వారిపై కన్నేసిన మంత్రి KTR

ABN , First Publish Date - 2022-06-20T21:37:59+05:30 IST

Hyderabad: పార్టీ నేతల పక్క చూపులతో టీఆర్ఎస్ (TRS) అధిష్టానం అప్రమత్తమైంది.

వారిపై కన్నేసిన మంత్రి KTR

Hyderabad: పార్టీ నేతల పక్క చూపులతో టీఆర్ఎస్ (TRS) అధిష్టానం అప్రమత్తమైంది. అసంతృప్తి నాయకులపై ఫోకస్ పెట్టింది. పార్టీ వీడ కుండా బుజ్జగింపుల ప్రయత్నాలు ప్రారంభించింది. అందుకోసం టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (KTR) స్వయంగా రంగంలోకి దిగారు. అసంతృప్తి నేతల ఇళ్లకు వెళ్లి వారిని కూల్ చేస్తున్నారు.


నిన్నటి వరకు పార్టీలో అసంతృప్తి రాగాలను టీఆర్ఎస్ బాస్ లైట్ తీసుకున్నారు. రోజుకొక నేత కారు దిగడం, అసంతృప్తి నేతలు పక్కచూపులు చూస్తుండడంతో అప్రమత్తమయ్యారు. డ్యామేజ్ కంట్రోల్ కోసం చర్యలు మొదలుపెట్టారు. అందుకోసం స్వయంగా మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగారు. మూడోసారి అధికారంలోకి రావాలని భావిస్తున్న గులాబీ దళానికి పరిస్థితి అంత అనుకూలంగా లేదు. టీఆర్ఎస్‌ను గద్దెదించేందుకు కాంగ్రెస్, బీజేపీ కాచుకుని ఉన్నాయి. అధికార పార్టీలో పోటీచేసే అవకాశం రాని నేతలకు గాలం వేస్తున్నాయి.


మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదేలును పార్టీలోకి లాగేసుకున్న కాంగ్రెస్ నేతలు.. జీహెచ్ఎంసీలో సిట్టింగ్ కార్పొరేటర్ పీజేఆర్ కుమార్తె విజయారెడ్డితో జరిపిన చర్చలు సక్సెస్ అయ్యాయి. ఈ నెల 23న ఆమె కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు. మరికొందరు కార్పొరేటర్లు, మాజీ ఎమ్మెల్యేలు కూడా కారు దిగడానికి సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతోంది. దాంతో టీఆర్ఎస్ అప్రమత్తమైంది. ఆయా నియోజకవర్గాల్లో గెలుపోటములు శాసించే నేతలను బుజ్జగించే పని కేటీఆర్‌కు సీఎం కేసీఆర్ అప్పగించారు. దాంతో జిల్లాల పర్యటన చేస్తున్న కేటీఆర్ అసంతృప్తి నేతలు, పార్టీతో అంటీ ముట్టనట్లుగా నాయకులతో చర్చిస్తున్నారు. వారికి సర్దిచెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.

Updated Date - 2022-06-20T21:37:59+05:30 IST