Advertisement

ప్రతి గింజనూ కొంటాం

Sep 16 2020 @ 04:09AM

70 లక్షల టన్నుల కొనుగోలు లక్ష్యం 

భారీగా గన్నీ సంచుల అవసరం ఉంది

రేషన్‌ డీలర్ల వద్ద ఉన్నవి అప్పగించాలి

రైస్‌ మిల్లర్లు సహకరించాలి: గంగుల 


హైదరాబాద్‌, సెప్టెంబరు 15 (ఆంధ్రజ్యోతి): రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజనూ ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఈ వానాకాలం సీజన్లో 70 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలును లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్‌ దార్శనికతతో చేపట్టిన రైతు సంక్షేమ చర్యలు, సాగునీటి ప్రాజెక్టులతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణం పెరిగి... ఏటేటా ధాన్యం దిగుబడులు గణనీయంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. ఇందుకు అనుగుణంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు పౌరసరఫరాల శాఖ విస్తృత ఏర్పాట్లు చేస్తోందన్నారు. మంగళవారం పౌరసరఫరాల భవన్‌లో రైస్‌ మిల్లర్లు, రేషన్‌ డీలర్లతో మంత్రి వేర్వేరుగా సమావేశమయ్యారు.


రాష్ట్రంలో పెరుగుతున్న ధాన్యం దిగుబడికి అనుగుణంగా భారీగా కొనుగోలు చేయాల్సిన అవసరం ఏర్పడిందని, ఇందుకుపెద్ద సంఖ్యలో గన్నీ సంచులు అవసరమని అన్నారు. దాదాపు 10 కోట్లు కొత్తవి, 9 కోట్లు పాత గన్నీ సంచుల అవసరం ఉందన్నారు. ప్రభుత్వ అవసరాలను గుర్తించి రేషన్‌ డీలర్లు తమ వద్ద ఉన్న గన్నీ సంచులను పౌరసరఫరాల సంస్థకు విక్రయించాలని ఆదేశించారు. కరోనా సమయంలో ప్రభుత్వం ఉచితంగా పంపిణీ చేసిన రేషన్‌ బియ్యానికి కూడా డీలర్లకు కమీషన్‌ ఇచ్చిందని మంత్రి గంగుల గుర్తుచేశారు. రైస్‌ మిల్లర్లు కూడా రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని సామాజిక బాధ్యతగా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు. 

Follow Us on:
Advertisement
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.