పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: మంత్రి Indrakaran reddy

ABN , First Publish Date - 2022-06-07T00:59:55+05:30 IST

ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం, స‌మిష్టి బాధ్య‌త‌తోనే ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్య‌త సాధ్య‌ప‌డుతుందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ (environment)శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి(indrakaran reddy) అన్నారు.

పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత: మంత్రి Indrakaran reddy

హైద‌రాబాద్: ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం, స‌మిష్టి బాధ్య‌త‌తోనే ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్య‌త సాధ్య‌ప‌డుతుందని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ (environment)శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి(indrakaran reddy) అన్నారు. సోమ‌వారం కాలుష్య నియంత్రణ మండలి(pollution controll board) రాష్ట్ర కార్యాలయంలో నిర్వ‌హించిన  ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలో మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి పాల్గొన్నారు. కార్యాలయ ప్రాంగణంలో మొక్కలు నాటిన అనంతరం కాలుష్య నియంత్రణ మండలి ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లోని స్టాళ్ళను మంత్రి పరిశీలించారు. గాలి కాలుష్యంపై ప్రజలకు  అవగాహన కల్పించేందుకు రూపొందించిన షార్ట్ ఫిల్మ్ ను మంత్రి ఆవిష్క‌రించారు. అనంత‌రం ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో మంత్రి మాట్లాడుతూ ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు తెలంగాణ ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని, ప్ర‌జ‌లు కూడా ప‌ర్యావ‌ర‌ణ స‌మ‌తుల్య‌త ప‌ట్ల‌ అవగాహనతో మసలుకోవాన్నారు.


సామాజిక బాధ్య‌త‌గా ప్రకృతి వనరులను పొదుపుగా వాడటం, వాయు, జ‌ల‌, నేల కాలుష్యం కాకుండా మ‌న వంతు ప్ర‌య‌త్నాలు చేసినప్పుడే కాలుష్య రహిత రాష్ట్రం, దేశాన్ని త‌యారు చేయ‌గ‌ల‌మ‌ని పేర్కొన్నారు.వాతావ‌ర‌ణ స‌మ‌తుల్య‌త‌ను కాపాడేందుకు ముఖ్య‌మంత్రి కె.చంద్ర‌శేఖ‌ర్ రావు గారు ప్ర‌త్యేక‌ ప్ర‌ణాళిక‌లు రూపొందించి అమ‌లు చేస్తున్నార‌ని వెల్ల‌డించారు.  హ‌రిత‌హారం, స్వచ్ఛ తెలంగాణ, జలహారం, ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌గ‌తి, మిష‌న్ కాక‌తీయ‌ లాంటి అనేక కార్యక్రమాలను చేప‌ట్టి ప్రజలందరి భాగస్వామ్యంలో వీటిని విజ‌య‌వంతంగా అమ‌లు అయ్యేలా చూస్తున్నామ‌ని తెలిపారు. అడ‌వుల సంర‌క్షిస్తూ, అభివృద్ధి ప‌రుస్తూనే, విరివిరిగా మొక్క‌లు నాటే, తెలంగాణకు ఆకుప‌చ్చ‌ల హారంగా హరితహారం కార్యక్రమాన్ని చేపట్టామ‌న్నారు. హ‌రితహారం కార్య‌క్ర‌మం ద్వారా ఏడు విడ‌త‌ల్లో 250 కోట్ల మొక్క‌లు నాటామ‌ని, ఎనిమిద‌వ విడ‌త హరిత‌హారం కార్య‌క్ర‌మంలో భాగంగా 19.54 కోట్ల మొక్క‌ల్ని నాటాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ట్లు చెప్పారు. 


గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ప్రాంతాల్లో న‌ర్స‌రీల‌ను ఏర్పాటు చేసి ప‌ల్లె, ప‌ట్ట‌ణ ప్ర‌కృతి వ‌నాలు ఏర్పాటు చేశామ‌ని,  అవెన్యూ ప్లాంటేష‌న్  లో భాగంగా దాదాపు 92 వేల కిలోమీట్ల‌ర్ల మేర మొక్క‌ల‌ను నాటామ‌న్నారు.ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ,కాలుష్య నియంత్ర‌ణ‌కు కాలుష్య నియంత్ర‌ణ మండ‌లి అనేక చ‌ర్యలు తీసుకుంటుంద‌న్నారు. జల, వాయు, నేల కాలుష్యాన్ని నివారణ‌, నియంత్ర‌ణపై ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షిస్తుంద‌ని తెలిపారు.ప్లాస్టిక్ వ‌స్తువుల వినియోగాన్ని త‌గ్గించ‌డం, ప్ర‌త్యామ్నాయ మార్గాల‌పై ప్ర‌ధానంగా దృష్టి పెట్టిన‌ట్లు చెప్పారు.  పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం పెంపొందించేందుకు పీసీబీ ఆధ్వర్యంలో పలు కార్యక్రమాలు  నిర్వ‌హిస్తున్నార‌న్నారు.  

Updated Date - 2022-06-07T00:59:55+05:30 IST