వానాకాలానికి 24.45 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల కేటాయింపు

ABN , First Publish Date - 2022-04-18T21:20:50+05:30 IST

తెలంగాణలో వానాకాలం పంటలకు గాను 24.45లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేటాయించినట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు.

వానాకాలానికి 24.45 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువుల కేటాయింపు

హైదరాబాద్: తెలంగాణలో వానాకాలం పంటలకు గాను 24.45లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులను కేటాయించినట్టు వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. ఇదివరకే కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ ఆమోదించిందని అన్నారు. ఇందులో 10.5లక్షల మెట్రిక్ టన్నులు యూరియా,9.4 లక్షల మెట్రిక్ టన్నులు కాంప్లెక్సు ఎరువులు, 2.3 లక్షల మెట్రిక్ టన్నులు డీఎపీ, 2.25 లక్షల మెట్రిక్ టన్నులు ఎంఓపీ మరియు ఎస్ఎస్ పీ ఉన్నట్టు వెల్లడించారు. సోమవారం మంత్రుల నివాస సముదాయంలోని మంత్రి నివాసంలో నిర్వహించిన వానాకాలం ఎరువుల సరఫరాపై ఉన్నతస్థాయి సమీక్షలో మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశానికి వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఎరువుల విభాగం ఉన్నతాధికారులు రాములు, ప్రధాన ఎరువుల కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. 


ఈ సందర్బంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ మే నెలాఖరు నాటికి 5 లక్షల మెట్రిక్ టన్నుల యూరియాను సిద్దంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రానికి అవసరమైన డీఏపీ, కాంప్లెక్సు ఎరువులు జూన్ 15 నాటికి సిద్దంచేయాలన్నారు. మిగతా రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణలో సీజన్ ముందే ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో పక్కా ప్రణాళికతో అవసరమైన ఎరువులు అందుబాటులో ఉంచాలని చెప్పారు. రష్యా - ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో ఎరువుల తయారీకి అవసరమైన ముడి సరుకుల కొరతను సాకుగా చూపి కేంద్రం రాష్ట్రాలకు ఎరువుల సరఫరాను జాప్యం చేస్తున్నాయని మంత్రి విమర్శించారు. రైతుల శ్రేయస్సు కేంద్రానికి ఇది ఏమాత్రం సముచితం కాదన్నారు. అందుకే రాష్ట్రానికి అవసరమైన ఎరువుల కోసం కేంద్ర ఎరువులు, రసాయన శాఖకు లేఖ రాసినట్టు మంత్రి తెలిపారు. వివిధ పోర్టుల్లో అందుబాటులో ఉన్న డీఎపీ, కాంప్లెక్సు ఎరువులు తెలంగాణకు పంపించాలని కోరారు.


 రైతులు ఎరువులు మూస పద్దతిలో కాకుండా పంటకు అవసరమైన మేరకు, నేలలో పోషకాల లభ్యతను బట్టి వ్యవసాయ అధికారుల సూచనల మేరకు వినియోగించాలన్నారు. భూసార పరీక్షలు తప్పనిసరిగా నిర్వహించాలని, నేల ఆరోగ్యం మీద రైతులు శ్రద్దుపెట్టాలని ప్రభుత్వం అందించే పచ్చిరొట్ట ఎరువులు వినియోగించాలన్నారు. నేలలో తగినంత సేంద్రీయ కర్బనం లేనిదే ఎన్ని ఎరువులు వాడినా ప్రయోజనం లేదు.అవసరం లేని రసాయన ఎరువులు వాడడం మూలంగా పంట పెట్టుబడి పెరిగి, నేల ఆరోగ్యం క్షీణించి పంట దిగుబడి తగ్గుతుందని మంత్రి తెలిపారు. జీవ ఎరువులు, పశువుల ఎరువులు విరివిగా వాడాలన్నారు. సమగ్ర ఎరువుల యాజమాన్యంపై రైతులకు అవగాహన కల్పించడంలో ఎరువుల కంపెనీలు భాద్యత తీసుకోవాలని సూచించారు. మే నెలలో క్షేత్రస్థాయిలో అధికారులు అందరూ రైతులకు అవగాహన కల్పించాలన్నారు.

Updated Date - 2022-04-18T21:20:50+05:30 IST