Oil palm రైతులు ఆయిల్‌ పామ్‌ సాగు ల‌క్ష్యంగా ముందుకు సాగాలి:Indra karan reddy

ABN , First Publish Date - 2022-05-08T20:07:43+05:30 IST

ఆయిల్ పామ్ సాగుకు మన నేలలు అనుకూలమ‌ని దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నాలు ఇచ్చే ఆయిల్ పామ్ సాగు వైపు రైతులు దృష్టి సారించాలని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి (Indra karan reddy) కోరారు. పామ్‌ ఆయిల్‌ సాగు విస్తరణ క్రమంలో ఈ ప్రాంతంలోని మాయిల్‌ క్షేత్రాలను పరిశీలించడంతో పాటు పామ్‌ ఆయిల్‌

Oil palm రైతులు ఆయిల్‌ పామ్‌ సాగు ల‌క్ష్యంగా ముందుకు సాగాలి:Indra karan reddy

భ‌ద్రాద్రి-కొత్త‌గూడెం జిల్లా: ఆయిల్ పామ్ సాగుకు మన నేలలు అనుకూలమ‌ని దీర్ఘ‌కాలిక ప్ర‌యోజ‌నాలు ఇచ్చే ఆయిల్ పామ్ సాగు వైపు రైతులు దృష్టి సారించాలని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి (Indra karan reddy) కోరారు. పామ్‌ ఆయిల్‌ సాగు విస్తరణ క్రమంలో ఈ ప్రాంతంలోని మాయిల్‌ క్షేత్రాలను పరిశీలించడంతో పాటు పామ్‌ ఆయిల్‌ పంట స్థితిగతులపై అవగాహన కోసం నిర్మ‌ల్ ప్రాంతం రైతులు, ప్ర‌జాప్ర‌తినిదుల‌తో క‌లిసి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆదివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గంలో పర్యటించారు. తొలుత దమ్మపేట గ్రామంలో పామాయిల్ కర్మాగారాన్ని సంద‌ర్శించారు. పంటను రైతులు పామ్ ఆయిల్ గింజ‌ల‌ను  ఫ్యాక్టరీకి ఎలా తరలిస్తున్నారు?  తీసుకు వచ్చిన పామాయిల్  గెల‌ల ప్రాసెసింగ్ ఎలా జరుగుతుంది? ట‌న్నుకు నూనె దిగుబడి ఎంత వస్తుంది? అనే  వివ‌రాల‌ను అడిగి తెలుసుకున్నారు. 


అనంత‌రం అల్లిపల్లి  గ్రామంలో ఆయిల్  పామ్ నర్సరీని ప‌రిశీలించారు.మొక్క‌లను ఎలా పెంచుతున్నారు? పామాయిల్ సాగులో ఎటువంటి పద్ధతులు పాటించాలి ? ఎటువంటి ఎరువుల‌ను వాడాలి?పామాయిల్ దిగుబడి సంవత్సరంలో ఏ నెల‌ల్లో అధికంగా వస్తుంది ? అని సంబంధిత అధికారులు, న‌ర్స‌రీ నిర్వ‌హ‌కుల‌ను అడిగి తెలుసుకోవ‌డంతో పాటు ఇత‌ర అంశాలపై  రైతుల‌కు అవగాహన కల్పించారు.ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ పండించిన పంట‌కు గిట్టుబాటు ధ‌ర వ‌చ్చి రైతులు ఆర్థికంగా బ‌ల‌ప‌డాల‌నే ఉద్దేశ్యంతో సీయం కేసీఆర్  వాణిజ్య పంట‌లు ప్ర‌త్యేకంగా పామాయిల్ పంట వేయాల‌ని ప్రొత్స‌హిస్తున్నార‌ని తెలిపారు. మార్కెట్లో వంట నూనెల డిమాండ్ నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు 20 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగుకు  ప్ర‌భుత్వం  ప్రణాళికలు సిద్దం చేసింద‌న్నారు. వచ్చే జూన్ తర్వాత  3 లక్షల ఎకరాలలో ఆయిల్ పామ్ సాగు చేసేందుకు రైతులకు మొక్కలు సిద్దంగా ఉంచార‌న్నారు.


