
హైదరాబాద్: కరీంనగర్ జిల్లాలో దాదాపు 150 కోట్ల విలువ గల ఈ పనుల్ని త్వరితగతిన పూర్తిచేసుకొని దసరాకు ప్రారంభించేవిదంగా చర్యలు తీసుకోవాలని బిసి, పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్(gangula kamalakar)అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కేసీఆర్(kcr) కి ఇష్టమైన జిల్లా కరీంనగర్ అని, జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న పనులకోసం ఎన్ని నిధులైనా వెచ్చించేందుకు సిద్దంగా ఉన్నారని, అధికారులు త్వరితగతిన పెండింగ్ పనులను పూర్తి చేయాలని అన్నారు. గురువారం హైదరాబాద్ లోని తన కార్యాలయంలో మంత్రి గంగుల కమలాకర్ ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు, జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు వొడితెల సతీష్, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, ఆర్ అండ్ బీ ఈఎన్సీ పి.రవీందర్ రావు జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో వివిద అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మంత్రి గంగుల అధికారులు చేయాల్సిన పనులపై దిశానిర్దేశం చేసారు, కరీంనగర్ జిల్లాతో పాటు మున్సిపాలిటీపై ముఖ్యమంత్రి ప్రత్యేక శ్రద్దను కనబరుస్తారని, స్మార్ట్ సిటీ ప్రాజెక్టును సైతం రాష్ట్రంలో కరీంనగర్ కు కేటాయించారన్నారు. ఇందులో బాగంగా ఇప్పటికే వందల కోట్ల నిధులతో కరీంనగర్ ని అభివ్రుద్ది చేస్తున్నామన్నారు. ఆర్ అండ్ బీ పరిధిలో పెండింగ్ పనులను త్వరతిగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. కేబుల్ బ్రిడ్జి రోడ్డు పనులను స్పీడప్ చేసి కమాన్ నుండి సదాశివపల్లి వరకూ రోడ్డును రెండునెలల్లోగా పూర్తి చేయాలని ఆదేశించారు, ఓల్డ్ కేకే రోడ్ లోని ఎలగందల బ్రిడ్జ్ పనుల టెండర్ ప్రక్రియ త్వరలో పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు.కరీంనగర్ టు పిట్లం రహదారి పనుల్లో ప్రస్తుతం ఒద్యారం వరకూ బ్యూటిఫికేషన్తో సహా పూర్తి చేసామని మిగతా పనుల్ని సైతం అతి త్వరలోనే పూర్తి చేయాలని అన్నారు.
హెచ్ కెఆర్ రోడ్డు ప్లైఓవర్ బ్రిడ్జికి ప్రతిపాదనలు సమర్పించాలని, ఈ పనులలో ఉన్న అడ్డంకుల్ని అధిగమించేలా ఈఎన్సీ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని విబాగాలతో సమన్వయం చేసుకొని పనులను యుద్దప్రతిపాదికన పూర్తిచేయాలని, నిధుల కొరత లేదన్నారు.ఈ సమావేశంలో పాల్గొన్న హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ ఈఎన్సీతో పాటు జిల్లా అధికారులకు నియోజకవర్గంలోని పెండింగ్ పనుల గురించి వివరించారు. సైదాపూర్, బొమ్మనపల్లి రోడ్డు పనులు, కోహెడ, వింజపల్లి రోడ్డు పనులతో పాటు డబుల్ బెడ్రూంలపై ప్రత్యేక శ్రద్ద వహించి త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మరో ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మానకొండూరు నియోజకవర్గంలోని ఆర్ అండ్ బీ పనుల గురించి వివరించారు.
అన్నారం రోడ్డును త్వరతిగతిన అభివ్రుద్ది చేయడంతో పాటు అన్నారం మానకొండూరు సెంట్రల్ లైటింగ్, గన్నేరువరంలో చేయాల్సిన పనులను సమావేశంలో చర్చించారు.ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గంలో పూర్తిచేయాల్సిన పనులను అధికారుల ద్రుష్టికి తీసుకొచ్చారు, వీణవంక రోడ్డు త్వరతగతిన పూర్తిచేయడమే కాకుండా కనపర్తీ బ్రిడ్జిని నిర్మించాలని ప్రతిపాదనలు సమర్పించారు.