అమాత్యా.. అభివృద్ధి ఏదీ.. అధికారమిస్తే.. ప్రజల నమ్మకానికి తూట్లు!

ABN , First Publish Date - 2021-11-13T06:51:59+05:30 IST

ఆయన రాష్ట్ర మంత్రి... శ్రీకృష్ణదేవరాయలు రెండో రాజధాని పెనుకొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధి. రెండున్నరేళ్ల ఆయన పాలనలో పెనుకొండ రూపురేఖలు కాదు కదా... ఆ ప్రాంత అభివృద్ధికి ఒక్క రూపాయి ఖర్చుచేసిన పరిస్థితి లేదన్నది నిర్వివాదాంశం.

అమాత్యా.. అభివృద్ధి ఏదీ.. అధికారమిస్తే.. ప్రజల నమ్మకానికి తూట్లు!

  • రెండున్నరేళ్లలో ఒక్క రూపాయి ఖర్చు చేయని వైనం
  • పెనుకొండలో ఎక్కడి సమస్యలు అక్కడే తిష్ట
  • రాయల ఉత్సవాలు నిర్వహించలేని పరిస్థితి
  • పట్టణ సుందరీకరణ ఉత్తిదేనా...?
  • టీడీపీ హయాంలో ఏర్పాటైన కియా మినహా... 
  • అనుబంధ పరిశ్రమలేవీ...?
  • అభివృద్ధి అంతా టీడీపీ హయాంలోనే 
  • అంటున్న పెనుకొండ వాసులు


అనంతపురం, నవంబరు12(ఆంధ్రజ్యోతి)

ఆయన రాష్ట్ర మంత్రి... శ్రీకృష్ణదేవరాయలు రెండో రాజధాని పెనుకొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాప్రతినిధి. రెండున్నరేళ్ల ఆయన పాలనలో పెనుకొండ రూపురేఖలు కాదు కదా... ఆ ప్రాంత అభివృద్ధికి ఒక్క రూపాయి ఖర్చుచేసిన పరిస్థితి లేదన్నది నిర్వివాదాంశం. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధిదారులకు ఆర్థిక లబ్ధి చేకూర్చడం మినహా... ఆ ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదన్న విమర్శలు స్థానిక ప్రజల నుంచే వ్యక్తమవుతున్నాయి. హామీలు గుప్పించడంలో చూపుతున్న శ్రద్ధ వాటిని అమలు చేయడంలో విస్మరించారనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. మాటలకు, చేతలకు పొంతన లేదనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది. ఒక్కసారి అవకాశమిచ్చి అధికారమిస్తే... తమ నమ్మకానికి తూట్లు పొడిచారనే ఆవేదన అక్కడి ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. పెనుకొండ పట్టణాన్ని సుందరీకరిస్తామని బహిరంగంగానే హామీ ఇచ్చినప్పటికీ... అది ఇప్పటికీ నెరవేరలేదు. గుడ్‌ మార్నింగ్‌లో చెప్పిన ఏ సమస్యా పరిష్కారానికి నోచుకోలేదు. దర్గా సర్కిల్‌ను సుందరీకరిస్తామని ఏడాది క్రితం చెప్పిన హామీకి అతీగతీలేదు. అప్పట్లో ఆగమేఘాల మీద ఆ ప్రాంతంలో ఉపాధి పొందుతున్న 40 కుటుంబాలను ఖాళీ చేయించారు. సుందరీకరణ పనులకు భూమిపూజ చేసి, సరిపెట్టడం మినహా... ఇప్పటి వరకూ ఏ ఒక్క పని చేపట్టలేదు. పట్టణంలో డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడా మురుగు కాలువలు లేవు. మంత్రి ఇలాకాలో వీధి దీపాల సమస్య ఉందంటే... పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వాస్పత్రిలోనూ సౌకర్యాలలేమి వెంటాడుతోంది. డాక్టర్లు, సిబ్బంది కొరత పీడిస్తోంది. ఈ సమస్య పరిష్కారానికి ఏరోజూ చొరవ చూపలేదన్న విమర్శలు.. స్థానిక ప్రజల నుంచి మంత్రికి ఎదురవుతున్నాయి. కొండమీదకు రోడ్డు నిర్మాణ పనులు టీడీపీ హయాంలో 70 శాతం పూర్తి చేసినప్పటికీ... మిగిలిన 30 శాతం పూర్తి చేయడంపై శ్రద్ధ చూపలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే... ఆ రోడ్డువైపు కన్నెత్తి చూడట్లేదు.