సంప్రదాయ పంటల సాగుతో నష్టపోతున్న రైతులు మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలు పండించాలని ఆయన సూచించారు.నిర్మ‌ల్ జిల్లాలో వానాకాలంలో 3 వేల ఎక‌రాలు, యాసంగిలో 7 వేల ఎక‌రాల పామాయిల్ సాగు చేయాల‌ని ల‌క్ష్యంగా నిర్ధేశించుకున్న‌ట్లు మంత్రి తెలిపారు.రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సబ్సిడీ ద్వారా మొక్కలు బిందు సేద్య పరికరాలు, అంత‌ర పంట‌ల‌కు  విత్త‌నాల‌ను అంద‌జేస్తున్న‌ట్లు వెల్ల‌డించారు.వానాకాలం పంట‌కు ఆర్మూర్ నియోజ‌క‌వ‌ర్గంలోని చేపూర్ గ్రామ న‌ర్సరీ నుంచి, యాసంగి పంట‌కు సారంగాపూర్ మండ‌లం బీర‌వెల్లి గ్రామ న‌ర్స‌రీ నుంచి  పామాయిల్ మొక్క‌ల‌ను తెప్పించి, రైతుల‌కు అంద‌జేస్తామ‌ని పేర్కొన్నారు. చెట్టు నుంచి కోసిన గెల‌ల‌ను 48 గంటల్లో ఆయిల్ ఫ్యాక్ట‌రీ త‌ర‌లించాల్సి ఉంటుంద‌ని ఈ నేప‌థ్యంలో పామాయిల్ రైతుల‌కు దూర‌బారం లేకుండా  నిర్మ‌ల్  స‌మీపంలోనే  పామాయిల్ ప్యాక‌ర్టీ ఏర్పాటుకు కృషి చేస్తున్న‌ట్లు చెప్పారు.



ఆయిల్ పామ్ మొక్క‌లు నాటిన 4 సంవ‌త్స‌రాల‌కు  పంట చేతికి వ‌స్తుంద‌ని, ఎక‌రాకు స‌మారు 10- 15 ట‌న్నుల దిగుబ‌డి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని, టన్నుకు ప్ర‌స్తుత మార్కెట్ ధ‌ర రూ. 22వేల నుంచి 24  వేల వ‌ర‌కు ఉంద‌ని, ఈ లెక్క‌న ఎక‌రాకు 10 ట‌న్నులైన స‌గ‌టున ఒక ఎక‌రానికి ఖ‌ర్చులు మిన‌హా రైతుకు రూ. 2 ల‌క్ష‌ల  పంట లాభం వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్నారు. రానున్న రోజుల్లో  మార్కెట్ అంచ‌నాల మేర‌కు పామాయిల్ ధ‌ర పెరిగే ఛాన్స్ ఉంద‌ని తెలిపారు.  పామాయిల్ చెట్టు జీవిత కాలం  స‌గ‌టున 30- 40 సంవ‌త్స‌రాలు కాగా అప్ప‌టి వ‌ర‌కు పంట కాస్తుంద‌ని చెప్పారు. అంతేకాకుండా మిగితా పంట‌ల మాదిరిగాకాకుండా  పామాయిల్ కు వ‌న్య‌ప్రాణుల నుంచి ఎలాంటి  పంట న‌ష్టం ఉండ‌ద‌ని, కూలీల అవ‌స‌రం కూడా చాలా త‌క్కువ‌ని, మార్కెట్ ధ‌ర కూడా అధికంగా ఉంటుంద‌ని పేర్కొన్నారు.   

ఈ కార్యక్ర‌మంలో అశ్వ‌రావు పేట ఎమ్మెల్యే మెచ్చ నాగేశ్వ‌ర్ రావు, నిర్మ‌ల్ జిల్లా రైతు స‌మ‌న్వ‌య స‌మితి అధ్య‌క్షులు వెంక‌ట్రామ్ రెడ్డి, జిల్లా వ్య‌వ‌సాయ శాఖ అధికారి అంజిప్ర‌సాద్,మాజీ డీసీసీబీ చైర్మ‌న్ రాంకిష‌న్ రెడ్డి, ఎంపీపీలు రామేశ్వ‌ర్ రెడ్డి, మ‌హిపాల్ రెడ్డి,సారంగాపూర్ వ్య‌వ‌సాయ మార్కెట్ క‌మిటీ చైర్మ‌న్ వంగా రవింద‌ర్ రెడ్డి, ఆత్మ చైర్మ‌న్ గంగాధ‌ర్ రెడ్డి,  టీఆర్ఎస్ పార్టీ  మండ‌ల క‌న్వీన‌ర్లు, ఇత‌ర ప్ర‌జాప్ర‌తినిదులు, అధికారులు, 300 మంది రైతులు పాల్గొన్నారు.

Read more