సుపరిపాలన కోసమే కొత్త జిల్లాలు: మంత్రి కొడాలి

ABN , First Publish Date - 2022-01-28T02:26:05+05:30 IST

రాష్ట్ర ప్రజలకు సుపరిపాలనను అందించడానికే కొత్త జిల్లాలను సీఎం

సుపరిపాలన కోసమే కొత్త జిల్లాలు: మంత్రి కొడాలి

అమరావతి: రాష్ట్ర ప్రజలకు సుపరిపాలనను అందించడానికే కొత్త జిల్లాలను సీఎం జగన్ ఏర్పాటు చేశారని మంత్రి కొడాలి నాని అన్నారు. మూడు రాజధానులతో పరిపాలన అన్ని ప్రాంతాలకు వెళ్లాలని భావించిన వ్యక్తి జగన్ అని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికీ కూడా తమ ప్రభుత్వం దానికే కట్టుబడి ఉందని ఆయన స్పష్టం చేశారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో పార్లమెంటు నియోజకవర్గం కేంద్రంగా ఒక జిల్లా ఏర్పాటు చేస్తామని మాట ఇచ్చామన్నారు. అంతకు ముందే తాము పార్టీలో పార్లమెంట్ అధ్యక్షుడిని పెట్టామన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం కొన్ని చోట్ల నియోజకవర్గాలు కలిపారన్నారు. ఎన్టీఆర్ ఆనాడు మండల వ్యవస్థ తీసుకొచ్చి, కరణాల వ్యవస్థను రద్దు చేశారన్నారు. అనంతరం మండలాలను వైఎస్సార్ పునర్ వ్యవస్టీకరణ చేశారని ఆయన తెలిపారు.


జగన్ పాదయాత్ర చేస్తున్నప్పుడు ఎన్టీఆర్ పేరును ఈ జిల్లాకు పెట్టాలని కృష్ణా జిల్లా ప్రజలు కోరారన్నారు. టీడీపీ వారు కనీసం జిల్లా పేరు కూడా పెట్టుకోలేని దుస్థితిలో ఉన్నారన్నారు. 2017లోనే జగన్ వాళ్ళకి మాట ఇచ్చి నేడు నెరవేర్చారని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ అభిమానుల తరపున తానైతే జగన్ కృతజ్ఞతలు తెలుపుతున్నానన్నారు. ఎన్టీఆర్‌కు తమ వైసీపీ పార్టీ, తాము వ్యతిరేకం కాదన్నారు. కొత్త జిల్లాల ఏర్పటుపై చాలామందికి చాలా అభిప్రాయాలు ఉన్నాయన్నారు. వీటిలో మార్పులు చేర్పులకు అవకాశం ఉందన్నారు. కృష్ణా జిల్లాకి ఎన్టీఆర్ పేరుపెట్టడం కృష్ణా జిల్లా హెడ్ క్వార్టర్‌ విజయవాడ ఉందని పెట్టారన్నారు. ప్రతిపక్షానికి ఏమీ లేక కేసినో పంచాయతీని తీసుకువచ్చారన్నారు. ఉద్యోగ సంఘాలు కూడా రాజకీయ పార్టీలు వద్దు తమ సమస్యను తామే పరిష్కరించుకుంటామని చెప్పాయని ఆయన తెలపారు. 


టీడీపీ నిజనిర్దారణ కమిటీపై కొడాలి సెటైర్లు..

టీడీపీ నిజనిర్దారణ కమిటీ పై కొడాలి సెటైర్లు  వేశాడు. చంద్రబాబు ఒక చీర్ బాయ్స్ టీమ్‌ను వేసాడని ఆయన ఎద్దేవా చేశారు. అందరి దగ్గరికి వెళ్లి వాళ్ళు డాన్సులు వేస్తున్నారన్నారు. జిల్లాల విభజన చేపడితే ఉద్యోగుల సమస్య పక్కకి పోయినట్లేనా అని ఆయన నిలదీశారు.  ఎన్టీఆర్ చనిపోగానే నువ్వు కృష్ణా జిల్లాకు ఆపేరు పెడితే చంద్రబాబును ఎవరన్నా అపారా అని ఆయన ప్రశ్నించారు.


చంద్రబాబు ఏది చెప్తే బీజేపీ నాయకుడు సోము వీర్రాజు అదే మాట్లాడతాడని ఆయన వ్యగ్యంగా వ్యాఖ్యానించారు.  చంద్రబాబుకు సోము వీర్రాజు బీ టీమ్ అని ఆయన ఎద్దేవా చేశారు.  గోవాలో బీజేపీ ప్రభుత్వమే కదా, కేసినోలను ఎందుకు రద్దు చేయలేదని ఆయన ప్రశ్నించారు.


పదమూడు జిల్లాల ఏపీని.. రాష్ట్ర ప్రభుత్వం 26 జిల్లాలుగా విస్తరించింది. 13 కొత్త జిల్లాలతో పాటు 12 కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపై మంగళవారం అర్ధరాత్రి గెజిట్‌ నోటిఫికికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఏవిధమైన అభ్యంతరాలు ఉన్నా.. నెలరోజుల్లోగా ఆయా జిల్లాల కలెక్టర్లకు తెలపాలని ప్రజలను కోరింది. ఇందుకు ఫిబ్రవరి 26 వరకు గడువు విధించింది. ఈ మేరకు రెవెన్యూశాఖ తరఫున ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్‌శర్మ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. 

Updated Date - 2022-01-28T02:26:05+05:30 IST