జీహెచ్‌ఎంసి పరిధిలో రెవెన్యూ సమస్యలపై కేటీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌

ABN , First Publish Date - 2020-09-26T22:55:22+05:30 IST

జంటనగరాల ప్రజలు నిశ్చింతగా వారి ఆస్తి హక్కులను పొందేలా, సమస్యలను పరిష్కరించేలా, పేద, మధ్యతరగతి ప్రజలకు వారి ఆస్తుల పట్ల హక్కులు కల్పించాలని ప్రయత్నిస్తున్నట్టు మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు.

జీహెచ్‌ఎంసి పరిధిలో రెవెన్యూ సమస్యలపై కేటీఆర్‌ వీడియో కాన్ఫరెన్స్‌

హైదరాబాద్‌: జంటనగరాల ప్రజలు నిశ్చింతగా వారి ఆస్తి హక్కులను పొందేలా, సమస్యలను పరిష్కరించేలా, పేద, మధ్యతరగతి ప్రజలకు వారి ఆస్తుల పట్ల హక్కులు కల్పించాలని ప్రయత్నిస్తున్నట్టు మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. జీహెచ్‌ఎంసి పరిధిలో వివిధ కాలనీల్లో సంవత్సరాలుగా పేరుకుపోయిన రెవెన్యూ సమస్యలపై జీహెచ్‌ఎంసి ప్రధాన కార్యాలయం నుంచి మంత్రి కేటీఆర్‌ శనివారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ హైదరాబాద్‌నగరం గత ఆరు సంవత్సరాల్లో దేశంలోని లక్షలాది మందికి ఆకర్షణీయ గమ్యస్థానంగా మారిందన్నారు.


ఒక వైపు పెట్టుబడులు మరోవైపు పరిపాలనాసంస్కరణలు, రాజకీయ స్థిరత్వంతో పెద్ద ఎత్తున హైదరాబాద్‌ విస్తరిస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం నూతన రెవెన్యూ చట్టం తీసుకు వచ్చి ప్రతి ఒక్కరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా తమ వ్యవసాయ భూముల పై హక్కులనుకల్పించాలనే లక్ష్యంతో ముందుకు పోతోంది. సామాన్యుడిపై ఎలాంటి భారం పడకుండా వారికి అండగా ఉంటూ అవినీతికి పాతర వేస్తూ నూతన చట్టానికి రూపొందించామన్నారు.


రాష్ట్రంలో భవిష్యత్‌లో అన్ని రిజిస్ర్టేషన్‌లు ధరణి పోర్టల్‌ ఆధారంగానే జరుగుతాయి. వ్యవసాయ, వ్యవసాయేతర ఆస్తులకి ప్రత్యేకంగా రెండువేర్వేరు రంగుల్లో పాస్‌ పుస్తకాలు ఇస్తామని మంత్రి తెలిపారు. ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో దాదాపు భూ సమస్యలన్నీ తొలగిపోయాయి. వ్యవసాయేతర ఆస్తుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 


హైదరాబాద్‌ నగరంలో సుమారు 24 లక్షల 50వేల ఆస్తులు ఉన్నట్టు అంచనా అన్నారు. ఇందులో వివిధ కారణాలతో కొన్నిఆస్తుల హక్కులపై సమస్యలు ఉన్నాయన్నారు. ప్రభుత్వానికి ప్రజల నుంచి అదనంగా డబ్బులు వసూలు చేయాలన్న ఆలోచన మాత్రం లేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. 


Updated Date - 2020-09-26T22:55:22+05:30 IST