ప్రస్థావన తేవడం చర్చనీయాంశంగా మారింది. జిల్లాల విభజనలో భాగంగా ఉమ్మడి వరంగల్‌ను ఆరు జిల్లాలుగా (వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, జనగామ) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. గతంలో వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల ఏర్పాటు విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. వరంగల్ అర్బన్‌ను హన్మకొండ జిల్లా, వరంగల్ రూరల్‌ను వరంగల్‌గా మార్చాలన్న చర్చ సాగింది. అయినప్పటికీ ముందుగా ప్రకటించినట్లుగా వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాలుగానే కొనసాగుతున్నాయి. ఈ రెండు జిల్లాల కొనసాగింపు విషయంలో కొంత సందిగ్ధత నెలకొన్నా వరంగల్ రూరల్‌కు హెడ్‌క్వార్టర్ సైతం ఫైనల్ చేయలేదు. వరంగల్ అర్బన్ జిల్లా పరిధిలోని పలు కార్యాలయాల్లోనే రూరల్ జిల్లా కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. 


అజంజాహిమిల్లు ప్రాంగణంలో రూరల్ జిల్లా హెడ్‌క్వార్టర్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించినప్పటికీ పలు కారణాలతో కార్యరూపం దాల్చలేదు. పరకాల నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో స్థలసేకరణ చేపట్టే ప్రయత్నం చేసినా అది కొలిక్కిరాలేదు. ఈ క్రమంలో రాష్ట్రంలో నూతన జిల్లాల ప్రస్థావన వచ్చిన ప్రతిసారీ వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లాల విషయం తెరపైకి వస్తూనే ఉంది. ఇటీవల హుజురాబాద్(పీవీ) జిల్లా అవుతుందన్న ప్రచారం సాగుతున్న క్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ వినోద్‌కుమార్ సైతం హన్మకొండ, వరంగల్ జిల్లాల ప్రస్థావన తీసుకువచ్చారు.


ఈ క్రమంలో మంగళవారం మంత్రి ఎర్రబెల్లి నోట ఈ వ్యాఖ్యలు రావడంతో వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలను హన్మకొండ, వరంగల్ జిల్లాలుగా మార్చే అవకాశం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మంత్రి ఎర్రబెల్లి చెప్పినట్లు ప్రజల అభిప్రాయం మేరకు ఈనెల 21న జిల్లాకు వచ్చే సీఎం కేసీఆర్ హన్మకొండ, వరంగల్ జిల్లాల విషయమై స్పష్టత ఇచ్చే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.



Updated Date - 2021-06-16T17:16:13+05:30 IST