అంతర్జాతీయ ఉత్పాదకతను అందుకోవాలి: Niranjan reddy

ABN , First Publish Date - 2022-05-29T00:18:45+05:30 IST

ఉత్పాదకత పెంచుకుంటేనే మార్కెట్ డిమాండ్ ను తట్టుకొని నిలబడగలుగుతామని, చైనా లాంటి దేశాలలో ఎకరాలో వంద క్వింటాళ్లు పండిస్తే మనం ఎకరాలో 30 క్వింటాళ్లు మాత్రమే పండించ గలుగుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(niranjan reddy) అన్నారు.

అంతర్జాతీయ ఉత్పాదకతను అందుకోవాలి: Niranjan reddy

హైదరాబాద్: ఉత్పాదకత పెంచుకుంటేనే మార్కెట్ డిమాండ్ ను తట్టుకొని నిలబడగలుగుతామని, చైనా లాంటి దేశాలలో ఎకరాలో వంద క్వింటాళ్లు పండిస్తే మనం ఎకరాలో 30 క్వింటాళ్లు మాత్రమే పండించ గలుగుతున్నామని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి(niranjan reddy) అన్నారు. ఉత్పత్తులను పెంచి అంతర్జాతీయ ఉత్పాదకతను అందుకోవాలని సూచించారు. హైదరాబాద్ చెంగిచెర్లలోని నేషనల్ రీసెర్చ్ సెంటర్ ఆన్ మీట్ (national research centre on meat)ను వనపర్తి గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం ప్రతినిధులు, పశుసంవర్ధక శాఖ అధికారులతో కలిసి శనివారం సందర్శించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మాంసం అయినా, వ్యవసాయ ఉత్పత్తులు అయినా అంతర్జాతీయ సగటుకు సమానంగా పండించగలిగితేనే అంతర్జాతీయ మార్కెట్ లో పోటీ పడగలుగుతామని అన్నారు.


దేశంలో వుండే గొర్రెలు 7-5 కోట్లు కాగా ఒక్క తెలంగాణలోనే 2 కోట్ల గొర్రెలున్నాయి. ఏడాదికి దేశ సగటు తలసరి మాంసం  వినియోగం 6 కేజీలని, కాని తెలంగాణ సగటు తలసరి వినియోగం 23 కేజీలుగా ఆయన తెలిపారు. అంటే మనకున్న గొర్లు కాక ప్రతీరోజు ఇతర రాష్ట్రాలవి దిగుమతి చేసుకుంటున్నామని, అందువల్ల మన గొర్ల సంఖ్య ఇంకా పెంచుకుంటూ, మాంసం దిగుబడి అధికంగా వచ్చే బ్రీడ్స్ ను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం వుందన్నారు. ఇప్పుడు సగటు గొర్రె మాంసం 13 కేజీలని, కనీసం 25 కేజీల సగటు సాధిస్తే మన భవిష్యత్ అవసరాలు తీరుతాయని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.


స్థానిక భాషలో ఉత్పాదకత పెంపునకు గల అవకాశాల వివరాలను ముద్రించి గొర్రెల, మేకల పెంపకందారులకు అందుబాటులో ఉంచాలన్నారు. తెలంగాణ ప్రభుత్వం గొర్రెల పునరుత్పత్తి కేంద్రం ఏర్పాటుకు ఆమోదించిందని, పరిశోధన కేంద్రం ఏర్పాటుకోసం కేంద్రానికి విజ్ఞప్తి చేస్తామని మంత్రి చెప్పారు.కంది, జొన్న, మొక్కజొన్న, పప్పుశనగ, ఉలవ, మినుము పంటల నూర్పిడి తర్వాత మిగిలే వ్యర్థాల మిశ్రమాలు గొర్రెల మేతకు ఎంతో ఉపయోగపడతాయని అన్నారు.గొర్రెల పెంపకం, మాంసం ఎగుమతుల్లో అంతర్జాతీయ ప్రమాణాలు అందుకోవాలని సూచించారు.నిజాం ముని మనవడు ఆస్ట్రేలియాలో గొర్రెల పెంపకం చేస్తున్నారు. పనిని ఎప్పుడూ నామోషీగా భావించకూడదని అన్నారు.



వనపర్తిలో అత్యాధునిక స్లాటర్ హౌజ్, మాంసం ప్రాసెసింగ్ ప్లాంట్ ను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు.దేశంలో ఎక్కువ గొర్రెలు ఉన్న ప్రాంతం తెలంగాణ అని, ఉమ్మడి పాలమూరు, ఉమ్మడి పాలమూరులో వనపర్తి ప్రాంతంలో ఎక్కువ గొర్రెలు ఉన్నాయని మంత్రి తెలిపారు.వనపర్తి గొర్రెలు, మేకల పెంపకం దారుల సంఘం ఆధ్వర్యంలోని 192 సంఘాలు మాంసం ఎగుమతుల మీద దృష్టి సారించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వనపర్తి గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం చైర్మన్ కురుమూర్తి యాదవ్, వైస్ చైర్మన్ చంద్రయ్యయాదవ్ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2022-05-29T00:18:45+05:30 IST