కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో పంటల వైవిద్యీకరణ మీద దృష్టి: నిరంజన్ రెడ్డి

ABN , First Publish Date - 2022-03-19T22:59:35+05:30 IST

తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పంటల వైవిద్యదీకరణ పై ప్రభుత్వం దృష్టి పెట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో పంటల వైవిద్యీకరణ మీద దృష్టి: నిరంజన్ రెడ్డి

జల్ గావ్ (మహారాష్ట్ర): తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పంటల వైవిద్యదీకరణ పై ప్రభుత్వం దృష్టి పెట్టిందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. పంటల మార్పిడి వైపు అడుగులు వేస్తున్న తెలంగాణకు మహారాష్ట్రంలో మాదిరి వసతులు, ల్యాబ్ లు ఎంతో అవసరమని అన్నారు. రైతాంగాన్ని ఇతర పంటల వైపు  మళ్లించే క్రమంలో ఈ ప్రాంతంలో సాగు చేస్తున్న పంటలవైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా రెండో రోజు శనివారం జల్ గావు సమీపంలోని జైన్ హిల్స్ లో ఉద్యాన సాగు, ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి ప్రాసెసింగ్ ప్లాంట్, టిష్యూ కల్చర్ మొక్కల తయారీ, మైక్రో ఇరిగేషన్, డ్రిప్ తయారీ యూనిట్, సోలార్ పంపుసెట్ల తయారీ కేంద్రాలను పరిశీలించారు. అలాగే టిస్యూ కల్చర్ ద్వారా అక్కడ అల్ట్రా హై డెన్సిటీ ప్లాంటేషన్ సాగు చేస్తున్న మామిడి, జామ జైన్ స్వీట్ ఆరంజ్, డ్రిప్ ఇరిగేషన్ ద్వారా అల్లం,ఆలు, టొమాటో పంటల సాగును కూడా మంత్రి పరిశీలించారు. 


ఈసందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి అవసరమైన ఉద్యాన మొక్కల ఉత్పత్తి, ప్రపంచంలోనే అతి పెద్ద మామిడి ప్రాసెసింగ్ ప్లాంట్, ప్రపంచంలోనే అతి పెద్ద టిష్యూకల్చర్ ల్యాబ్ ఇక్కడ ఉండడం దేశానికి గర్వకారణమని అన్నారు.మొక్క పుట్టినప్పుడే దానికి ఎలాంటి రోగాలు లేకుండా తీసుకువస్తున్నారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన సంస్థగా ఎదగడం గర్వకారణమని అన్నారు.ఇంత పెద్ద టిష్యూకల్చర్ ల్యాబ్ ఉన్నా డిమాండ్ కు తగిన మొక్కలు అందించలేకపోతున్నారని చెప్పారు. జల్గావ్ ప్రాంత అభ్యున్నతికి జైన్ వంటి సంస్థ చేస్తున్న కృషి అత్యద్భుతంగా వుందన్నారు. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న మొక్కలు ఉద్యానపంటల వైపు మళ్లుతున్న రైతాంగానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నదన్నారు.పంటల సాగుతో పాటు వాటి ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటు ఎంతో ముఖ్యం.ఇక్కడి ఆధునిక వ్యవసాయం అతి పెద్ద పరిశ్రమగా వర్ధిల్లడం దేశానికి గర్వకారణంగా వుందన్నారు. 


544 మిల్లీమీటర్ల అతి తక్కువ వర్షపాతం ఉన్న జల్గావ్ లో నీటి వినియోగం తీరు రైతాంగానికి ఆదర్శమన్నారు. 900 మిల్లీమీటర్ల వర్షంపడినా తెలంగాణలో కరువుగా పరిగణిస్తాం.ముఖ్యమంత్రి కేసీఆర్ కేవలం మూడేళ్లలో 600 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసే కాళేశ్వరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి నిర్మాణం పూర్తి చేసి సాగునీరు అందిస్తున్నారని తెలిపారు.కాళేశ్వరం నీటితో ఉత్తర తెలంగాణ, నల్లగొండ సస్యశ్యామలం అయిందన్నారు.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో దక్షిణ తెలంగాణ సస్యశ్యామలం కాబోతున్నదని చెప్పారు.మహారాష్ట్రలోని జాల్నా, జల్గావ్ ఇన్ని రోజులు తెలంగాణ ఎదుర్కొన్న సమస్యనే ఎదుర్కొంటున్నది. ఎత్తయిన తమ ప్రాంతంలో సాగునీటి సదుపాయం లేక రైతులు కురిసిన కొద్దిపాటి వర్షం నీళ్లతోనే లాభదాయక పంటలు పండించుకుంటున్నారని మంత్రి తెలిపారు.పెద్ద ఎత్తున ఫాం పాండ్ లు నిర్మించుకుని వాటిలో ఒడిసిపట్టుకున్న నీటితోనే పంటలు పండించుకుంటున్నారు. 


కేసీఆర్ దయవల్ల తెలంగాణ రైతాంగానికి సాగునీటి గోస తీరిందన్నారు. రైతులు సాంప్రదాయ పంటల సాగును వదిలేసి లాభదాయక పంటల వైపు అడుగులు వేయాలని సూచించారు.ఉమ్మడి రాష్ట్రంలో అప్పుల పాలయిన రైతులు ఆర్థికంగా స్థితిమంతులు కావాలన్నదే కేసీఆర్ ఆకాంక్షగా పేర్కొన్నారు. తెలంగాణ ప్రాంత పరిస్థితులకు దానిమ్మ, మామిడి, బత్తాయి, జామ అనుకూలంగా వుందన్నారు.అందుకే దేశంలో ఎక్కడా లేనివిధంగా వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరంటు, రైతుబంధు, రైతుభీమా పథకాలతో అన్నదాతకు అండగా నిలుస్తున్నామని చెప్పారు. ఈ సందర్భంగా మంత్రి వెంట ఎమ్మెల్యేలు  బాల్క సుమన్, గండ్ర వెంకట రమణా రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి , ఉద్యానశాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ సరోజినీదేవి, అసిస్టెంట్ డైరెక్టర్ సుభాషిణి తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-03-19T22:59:35+05:30 IST