 మరీ దారుణమైన విషయమేమంటే... రాయల ఉత్సవాలు నిర్వహించలేని దుస్థితి. ఈ లెక్కన ఆ ఉత్సవాల పట్ల ఆయనకున్న శ్రద్ధ ఏపాటిదో అర్థమవుతోంది. ఈ విషయంలో మంత్రి తీరుపై స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శ్రీకృష్ణదేవరాయలను ఆరాఽధించే బలిజలను తీవ్ర కలవరపెడుతోంది. రోడ్లు, భవనాలశాఖ మంత్రిగా ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న పెనుకొండ పట్టణంలో రోడ్లు అధ్వాన్న స్థితికి చేరుకోవడమే ఆ ప్రాంత అభివృద్ధి పట్ల ఆయనకున్న చిత్తశుద్ధిని తేటతెల్లం చేస్తోందన్న అభిప్రాయం స్థానికుల నుంచి వ్యక్తమవుతోండటం గమనార్హం. పెనుకొండ నగరపాలక పంచాయతీగా మార్పు చెందిన నేపథ్యంలో... ఆ పట్టణానికి సమీపంలోనున్న కోనాపురం, వెంకటరెడ్డిపల్లి దాని పరిధిలోకి చేరిపోయాయి. ఇప్పటికీ ఆ పల్లెల్లో ఎక్కడా ఎలాంటి అభివృద్ధి పనులు జరగలేదు.


గతంలో ఎలా ఉన్నాయో... అదే సమస్యలతో అక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. టీడీపీ హయాంలో ఏర్పాటైన కియా పరిశ్రమ మినహా... రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో ఒక్క పరిశ్రమ ఏర్పాటుకు మంత్రి చొరవ చూపలేదన్న విమర్శలు లేకపోలేదు. కియా పరిశ్రమ రాకతో ఆ ప్రాంత భూముల ధరలకు రెక్కలొచ్చాయి. అనేక మంది పరిశ్రమలొస్తే భూముల ధరలు మరింత పెరిగిపోయే అవకాశముందని ఆశపడ్డారు. మరికొందరు భూములమ్మి పెద్దపెద్ద భవంతులు నిర్మించారు. పరిశ్రమలు ఏర్పాటైతే ఎంతో మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని... వారందరికి ఆవాసం కోసం అద్దెకివ్వొచ్చని అప్పులు చేసి, మరీ భవంతులు నిర్మించారు. ప్రస్తుతం చాలా భవంతులు ఖాళీగా ఉండటంతో వాటి యజమానులు తీవ్ర నిట్టూర్పుతో ఉన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే అప్పుల ఊబిలో కొట్టుమిట్టాడుతున్నారు. వీటన్నింటికి మూలకారణం కియాను విస్తరణ చేయకపోడంతో అనుబంధ సంస్థలు వెనుదిరిగాయి. వైద్య కళాశాల తీసుకొచ్చానని మంత్రి చెబుతున్నప్పటికీ ఇప్పటి వరకూ భూమి పూజతోనే సరిపెట్టారు. ఒక్క ఇటుక పడలేదు. ఫలానా అభివృద్ధి పనులు చేశామని గొప్పలుపోయే పరిస్థితి మంత్రితో పాటు... నగర పంచాయతీ ఎన్నికల్లో ప్రచారానికి వచ్చిన ఆ పార్టీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలకు లేదనే వాదనలకు ఆస్కారమిస్తోంది. ఇలా అన్నివర్గాల ప్రజలూ తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో పెనుకొండ నగర పంచాయతీకి ఎన్నికలు జరుగుతున్నాయి. పెనుకొండ కోటలో పాగా వేసేందుకు మంత్రి సర్వశక్తులొడ్డుతున్నారు. స్థానిక ప్రజల్లో మంత్రి పనితీరుపై తీవ్ర అసంతృప్తులు నెలకొన్న నేపథ్యంలో... వారు ఏ మేరకు ఓటు రూపంలో తీర్పునిస్తారో వేచి చూడాల్సిందే.


