కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణపై విషం చిమ్ముతున్నారు: మంత్రి గంగుల

ABN , First Publish Date - 2022-04-21T20:21:57+05:30 IST

కేంద్ర మంత్రిగా గౌరవ ప్రదమైన స్ధానంలో ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణ పై విషయం చిమ్మేలా, ఇక్కడి ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసేలా విమర్శలు చేస్తున్నారని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు

కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలంగాణపై విషం చిమ్ముతున్నారు: మంత్రి గంగుల

హైదరాబాద్: కేంద్ర మంత్రిగా గౌరవ ప్రదమైన స్ధానంలో ఉన్న కిషన్ రెడ్డి తెలంగాణ పై విషయం చిమ్మేలా, ఇక్కడి ప్రజల ఆత్మగౌరవం దెబ్బతీసేలా విమర్శలు చేస్తున్నారని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ ఆరోపించారు. తెలంగాణ వ్యాపారుల ఆత్మస్థైర్యం దెబ్బతీసేలా డిల్లీ వేదికగా రాష్ట్రాన్ని, ప్రభుత్వాన్ని, ప్రజలను అవమానపర్చే విదంగా మాట్లాడారని అన్నారు. నూకలు బుక్కుతవా అని అవమానించిన పియూష్ గోయల్ మన రాష్ట్రం కాదు, కానీ తెలంగాణ ప్రజల ఓట్లతో డిల్లీ గద్దెపై కూసొని తెలంగాణ ప్రజల్ని అవమానించేలా కిషన్ రెడ్డి మాట్లాడారని అన్నారు. ఎఫ్ సిఐ, సివిల్ సప్లయ్స్ విషయాలపై కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడారని ఆయన దుయ్యబట్టారు. గురువారం మీడియాతో మాట్లాడిన మంత్రి గంగుల కిషన్ రెడ్డి తీరును ఎండగట్టారు. 


రాష్ట్రంలో ఎప్.సి.ఐ, కేంద్రానికి సంబందించిన బియ్యం రైస్ మిల్లులో మాయమైందని కిషన్ రెడ్డి అన్నారు. ధాన్యం కొనుగోళ్లకోసం రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీతో లోన్ తీసుకొని రైతుల వద్దనుండి ఎమ్మెస్పీకి వడ్లు కొనేది రాష్ట్రం, ఈ మిత్తి ఇబ్బందులు, డబ్బుల సర్దుబాటు రాష్ట్రం చేస్తుంది. ఇందులో కేంద్రం పాత్ర లేనేలేదని అన్నారు.వడ్లను బియ్యంగా మార్చి ఎప్.సి.ఐకు ఇచ్చాకే వాటికి సరిపడా డబ్బుల్ని 4నెలల తర్వాత ఎఫ్ సిఐ ఇస్తుందన్నారు.మిల్లర్లపై దాడులు చేసే అధికారం ఎప్.సి.ఐకు ఉంది. వెరిఫికేషన్లో 4,53,000 బస్తాలు తక్కువ ఉన్నవని కిషన్ రెడ్డి అన్నారు. 2021 యాసంగి, వానాకాలం కలిపి 40 కోట్ల 50 లక్షల బస్తాలను సేకరించాం.ఇందులో కిషన్ రెడ్డి చెప్పింది 0.0001 శాతం అని అన్నారు.ఇది కూడా చాలా తప్పుడు సమాచారమని అన్నారు.


కొన్ని చోట్ల బాగులు చినిగి వడ్లు కింద పడుతాయి వాటిని లెక్కించలేదు.బాగులు కిందపడ్డవాటిని లెక్కించలేదన్నారు.కామారెడ్డిలో 84,927 బస్తాలు కనబడట్లేదు అన్నారు, ఇది తప్పు అవి బియ్యం బస్తాలు. దీనిపై ఎప్.సి.ఐకి లేఖ కూడా రాశామని గుర్తు చేశారు.సిద్దిపేట జిల్లాలో 64 బస్తాలు మాత్రమే తక్కువగా ఉంటే దానిని ఎఫ్ సిఐ 1,659 బస్తాలు తక్కువగా ఉన్నట్లు తమ నివేధికలో చూపించారు దీనిపైన లేఖ రాశామని తెలిపారు.కొన్ని చోట్ల మిల్లుల్లో బియ్యాన్ని ధాన్యంగా లెక్కించారు, కొన్ని చోట్ల పడిపోయిన బ్యాగుల్ని లెక్కించలేదు,అందులో సైతం బ్యాగులు చినిగి ధాన్యం అక్కడే ఉందని అన్నారు. దాన్ని ఎఫ్.సి.ఐ లెక్కలోకి తీసుకోలేదుని మంత్రి తెలిపారు.



రైస్ మిల్లుల్లో ఉన్నప్పుడు అవి రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం మాత్రమే.ఎప్.సి.ఐ గోదాములోకి వెల్లినప్పుడే అవి కేంద్రానికి చెందినవని గుర్తుచేశారు.ఎక్కడైనా కొందరు మిల్లర్లు డిఫాల్ట్ ఐతే రాష్ట్ర ప్రభుత్వం ముక్కుపిండి వసూలు చేస్తుందని అన్నారు.ప్యాక్టరీలో తయారైన సబ్బులు దొంగతనం ఐతే కస్టమర్ కు ఏం నష్టం.ప్రభుత్వ డబ్బంటే ప్రజల డబ్బు దాన్ని ఖచ్చితంగా సంరక్షిస్తాం, రాష్ట్ర ప్రభుత్వానికి సంబందించి ఒక్క వడ్లగింజను సైతం వదిలేది లేదని మంత్రి గంగుల స్పష్టం చేశారు.

Updated Date - 2022-04-21T20:21:57+05:30 IST