పైసామే పీఏ

ABN , First Publish Date - 2021-04-18T05:19:21+05:30 IST

పైసామే పీఏ

పైసామే పీఏ

వైసీపీ కార్పొరేటర్లకు మంత్రి వెలంపల్లి పీఏ ఫోన్‌ కాల్స్‌

గెలుపునకు తానూ కారణమంటూ డబ్బు వసూళ్లు

ఒక్కొక్కరి వద్ద లక్ష రూపాయల వరకూ డిమాండ్‌ 

మంత్రాలకు చింతకాయలు రాలతాయో లేదో గానీ, మంత్రి గారి పేషీ నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌కు మాత్రం కాసుల వర్షం కురుస్తోంది. ‘కార్పొ రేషన్‌ ఎన్నికల్లో మిమ్మల్ని గెలిపించేందుకు మంత్రిగారు ఎంత కష్టపడ్డారో, మేమూ ఎక్కువే కష్టపడ్డాం. కాస్త మా శ్రమనూ గుర్తుపెట్టుకుని ఓ లక్ష రూపాయలు ఇవ్వండి. తర్వాత మీకు మేము ఎంతో ఉపయోగపడతాం..’ అధికార పార్టీ కార్పొరేటర్లకు ఇటీవల వస్తున్న ఫోన్‌కాల్స్‌ ఇవి. ఇదేదో బ్లాక్‌మెయిలర్‌, కిడ్నాపర్ల దగ్గర నుంచి కాదండోయ్‌. సాక్షాత్తూ మంత్రి పీఏ నుంచే. 

విజయవాడ, ఆంధ్రజ్యోతి : విజయవాడ కార్పొరేషన్‌ ఎన్నికల్లో మొత్తం 64 స్థానాలకు గానూ వైసీపీ కార్పొరేటర్లు 49 కైవసం చేసుకున్నారు. సెంట్రల్‌, తూర్పు నియోజకవర్గాల్లో మల్లాది విష్ణు, దేవినేని అవినాశ్‌ తమ అభ్యర్థులకు ఆర్థికంగా, నైతికంగా దన్నుగా నిలిచారు. పశ్చిమ నియోజకవర్గంలోని 22 డివిజన్లలో గెలుపు కోసం మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు చమటోడ్చాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆర్థిక వనరులను సమీకరించుకునేందుకు మంత్రి అనుచరులు స్థానిక వ్యాపారుల నుంచి పెద్ద ఎత్తున డబ్బు వసూలు చేశారు. ఇలా సుమారు రూ.20 కోట్ల వరకు సమీకరించినట్లు సమాచారం. ఇలా ఎవరికి వారు ఎన్నికల సమయంలో విచ్చలవిడిగా డబ్బు వసూలు చేసి వెనుకేసుకోవడాన్ని ప్రత్యక్షంగా చూసిన మంత్రి పేషీలోని ఓ పీఏకు డబ్బుపై మనసు లాగినట్లుంది. కొద్దిరోజులుగా వన్‌టౌన్‌లోని అధికార పార్టీ కార్పొరేటర్లకు ఫోన్లు చేయడం ప్రారంభించాడు. గెలుపు కోసం రాత్రింబవళ్లూ తాను కూడా బాగా కష్టపడ్డానని, తనకూ ఓ లక్ష రూపాయలు ఇవ్వాలని కోరడం మొదలుపెట్టాడు. ఎన్నికల్లో పార్టీ నుంచి అందిన మొత్తంలో కార్పొరేటర్‌ అభ్యర్థులు సగం వెనకేసుకున్నారని, ఆ సమాచారం మొత్తం తన వద్ద ఉందని సుతిమెత్తగా హెచ్చరిక కూడా చేస్తున్నాడు. మున్ముందు మంత్రి పేషీలో ఏ పని ఉన్నా తాను చూసుకుంటానని నమ్మ బలుకుతున్నాడు. దీంతో పీఏ ఫోనుకు ఎలా స్పందించాలో తెలియక కార్పొరేటర్లు తలలు పట్టుకుంటున్నారు. మంత్రికి ఫిర్యాదు చేద్దామంటే తమ అవకతవకలు ఎక్కడ బయటపెడతాడోనని భయపడి పోతున్నారు. అంత మొత్తం ఇచ్చుకోలేమంటూ కొందరు రూ.50వేల చొప్పున ముట్టజెప్పినట్లు సమాచారం.

Updated Date - 2021-04-18T05:19:21+05:30 IST