అగ్నిపథ్‌ను పునఃసమీక్షించాలి

ABN , First Publish Date - 2022-06-18T08:51:15+05:30 IST

ఆర్మీలో చేరి దేశానికి సేవచేయాలని ఎదురుచూస్తున్న కోట్ల మంది యువత ఆశలపై నీళ్లు చల్లుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం

అగ్నిపథ్‌ను పునఃసమీక్షించాలి

యువతను వంచించేలా కేంద్రం నిర్ణయం

దేశంలో అల్లర్లకు కేంద్రానిదే బాధ్యత: కేటీఆర్‌

 

హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ఆర్మీలో చేరి దేశానికి సేవచేయాలని ఎదురుచూస్తున్న కోట్ల మంది యువత ఆశలపై నీళ్లు చల్లుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని, వివాదాస్పద అగ్నిపథ్‌ పథకాన్ని కేంద్రం పునఃసమీక్షించాలని మంత్రి కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో జరిగిన ఘటనపై ఓ ప్రకటనలో ఆయన స్పందించారు. వ్యవసాయ చట్టాలతో మొన్నటి దాకా రైతులను గోసపెట్టిన కేంద్రం.. ఇప్పుడు కొత్త విధానంతో యువతనూ నిర్వేదంలోకి నెట్టిందని అన్నారు. ‘‘దేశవ్యాప్తంగా నిరుద్యోగ యువత చేస్తున్న అల్లర్లకు కేంద్రమే పూర్తి బాధ్యత వహించాలి. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనలు నిరుద్యోగ సంక్షోభానికి నిదర్శనం. పెద్దనోట్ల రద్దు, జీఎస్టీ, లాక్‌డౌన్‌, సీఏఏ వంటి నిర్ణయాలతో దేశాన్ని మోదీ ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టింది. ఇపుడు అగ్నిపథ్‌ పేరిట దేశభద్రతను సైతం ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పడం వారి డొల్లతనానికి నిదర్శనం.


అగ్నిపథ్‌లో నాలుగేళ్లు ఆర్మీలో పనిచేసి, 75 శాతం మంది తిరిగి నిరుద్యోగులుగా మారే పరిస్థితి ఉంది. నాలుగేళ్లు పనిచేసి బయటకు వచ్చిన అగ్నివీరులకు ప్రైవేటు రంగంలో ఉపాధి అవకాశాలు దొరుకుతాయని కేంద్రం చెబుతున్న మాటలు శుద్ధ అబద్ధం. ఇప్పటికే ఏళ్ల తరబడి ఆర్మీలో పనిచేసి బయటకు వచ్చిన మాజీ సైనికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించడంలో కేంద్రం విఫలమైంది. పెన్షన్‌ డబ్బులు ఆదా చేసేందుకు చౌకబారు నిర్ణయం తీసుకుని దేశ భద్రత కన్నా ఆర్థికపరమైన అంశాలకే బీజేపీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. కేంద్రం కళ్లు తెరిచి ఈ విధానాన్ని వెంటనే పున:సమీక్షించాలి’’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. అలాగే వన్‌ ర్యాంక్‌-వన్‌ పెన్షన్‌ అన్న కేంద్రం.. నేడు ర్యాంకూ లేదు. పింఛనూ లేదన్నట్లు వ్యవహరిస్తోందని ఆయన మండిపడ్డారు.


‘‘వ్యవసాయ చట్టాలు రైతులకు అర్థం కావు. వ్యాపారులకు జీఎస్టీ అర్థం కాదు. పెద్దనోట్ల రద్దు సామాన్యులకు అర్థం కాదు. సీఏఏ ముస్లింలకు అర్థం కాదు. ఎల్పీజీ ధరలు గృహిణులకు అర్థం కావు. ప్రస్తుతం అగ్నిపథ్‌ యువతకు అర్థం కాదు. విశ్వగురుకు మాత్రమే ఆ అర్థం తెలియాలి’’ అని ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ కేటీఆర్‌ విమర్శించారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఘటనపై రాష్ట్ర మంత్రులు పలువురు విచారం వ్యక్తం చేశారు. అగ్నిపథ్‌ను తక్షణం విరమించుకోవాలని వారంతా వేర్వేరు ప్రకటనల్లో డిమాండ్‌ చేశారు. అగ్నిపథ్‌ విధానం అనాలోచితమైన నిర్ణయమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. కేంద్రం తీసుకున్న అసంబద్ధ నిర్ణయం వల్లే యువత నిరసనలు చేపట్టిందని, ఆ నిరసన ప్రదర్శనలో వరంగల్‌ జిల్లాకు చెందిన యువకుడు మృతి చెందాడని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు.


అగ్నిపథ్‌ను వెనక్కు తీసుకోవాలని మంత్రులు కొప్పుల ఈశ్వర్‌, ఇంద్రకరణ్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ ఘటన వెనుక టీఆర్‌ఎస్‌ ఉందన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ చేసిన ఆరోపణలు అర్ధరహితమని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు అమలు చేస్తున్న తప్పుడు విధానాల కారణంగా దేశం అధోగతి పాలవుతోందని ఎమ్మెల్యేలు కేపీ వివేకానంద, కాలేరు వెంకటేశ్‌ విమర్శించారు. అగ్నిపథ్‌ను వ్యతిరేకిస్తూ జరుగుతున్న నిరసన ప్రదర్శనలకు కేంద్రమే బాధ్యత వహించాలని టీఆర్‌ఎస్వీ నేతలు అన్నారు.  


రాకేశ్‌ మృతిపై సీఎం కేసీఆర్‌ దిగ్ర్భాంతి

25 లక్షల ఎక్స్‌గ్రేషియా, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం

హైదరాబాద్‌, జూన్‌ 17 (ఆంధ్రజ్యోతి): ఆర్మీ ఉద్యోగాల నియామకానికి కేంద్రం ప్రకటించిన  ‘అగ్నిపఽథ్‌’ పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌ రైల్వే ేస్టషన్‌లో శుక్రవారం ఆందోళన చేస్తున్న యువతపై రైల్వేపోలీసులు జరిపిన కాల్పుల్లో రాకేశ్‌ మృతి చెందడం పట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వ దుర్మార్గవిధానాలకు బీసీ బిడ్డ రాకేశ్‌ బలైపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. రాకేశ్‌ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాతో పాటు ఆ కుటుంబంలో అర్హులైన ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్లు సీఎం ప్రకటించారు. తెలంగాణ బిడ్డలను రాష్ట్ర ప్రభుత్వం కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుందన్నారు.

Updated Date - 2022-06-18T08:51:15+05:30 IST