జనాభాకు అనుగుణంగా పోషకాహార భద్రత పెద్ద సవాలు:Niranjan reddy

ABN , First Publish Date - 2022-05-12T21:42:34+05:30 IST

పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా వారికి పోషకాహార భద్రత కల్పించడం పెద్ద సవాలు వంటిదేనని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(singireddy niranjan reddy)అన్నారు.

జనాభాకు అనుగుణంగా పోషకాహార భద్రత పెద్ద సవాలు:Niranjan reddy

హైదరాబాద్: పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా వారికి పోషకాహార భద్రత కల్పించడం పెద్ద సవాలు వంటిదేనని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి(singireddy niranjan reddy)అన్నారు.ప్రపంచ జనాభా ఇప్పటికే 7.6 బిలియన్లకు చేరుకుంది.అది 2050 నాటికి 9.9 బిలియన్లకు చేరుతుందని అంచనా అని ఆయన అన్నారు.జనాభా పెరుగుదల, పట్టణీకరణ, మారుతున్న ఆహార అలవాట్ల కారణంగా ఆహార ధాన్యాల కోసం ప్రపంచ డిమాండ్ పెరుగుతున్నదని చెప్పారు. అందుకే పంటల ఉత్పత్తి, ఉత్పాదకతను మెరుగుపరచడంలో నాణ్యమైన విత్తనానిది కీలక పాత్ర అన్నారు.భారత వ్యవసాయోత్పత్తి ప్రతి సంవత్సరం స్థిరంగా పెరుగుతూ వస్తున్నదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. ఈజిప్ట్ రాజధాని కైరోలో జరుగుతున్న 33వ ఇస్టా విత్తన కాంగ్రెస్ సదస్సులో ఇస్టా 2022 - 2025 ఎగ్జిగ్యూటివ్ కమిటీ ఎన్నిక సంధర్భంగావ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రసంగించారు. 


ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇస్టా వంటి అంతర్జాతీయ సంస్థలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులకు, ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచడంలో ప్రముఖ పాత్ర, బాధ్యతను వహిస్తున్నాయని అన్నారు.విత్తన నాణ్యత పరీక్ష వ్యవస్థను అభివృద్ధి చేయడంలో ఇప్పటికీ ప్రారంభ దశలో ఉన్న అభివృద్ధి చెందుతున్న దేశాల కోసం విత్తన నాణ్యత పరీక్ష వ్యవస్థను అభివృద్ధి చేయవలసిన అవసరం ఉన్నదని చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా విత్తన పరిశ్రమల అభివృద్ధి స్థాయి ఒకేరీతిగా లేదు, ప్రాంతాలు/దేశాల మధ్య గణనీయంగా మారుతున్నాయన్నారు. విత్తన నమూనా,పరీక్ష కోసం ప్రామాణిక విధానాలను అభివృద్ధి చేయడం, ప్రపంచవ్యాప్తంగా ఒకే విధానాన్ని ప్రోత్సహించాలన్నారు. "ప్రపంచవ్యాప్తంగా విత్తన పరీక్షలో ఏకరూపత" అనే లక్ష్యం ద్వారా విత్తన నాణ్యత పరీక్షా వ్యవస్థలపరంగా అన్ని ప్రాంతాలను సమం చేయడానికి, అంతర్జాతీయ సరిహద్దుల ద్వారా విత్తన వాణిజ్యాన్ని పెంచడానికి ఇస్టా కీలకపాత్ర పోషించాల్సిన బాధ్యత ఉన్నదన్నారు.


తొలిసారి ఆసియా నుండి, అందునా తెలంగాణ నుండి డాక్టర్ కేశవులు ఇస్టా అధ్యక్షుడిగా ఎన్నిక కావడం పట్ల గర్విస్తున్నామన్నారు.2022-25 కాలానికి కొత్తగా ఎన్నికైన ఇస్టా ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులందరినీ మంత్రి అభినందించారు. ఇది ఒక గొప్ప అవకాశం, రైతులకు నాణ్యమైన విత్తనాలను అందించడం,  ప్రపంచవ్యాప్తంగా విత్తన పరిశ్రమలకు మద్దతునిచ్చే ఇస్టా వారసత్వాన్ని కొనసాగించడం ఒక పెద్ద బాధ్యతగా చెప్పారు.ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయోత్పత్తి, ఆహార భద్రతను మెరుగుపరచడానికి ప్రపంచవ్యాప్తంగా ఉన్న రైతులకు నాణ్యమైన విత్తనాలను అందుబాటులోకి తీసుకురావడానికి ఈ సమావేశం ఫలితాలనిస్తుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు. 

Read more