వనాల‌తోనే మానవాళి క్షేమం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

ABN , First Publish Date - 2022-03-21T20:33:53+05:30 IST

అడవుల రక్షణ, పరిరక్షణ, విస్తరణ, మొక్కలు నాటడం, చెట్ల పెంపకం, వ‌న్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌, జీవివైవిధ్యాన్ని కాపాడ‌టం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని అటవీ,పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు.

వనాల‌తోనే మానవాళి క్షేమం: మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

హైదరాబాద్: అడవుల రక్షణ, పరిరక్షణ, విస్తరణ, మొక్కలు నాటడం, చెట్ల పెంపకం, వ‌న్య‌ప్రాణుల సంర‌క్ష‌ణ‌, జీవివైవిధ్యాన్ని కాపాడ‌టం కోసం తెలంగాణ ప్ర‌భుత్వం కృషి చేస్తుంద‌ని అటవీ,పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. మనాలతోనే మానవాళి మనుగడ సాధ్యమవుతుందన్నారు. సోమవారం ప్రపంచ అటవీ దినోత్సవం సందర్భంగా మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మార్గ‌నిర్దేశంలో పర్యావరణ పరిరక్షణకు అధిక ప్రాధన్య‌త‌నిస్తున్నామని తెలిపారు.  తెలంగాణకు హరితహారం కార్య‌క్ర‌మం ద్వారా తెలంగాణ‌లో 7.70 శాతం ప‌చ్చ‌ద‌నం పెరిగింద‌ని వెల్ల‌డించారు.మానవుల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక, పర్యావరణ అభివృద్ధికి అడవులు ఎంతో అవసరమని పేర్కొన్నారు. 


పట్టణీకరణ, వ్యవసాయం, ప్రాజెక్టులు, పరిశ్రమలు నిర్మాణం, పోడు వ్యవసాయం, గృహ వినియోగం వంటి కారణాలతో అడవులు అంతరించి పోతున్నాయని, ఇది ఇలాగే కొన‌సాగితే జీవుల మ‌నుగ‌డ‌కే ప్ర‌మాదం అని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. భ‌విష్య‌త్ త‌రాల అవ‌స‌రాల‌ను దృష్టిలో ఉంచుకుని పర్యావరణ సమతుల్యత సాధించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా న‌ర్సరీల ఏర్పాటు, ప‌ల్లె, ప్ర‌కృతి వ‌నాల ద్వారా ప‌చ్చ‌ద‌నం పెంచ‌డం, రిజ‌ర్వ్ ఫారెస్ట్ బ్లాకుల్లో అర్బ‌న్ లంగ్ స్పేస్ కోసం అర్బ‌న్ ఫారెస్ట్ పార్కుల అభివృద్ధి, వన్యప్రాణుల అభయారణ్యాల్లో ఎకోసిస్టాన్ని పెంపొందించ‌డం ద్వారా  అడవులు జీవ వైవిధ్యాన్ని కాపాడ‌టం కోసం ఎన్నో కార్య‌క్ర‌మాల‌ను చేప‌డుతున్నామ‌న్నారు. పర్యావరణాన్ని కాపాడటానికి, అటవీ ఆధార పరిశ్రమలను అభివృద్ధి చేయడానికి, అడవులను పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తుందన్నారు. అడ‌వుల ప‌రిర‌క్ష‌ణ‌లో అట‌వీ అధికారులు, సిబ్బంది నిరంత‌రం కృషి చేస్తున్నార‌ని, ఇదే ఉత్సాహంతో ముందుకు సాగాల‌న్నారు.

Updated Date - 2022-03-21T20:33:53+05:30 IST