అభివృద్ధంతా టీడీపీ హయాంలోనే అంటున్న పెనుకొండ వాసులు

తెలుగుదేశం హయాంలో చేసిన అభివృద్ధి పనులు మినహా... వైసీపీ రెండున్నరేళ్ల పాలనలో పెనుకొండలో ఏ ఒక్క అభివృద్ధి పని జరగలేదని ప్రధాన ప్రతిపక్ష టీడీపీ ఆ నియోజకవర్గ ఇనచార్జ్‌ బీకే పార్థసారధితో పాటు నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. అవి క్షేత్రస్థాయిలో వాస్తవాలనే అభిప్రాయం అక్కడి ప్రజల్లో వ్యక్తమవుతోంది. రాష్ట్ర విభజన తరువాత జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో పెనుకొండ నియోజకవర్గం నుంచి బీకే పార్థసారధి పోటీచేసి, గెలుపొందారు. ఈ నేపథ్యంలో... తాను పనిచేసిన ఐదేళ్లలోనే అభివృద్ధి జరిగింది తప్పా... ఈ రెండున్నరేళ్లలో ఏ ఒక్క అభివృద్ధి పని జరగలేదని ఆయన ఘంటాపథంగా చెబుతున్నారు. ఒక్కసారి ఆ వివరాల్లోకి వెళ్తే... టీడీపీ హయాంలోనే రూ.13 వేల కోట్లతో కియా కార్ల పరిశ్రమతోపాటు అనుబంధ సంస్థలు ఏర్పడ్డాయనడంలో సందేహం లేదు. పెనుకొండకు శాశ్వత తాగునీటి సమస్య పరిష్కారానికి గొల్లపల్లి రిజర్వాయర్‌ నుంచి రూ.5 కోట్లతో ప్రత్యేకంగా వైపులైన వేయించి, ఆ ప్రాంత ప్రజలకు తాగునీరు అందిస్తున్నారన్నది నిర్వివాదాంశం. రూ.4 కోట్లతో పెనుకొండ పట్టణంలో సిమెంట్‌ రోడ్లు ఏర్పాటు చేశారనడంలో అతిశయోక్తి లేదు. అధికారుల రికార్డులే ఆ గణాంకాలను స్పష్టం చేస్తున్నాయి. 


పెనుకొండను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకుగానూ కొండపైకి రోడ్డు నిర్మాణానికి రూ.14 కోట్లు నిధులు మంజూరు చేయడంతోపాటు 70 శాతం పనులు పూర్తి చేశారు. పెనుకొండకు కియా రాకతో ప్రజల జీవన స్థితిగతుల్లో మార్పులొచ్చాయి. దినసరి కూలీ కుటుంబాలే కాకుండా అన్నివర్గాల ప్రజలకు ఉపాధి లభించింది. కార్ల పరిశ్రమలో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయి. దేశవిదేశాల నుంచి ప్రతినిధుల రాకతో పెనుకొండ కొత్త కళను సంతరించుకుంది. గతంలో ఎకరా రూ.లక్షలు ధర పలికే భూములకు రెక్కలొచ్చాయి. ఎకరా రూ.కోటికిపైగానే ధర పలుకుతుండడం టీడీపీ హయాంలో ఏర్పడిన కియా పరిశ్రమతోనే సాధ్యమైందన్న అభిప్రాయం అక్కడి ప్రజల నుంచి వ్యక్తమవుతోంది. ఏదేమైనప్పటికీ... అభివృద్ధంతా టీడీపీ హయాంలోనే జరిగిందని పెనుకొండ వాసులంటున్నారు. వైసీపీ రెండున్నరేళ్ల పాలనలో పెనుకొండకు ఒరిగిందేమీ లేదన్న విమర్శలను స్థానిక మంత్రి మూటగట్టుకుంటున్నారు.

Updated Date - 2021-11-13T06:51:59+05:30 IST