మల్లారెడ్డికి జోష్ ఎక్కువ.. తప్పేముంది..: కేటీఆర్

ABN , First Publish Date - 2021-08-27T20:29:34+05:30 IST

హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డికి జోష్, కోపం ఎక్కువ ఉందని.. ఆవేశంలో ఏదో అన్నారని, వయసును చూసి గౌరవం ఇవ్వకుండా కొందరు ఆయన్ను.. మాట్లాడుతున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో

మల్లారెడ్డికి జోష్ ఎక్కువ.. తప్పేముంది..: కేటీఆర్

హైదరాబాద్: మంత్రి మల్లారెడ్డికి జోష్, కోపం ఎక్కువ ఉందని.. ఆవేశంలో ఏదో అన్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మల్లారెడ్డి తప్పు ఏముందని ప్రశ్నించారు. టీఆర్ఎస్‌పై ఎవడెవడో.. ఏదేదో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. ప్రతి దానికి ఒక హద్దు ఉంటుందని.. దేనికైనా కొంత వరకే ఓపిక ఉంటుందన్నారు. అందుకే తమ వాళ్లు కూడా తిరిగి మాట్లాడతున్నారని చెప్పారు. ప్రజలు సుభిక్షంగా ఉంటే ఎందుకు రాజకీయాలు చేస్తున్నారని ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర దేనికోసం చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. 


వరదలు వచ్చిన సమయంలో మిగతా రాష్ట్రాలకు నిధులు ఇచ్చిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం.. తెలంగాణకు మొండి చేయి చూపించిందన్నారు. అయినా సిగ్గు లేకుండా ప్రజా సంగ్రామ యాత్ర చేస్తున్నారని ఎద్దేవా చేశారు. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, ఫిట్ ఇండియా , సిట్ ఇండియా, స్కిల్ ఇండియా అయిపోయి.. బేచో ఇండియా అనే కార్యక్రమాన్ని మొదలుపెట్టారన్నారు. మౌలాళిలో 21ఎకరాల రైల్వే భూములను అమ్మకానికి పెడుతున్నారని ఆరోపించారు. దేశంలో రూ.6లక్షల కోట్ల ఆస్తులను అమ్మకానికి పెడుతున్నారని. అందులో మౌలాళి భూములు కూడా భాగమని చెప్పారు. మహారాష్ట్రలో చేసినట్లు ఇక్కడ చేస్తే ఊరుకోమని పేర్కొన్నారు.


తెలంగాణను పుట్టించింది, తెచ్చింది.. సీఎం కేసీఆర్ అని కేటీఆర్ తెలిపారు. సీఎం కేసీఆర్ కాలి గోటికి కూడా సరిపోని వారంతా ఏవేవో మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి.. పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్నారని విమర్శించారు. మల్లారెడ్డి వంటి పెద్దవారిని ఏదిపడితే అది మాట్లాడుతున్నారని తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడిగా ఎవరూ దొరక్క.. చంద్రబాబునాయుడు తొత్తు, బినామీ అయిన రేవంత్‌కు పదవి ఇచ్చారని ధ్వజమెత్తారు. రేవంత్ అంతలా మాట్లాడుతుంటే.. తాము ఇంకెంత మాట్లాడాలన్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ.. సామెత గుర్తుకు తెచ్చుకోవాలని కేటీఆర్ పేర్కొన్నారు.

Updated Date - 2021-08-27T20:29:34+05:30 IST