లోకేష్ ట్రాక్టర్ నడపడంపై మంత్రి కొడాలి వివాదాస్పద వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2020-10-27T19:49:30+05:30 IST

నారా లోకేష్‌పై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

లోకేష్ ట్రాక్టర్ నడపడంపై మంత్రి కొడాలి వివాదాస్పద వ్యాఖ్యలు

కృష్ణా జిల్లా : టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ నారా లోకేష్ పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు పర్యటనలో భాగంగా వరద బాధిత ప్రాంతాల్లో ట్రాక్టర్ నడిపిన విషయం విదితమే. అయితే ఆ ట్రాక్టర్ అదుపు తప్పి కాల్వలోకి దూసుకెళ్లింది. పక్కనే ఉన్న టీడీపీ ఎమ్మెల్యే మంతెన రామరాజు అప్రమత్తమై ట్రాక్టర్‌ను కంట్రోల్ చేసి లోకేష్‌ను కిందికి దించేయడంతో పెను ప్రమాదమే తప్పింది. అయితే ఈ ఘటనపై సోషల్ మీడియాలో వైసీపీ కార్యకర్తలు, కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు హేళన చేస్తూ మాట్లాడుతున్నారు. తాజాగా మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. నారా లోకేష్‌పై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.


ట్రాక్టర్‌ను దించినట్లే..!

ఇవాళ నందిగామలో పర్యటించిన ఆయన.. పలు విషయాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా లోకేష్ ట్రాక్టర్ నడపడంపై మాట్లాడుతూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దొంగలు పడిన ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్టుగా ఉంది. వరదలు ఎప్పుడు వచ్చాయి. ఎప్పుడు పరిశీలిస్తున్నారు. మొదటి ట్రిప్పు తలకాయ ఉన్న వాడు కొల్లేరులో పెట్టుకుంటారా..?. లోకేష్ ఆఫ్ నాలెడ్జ్.. పార్టీ నడపడం రాదు, ట్రాక్టర్ నడపడం రాదు. తెలుగుదేశం పార్టీ కూడా లోకేష్ నాయకత్వంలో కొల్లేటిలో ట్రాక్టర్ ఏ విధంగా దించాడో టీడీపీని కూడా దించుతాడు. బుద్ధి ఉన్నోడు ముందుగా దిగిపోండి ట్రాక్టర్ నుండి పార్టీ నుండి లోకేష్ గురించి ఎక్కువగా మాట్లాడటం పరమ వేస్ట్అని మంత్రి నాని వ్యాఖ్యానించారు.


ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో..!

ఇదిలా ఉంటే.. ఆకివీడు పీఎస్‌లో నారా లోకేష్‌పై కేసు నమోదు అయింది. ట్రాక్టర్‌ డ్రైవింగ్‌పై అవగాహన లేకుండానే వరదముంపు ప్రాంతాల్లో నడిపి ప్రమాదానికి కారణమైనందుకు లోకేష్‌పై ఐపీసీ 279,184, 54ఎ, ఎపిడమిక్‌ యాక్ట్‌లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కోవిడ్‌ నిబంధనలు పాటించలేదని కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై లోకేష్ స్పందిస్తూ.. వరద బాధితులను పరామర్శించేందుకు గడప దాటని జగన్ రెడ్డి, గడప గడపకీ వెళ్లే తనను అడుగడుగునా అడ్డుకోవాలనుకుంటున్నారని మండిపడ్డారు.ఎన్ని కేసులు పెడతావో పెట్టుకో.. కష్టాలలో ఉన్నోళ్ల కన్నీరు తుడిచేందుకు ప్రతీ ఊరూ వెళతా! ప్రతి గడపా తొక్కుతా! బాధితులకు భరోసానిస్తా! అని లోకేష్ చెప్పుకొచ్చారు.

Updated Date - 2020-10-27T19:49:30+05:30 IST