రైతు భగవంతుని స్వరూపం: మంత్రి నిరంజన్ రెడ్డి

ABN , First Publish Date - 2022-03-20T22:55:11+05:30 IST

ప్రపంచంలో రైతు ఎక్కడైనా రైతే ... తన కోసం కాకుండా సాటి వారి కోసం కష్టపడేది రైతు మాత్రమేనని అందుకే రైతు అన్నదాత అయ్యాడని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు

రైతు భగవంతుని స్వరూపం: మంత్రి నిరంజన్ రెడ్డి

మహారాష్ట్ర(జల్గావ్): ప్రపంచంలో రైతు ఎక్కడైనా రైతే ... తన కోసం కాకుండా సాటి వారి కోసం కష్టపడేది రైతు మాత్రమేనని అందుకే రైతు అన్నదాత అయ్యాడని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు.ఒక విధంగా రైతు దేవుడితో సమానమని అన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్  రాష్ట్రంలో గోదావరి నీళ్లు సముద్రంలో వృధాగా కలిసేది. అందుకే నీళ్ల కోసమే తెలంగాణ ఉద్యమం మొదలయిందని, 14 ఏళ్లు ఉద్యమించి తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని అన్నారు.ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో మూడేళ్లలో గోదావరి నదిపై కాళేశ్వరం నిర్మించి 40 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని చెప్పారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా ఆదివారం మూడో రోజు పర్యటనలో జల్ గావ్ లోని జైన్ మైక్రో డ్రిప్ ఇరిగేషన్ & ప్లాస్టిక్ పార్క్, ప్రపంచంలో అతిపెద్ద టిష్యూ కల్చర్ ల్యాబ్ మరియు నర్సరీలు, ఉల్లి విత్తన క్షేత్రాలు సందర్శించారు. అలాగే జైన్ సంస్థల ఎండీ అజిత్ జైన్ తో భేటీ అయ్యారు. 


అనంతరం జల్ గావ్ జిల్లా రావేర్ తాలూకా తాందిల్ వాడి గ్రామంలో రైతులు ప్రేమానంద్ మహాజన్, ప్రశాంత్ మహాజన్ ల అరటి క్షేత్రాలను సందర్శించి, స్థానిక అరటి రైతులతో నిర్వహించిన సమావేశంలో పాల్గొని మంత్రి  ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టుతో 300 కిలోమీటర్ల మేర గోదావరి సజీవంగా నిలిచి ఉంటుందని అన్నారు.గోదావరిపై మూడు బ్యారేజీలు నిర్మించి నదిని వెనక్కు మళ్లిస్తున్నామని, ఒకప్పుడు వ్యవసాయానికి ఆరుగంటల కరంటు ఇవ్వడానికి ఎన్నో ఇబ్బందులు ఉండేవని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో 24 గంటల కరంటు ఉచితంగా వ్యవసాయానికి అందిస్తున్న ఏకైక ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అన్నారు.రైతుబంధు, రైతుభీమా పథకాలతో రైతులకు కేసీఆర్ వెన్నుదన్నుగా నిలుస్తున్నారు. మహారాష్ట్రలో విభిన్న రకాల పంటల సాగు ఎంతో బాగుందని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.


ఇక్కడ జల్ గావ్ ప్రాంతంలోనే 1.25 లక్షల ఎకరాలలో అరటి సాగు ఆదర్శనీయమన్నారు.దేశంలో పంటకాలనీలు రావాలి.రైతు కష్టానికి తగిన ఫలితం దక్కితే సమాజంలో అతనికన్నా ఉన్నతంగా ఎవరూ ఉండరని చెప్పారు. జల్గావ్ స్ఫూర్థితో తెలంగాణలో అరటి సాగును ప్రోత్సహిస్తామని మంత్రి తెలిపారు.కొంత మంది రైతులు అరటిసాగు వైపు మళ్లినా మిగతా రైతులకు అది దారి చూపుతుందన్నారు.మనకన్నా వనరులు తక్కువున్నా అనేక చిన్న దేశాలు ముందంజలో ఉన్నాయి. అన్ని వనరులు ఉన్న మనం అగ్రస్థానంలో లేకపోవడం బాధాకరమని అన్నారు. ఈసందర్భంగా మంత్రి వెంట ఎమ్మెల్యేలు బాల్క సుమన్, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, పెద్ది సుదర్శన్ రెడ్డి, ఉద్యాన శాఖ డైరెక్టర్ వెంకట్రామ్ రెడ్డి, ఉన్నతాధికారులు సరోజిని దేవి, సుభాషిణి, హాజరైన స్థానిక మాజీ ఎమ్మెల్యే రాజారాం మహాజన్, జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ నందు మహాజన్ తదితరులు ఉన్నారు. 

Updated Date - 2022-03-20T22:55:11+05:30 IST